ఆపరేటర్ల తప్పిదం.. అర్హులకు శాపం
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:24 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలోని గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అర్హులందరికీ అందడం లేదు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్ చేసే క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌లు చేసిన తప్పిదాలు కొంత మంది అర్హుల పాలిట శాపంగా మారుతున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తుదారులకు తప్పని తిప్పలు
ఆన్‌లైన్ నమోదులో పొరపాట్లు
సవరణకు అవకాశం లేక ఇబ్బందులు
అందరికీ అందని గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు
ఎడిట్ ఆప్షన్ ఇవ్వడమే పరిష్కారమంటున్న సిబ్బంది
రఘునాథపల్లి, జూలై 30: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలోని గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అర్హులందరికీ అందడం లేదు. ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్ చేసే క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌లు చేసిన తప్పిదాలు కొంత మంది అర్హుల పాలిట శాపంగా మారుతున్నాయి. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జిల్లాలో 200 యూనిట్‌లలోపు విద్యుత్‌ను ఉచితంగా పొందే అవకాశంతో పాటు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను పొందే అవకాశాన్ని చాలా మంది కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాలలో ప్రజాపాలన సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. అయితే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో అనేక తప్పులు దొర్లాయి. మీటర్ సర్వీస్ నంబర్లు, గ్యాస్ ఐడీ నంబర్లు ఎంట్రీ చేయడంలో అనేక తప్పిదాలు జరిగాయి. వాటిని సవరించేందుకు అవకాశం లేకపోవడంతో అర్హులైన కొందరికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఎడిట్ ఆప్షన్ లేక..
ప్రజాపాలన దరఖాస్తులను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వాటిని సవరించే కార్యక్రమం చేపట్టింది. అయితే సవరణలో కొన్ని పొరపాట్లను మాత్రమే సవరించుకునేందుకు అవకాశం ఉంది. ఎక్కువ శాతం దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఎడిట్ ఆష్షన్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా అనేక మందికి సంక్షేమ పథకాలు అందడం లేదు. సమస్య పరిష్కారానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం ఒక్కటే మార్గమని సిబ్బంది అంటున్నారు. కేవలం మిస్ మ్యాచ్‌డ్ అని ఉన్న వాటికి ఎడిట్ ఆప్షన్ ఉండడంతో వాటిని సరి చేస్తున్నారు. అంటే ఒక దరఖాస్తుదారుడి నెంబరుకు ఇంకొక దరఖాస్తుదారుడి నెంబరు నమోదు చేయడం అన్న మాట. కానీ ఇలా లేనివాటిని కూడా సరి చేసేందుకు ఎడిట్ ఆప్షన్ తప్పనిసరి అంటున్నారు. ఎడిట్ ఆప్షన్ లేక తప్పులు సరి చేయకపోవడంతో సమస్య పరిష్కారం కోసం అర్హులందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని చెబుతున్నారు.
తొందరపాటు వల్లే లోపాలు
ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఏంట్రీ చేసేందుకు ప్రైవేటు వ్యక్తులను నియమించి ఒక్కో దరఖాస్తుకు ఇంత అని చెప్పడంతో ఎక్కువ దరఖాస్తులు ఏంట్రీ చేసేందుకు పోటీ పడ్డ క్రమంలో అన్ని తప్పులు దొర్లినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తులో గృహజ్యోతికి, మహాలక్ష్మికి టిక్ మార్క్ చేసినా..కొందరికి డేటా ఏంట్రీ ఆపరేటర్‌లు నాట్ అప్లై అని నమోదు చేశారు. దీంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతోంది. ప్రజాపాలన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
గృహజ్యోతి దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్..
గృహజ్యోతి దరఖాస్తుదారుల సమస్యను పరిష్కరించడానికి ఎట్టకేలకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. దీంతో చాలా వరకు ఆన్‌లైన్ ప్రక్రియలో జరిగిన తప్పులను సవరించే అవకాశం లబించింది. ఫలితంగా దాదాపు 90 శాతం మంది వినియోగదారులకు జీరో కరెంట్ బిల్ వస్తోంది. కాని మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ సిలిండర్ దరఖాస్తుదారులకు మాత్రం ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ప్రజాపాలనలో లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నపుడు ఇచ్చిన గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఏడు అంకెల నెంబర్‌ను మాత్రమే ఇచ్చారు..ఆన్‌లైన్ నమోదులో జరిగిన పొరపాటుతో కొందరు లబ్దిదారులకు గ్యాస్ సబ్సిడీ రాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీకి చెందిన 13 అంకెల నెంబర్‌ను ఆన్‌లైన్‌లో ఏంట్రీ చేసినప్పటీకి నాట్ మ్యాచింగ్ అని వస్తోంది. దీంతో గ్యాస్ సబ్సిడీ పొందేందుకు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన లబ్దిదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే ఇబ్బందులు తొలుగుతాయి
జి.శ్రీనివాసులు, ఎంపీడీవో- రఘునాథపల్లి
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేటప్పుడు దొర్లిన తప్పులను సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల తప్పులను సరిచేయలేకపోతున్నాం. గృహలక్ష్మి దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదులో జరిగిన తప్పులను ఎడిట్ ఆప్షన్ ద్వారా చాలా వరకు సవరించగలిగాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ దరఖాస్తులు కొన్ని నాట్ అప్లై అని నమోదు చేయడంతో దొర్లిన తప్పులను సవరించడానికి సరైన ఎడిట్ ఆప్షన్‌ను ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సరైన ఎడిట్ ఆప్షన్ వస్తేనే తప్పులను సరి చేసేందుకు వీలుంటుంది.