Share News

రూ.17.75 కోట్లు!

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:36 AM

పెండింగ్‌లో ఉన్న వాహనాల పన్ను వసూళ్లపై రవాణా శాఖ నజర్‌ పెట్టింది. ట్యాక్స్‌ కట్టకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో రోడ్‌ ట్యాక్స్‌ రెండేళ్లకు పైగా కట్టకుండా ఉన్న వాహనాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు.

రూ.17.75 కోట్లు!
వాహనాలను తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి శ్రీనివా్‌సగౌడ్‌ (ఫైల్‌)

జిల్లాలో పేరుకుపోయిన వాహనాల పన్నులు

వసూళ్లపై దృష్టి సారించిన రవాణా శాఖ

బకాయి ఉన్న వాహనాలకు నోటీసులు

అయినప్పటికీ చెల్లించకపోతే సీజ్‌

జనగామ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న వాహనాల పన్ను వసూళ్లపై రవాణా శాఖ నజర్‌ పెట్టింది. ట్యాక్స్‌ కట్టకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో రోడ్‌ ట్యాక్స్‌ రెండేళ్లకు పైగా కట్టకుండా ఉన్న వాహనాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు. దీంతో పాటు జిల్లాలో రవాణా శాఖ అధికారులు విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. ట్యాక్స్‌ చెల్లించకుండా పట్టుబడిన వాహనాలకు పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు.

జిల్లాలో భారీగా బకాయిలు..

జిల్లావ్యాప్తంగా 3389 వాహనాలకు సంబంధించి రూ. 17.75 కోట్ల రోడ్డు ట్యాక్స్‌ పెండింగ్‌లో ఉందని అధికారులు నిర్ధారించారు. గడిచిన రెండేళ్లుగా ఈ వాహనాలు రోడ్డు ట్యాక్స్‌ చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్నాయని గుర్తించారు. వాటికి ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 3389 వాహనాలకు గానూ రూ.11.93 కోట్లు రోడ్డు ట్యాక్స్‌ కాగా సకాలంలో చెల్లించకపోవడంతో రూ.5.82 కోట్ల ఫెనాల్టీ పడింది. మూడు చక్రాల వాహనాల (ఆటో)కు గత ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్‌ను రద్దు చేయగా.. నాలుగు చక్రాల వాహనాలు ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంది.

భారీగా జరిమానాలు

రోడ్డు రవాణా శాఖ నిబంధనల ప్రకారం రోడ్డు ట్యాక్స్‌ సకాలంలో చెల్లించని వాహనాలకు భారీగా జరిమానాలు పడనున్నాయి. రవాణా శాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ అయిన ప్రతీ గూడ్స్‌, కమర్షియల్‌ ప్లేట్‌ వాహనానికి రోడ్డు ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ మూడు నెలలకొకసారి వాహనాలకు ట్యాక్స్‌ కట్టాల్సి ఉంటుంది. నాలుగు చక్రాల వాహనాలైన లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మ్యాక్సీ క్యాబ్‌(క్రూయిజర్‌, తూఫాన్‌ వంటి ప్రజా రవాణా) వాహనాలు పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తాయి. బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లకు సీట్ల సంఖ్యను బట్టి, లారీలు, ఇతర గూడ్స్‌ రవాణా వాహనాలకు వాహన బరువు బట్టి పన్ను ఉంటుంది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఏటా ఏప్రిల్‌ నెల నుంచి మొదటి త్రైమాసికం(మూడు నెలలు) ప్రారంభం అవుతుంది. మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యాక్స్‌ను వాహన యజమానాలు ఏప్రిల్‌ నెలాఖరులోగా కట్టాల్సి ఉంటుంది. మొదటి నెల గ్రేస్‌ పీరియడ్‌ కింద మినహాయింపు ఇస్తారు. ఏప్రిల్‌ దాటి మే నెల వస్తే వాహన ట్యాక్స్‌లో 25 శాతం జరిమానా విధిస్తారు. మే నెల దాటి జూన్‌ వస్తే 50 శాతం పెనాల్టీ వేస్తారు. మొదటి త్రైమాసికం దాటినప్పటికీ ట్యాక్స్‌ చెల్లించని పక్షంలో 100 శాతం జరిమానా పడనుంది.

నెలలో 55 వాహనాలు సీజ్‌

పెండింగ్‌లో ఉన్న రోడ్డు ట్యాక్స్‌ వసూళ్లపై రవాణా శాఖ అధికారులు సీరియ్‌సగా ఉన్నారు. మొదటి త్రైమాసికం ట్యాక్స్‌ కట్టకపోతేనే పెద్ద మొత్తంలో జరిమానాలు వేస్తుండగా ఏకంగా రెండేళ్లకు పైగా ట్యాక్స్‌ కట్టకుండా రోడ్లపై తిరుగుతుండడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లా రవాణాశాఖ అధికారి జీవీ శ్రీనివా్‌సగౌడ్‌ నేతృత్వంలో అధికారులు జిల్లాలో నెల రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే ట్యాక్స్‌ చెల్లించని 55 వాహనాలను సీజ్‌ చేశారు. వీటిలో పలు పాఠశాలల బస్సులు కూడా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 3389 వాహనాలు ట్యాక్స్‌ పెండింగ్‌ ఉండగా ఇందులో 21 స్కూల్‌ బస్సులు ఉన్నాయి. వీటికి ఇదివరకే నోటీసులు ఇవ్వగా స్పందించని పక్షంలో సీజ్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

సకాలంలో ట్యాక్స్‌ చెల్లించాలి : జీవీ. శ్రీనివా్‌సగౌడ్‌, జిల్లా రవాణా శాఖ అధికారి

జిల్లాలో రోడ్డు ట్యాక్స్‌ చెల్లించే వాహన యజమానులు విధిగా ట్యాక్స్‌ చెల్లించాలి. ఏటా నాలుగు త్రైమాసికాలలో ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ త్రైమాసికంలో మొదటి నెల ఎలాంటి జరిమానా లేకుండా ట్యాక్స్‌ చెల్లించవచ్చు. నెల దాటితే 25శాతం, మరో నెల దాటితే 50 శాతం, మరో నెల దాటితే 100 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా రెండేళ్లుగా ట్యాక్స్‌ కట్టని 3389 వాహనాల యజమానులకు నోటీసులు ఇచ్చాం. ఇందులో 21 స్కూల్‌ బస్సులకు కూడా నోటీసులు ఇచ్చాం. నోటీసులపై స్పందించకపోతే వాహనాలను సీజ్‌ చేస్తాం. ఇప్పటికే జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. నెల రోజుల్లో ట్యాక్స్‌ కట్టని 55 వాహనాలను సీజ్‌ చేశాం.

Updated Date - Jun 28 , 2024 | 12:36 AM