Share News

పచ్చదనం మిథ్య!

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:27 PM

వన సంపద పెంచాలనే సంకల్పం ఆదిలోనే అంతమైంది. హరితహారం పేరుతో గత ప్రభుత్వం నాటి మొక్కలు ఎక్కడా కనిపంచడం లేదు. తొలి నుంచే ఈ కార్యక్రమం నిర్లక్ష్యానికి గురైంది. ఆరంభ శూరత్వంలా మొక్కలు నాటాలనే ఆతృత తప్ప.. వాటిని బతికించుకోవాలనే ఆలోచన లేకుండా పోయింది.

పచ్చదనం మిథ్య!
భూపాలపల్లి అంబేద్కర్‌ చౌరస్తా నుంచి సుభాష్‌కాలనీకి వెళ్లే రహదారిలో కనిపించని మొక్కలు

కానరాని హరితహారం మొక్కలు

ఎక్కడా కనిపించని వైనం

నిధులన్నీ నిరుపయోగం

ప్రశ్నార్థకంగా పర్యావరణ పరిరక్షణ

ఈ ఏడాది ఇంకా రూపుదిద్దుకోని కార్యాచరణ

ఇప్పటి వరకు ముందడుగు వేయని కొత్త సర్కారు

భూపాలపల్లిటౌన్‌, జూలై 3: వన సంపద పెంచాలనే సంకల్పం ఆదిలోనే అంతమైంది. హరితహారం పేరుతో గత ప్రభుత్వం నాటి మొక్కలు ఎక్కడా కనిపంచడం లేదు. తొలి నుంచే ఈ కార్యక్రమం నిర్లక్ష్యానికి గురైంది. ఆరంభ శూరత్వంలా మొక్కలు నాటాలనే ఆతృత తప్ప.. వాటిని బతికించుకోవాలనే ఆలోచన లేకుండా పోయింది. నిధులెన్నీ కేటాయించినా అవి వాడిపోయిన మొక్కల్లా వ్యర్థమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నెలకొన్న పరిస్థితితే ఇందుకు నిదర్శనం. గతంలో నాటిన మొక్కలే ఇలా ఉండగా.. కొత్తగా కొలువుదీరిన సర్కారు వనమహోత్సవం పేరుతో కార్యక్రమానికి సిద్ధమవుతుండగా ఇందుకు ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. వనమహోత్సవానికి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు తమకు అందలేదని అధికారులు అంటున్నారు. పట్టణ శివారున బొగ్గు బావులు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం తదితర పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో కాలుష్యం ఇక్కడ కోరలు చాచుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణ పరిరక్షణ ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.

గత ఏడాది భూపాలపల్లి మునిసిపాలిటీ బడ్జెట్‌లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌గా రూ.21.87 లక్షలు కేటాయించారు. కానీ ఆ నిఽధులను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమైనట్లు ఆరోపణలున్నాయి. లక్ష మొక్కలు నాటాలనే లక్ష్యం నెరవేరలే దని తెలుస్తోంది. భూపాలపల్లి పట్టణంలో లక్ష మొక్కలు పెంచడం టార్గెట్‌ కాగా అందులో కనీసం 87శాతం కూడా పూర్తి కాలేదు. బ్లాక్‌ ప్లాంటేషన్ల కింద 2,870 మొక్కలు లక్ష్యంగా పెట్టుకుని వందశాతం నాటినట్లు అధికారులు చెబుతున్నా అందులో కనీసం 90శాతం మొక్కలు కూడా బతకలేదని తెలుస్తోంది. అలాగే అవెన్యూ ప్లాంటేషన్‌ (రోడ్లకు ఇరువైపులా) 200 మొక్కలు నాటినట్లు అధికారులు చెప్పారు. కానీ రోడ్లకు ఇరువైపులా మొక్కలే క నిపించడం లేదు. కానీ నాటిన మొక్కల్లో 93శాతం మొక్కలు బతికినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అలాగే శ్మశానవాటికల వద్ద నామమాత్రంగా మొక్కలు నాటారు. 2,230 మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నా వాటిలో 20శాతం మాత్రమే బతికినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ సంస్థలకు 2,100 పంచినట్లు చెప్పారు. విద్యా సంస్థలను, రియల్‌ ఎస్టేట్‌ స్థలాల్లో పెద్దగా మొక్కలు కనిపించడం లేదనే విమర్శలున్నాయి. అంతేకాకుండా మెప్మా (మహిళా సంఘాలు) ఆధ్వర్యంలో ఇంటింటికీ ఐదు మొక్కల చొప్పున పంచినట్లు లెక్కలు చెబుతున్నారు. ప్రజలు మాత్రం మూడు కాలనీల్లో మొక్కలే పంచలేదని అంటున్నారు. అయితే.. 93,824 మొక్కల లక్ష్యం ఉండగా 89,240 మొక్కలు నాటామని, వాటిలో 87శాతం బతికాయని అధికారులు లెక్కలు చెబుతున్నారు.

నాటడం.. నరికివేయడం..

మొక్కలను రోడ్లుకు ఇరువైపులా నాటడం.. అవి ఏపుగా పెరిగాక నరికివేయడం పరిపాటిగా మారింది. వీటిలో ఎక్కువగా సింగరేణి నాటిన మొక్కలే ఉన్నాయి. అలాగే మునిసిపాలిటీ వర్గాలు నాటిన వాటిలో విద్యుత్‌ తీగలకు అవరోధంగా ఉన్నాయి. అత్యధిక మొక్కలను స్తంభాల కింద నాటడంతో అవి ఏపుగా పెరగగానే విద్యుత్‌ అధికారులు నరికివేస్తున్నారు. దీంతో అత్యంత కాలుష్యం కలిగిన భూపాలపల్లిలో పర్యావరణ పరిరక్షణ లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సద్వినియోగం కాని గ్రీన్‌ బడ్జెట్‌

భూపాలపల్లి మనిసిపాలిటీకి గత ఆర్ధిక సంవత్సరం లో (2023-24) వచ్చే ఆదాయంపై 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయించారు. మునిసిపాలిటీ ఆదాయం రూ.8.56 కోట్లు వస్తే.. అందులో 85.63లక్షలు వెచ్ఛిం చాల్సి ఉంది. కానీ కేవలం రూ.21.87 లక్షలు ఖర్చు చేసి, లక్ష మొక్కలను కూడా నాటలేదనే ఆరోప ణలున్నాయి. ఒక నర్సరికీ ఇంకా రూ. 20లక్షలు చెల్లించలేదని తెలిసింది. అలాగే మెప్మా వారికి 84 వేల మొక్కలు లక్ష్యంగా కేటాయించి వారికి రూ.5 లక్షలు మంజూరైనట్టు అఽధికారులు చెబుతున్నారు. ఆ మొక్కలను శాంతినగర్‌, జవహర్‌కాలనీ, లక్ష్మీనగర్‌లో పంచలేదని ఆయా కాలనీవాసులే చెబుతున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 11:28 PM