Share News

పల్లె పాలన.. పట్టుతప్పుతోంది

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:53 PM

గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం గత జనవరితో ముగియగా ప్రభుత్వం పంచాయతీల పాలనా బాధ్యతలను అధికారులకు అప్పగించింది. ప్రతీ గ్రామానికి గెజిటెడ్‌ అధికారుల ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతుండడం... ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పల్లెల్లో పాలన పట్టుతప్పుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పల్లె పాలన.. పట్టుతప్పుతోంది
ఖిలాషాపూర్‌లోని పల్లె ప్రకృతి వనం

కుంటుపడుతున్న గ్రామ ప్రగతి

ప్రకృతి వనాలపై పట్టింపు కరువు

నిరుపయోగంగా నీటి ట్యాంకర్లు

పంచాయతీలను పట్టించుకోని ప్రత్యేకాధికారులు

క్షేత్రస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ

రఘునాథపల్లి, జూన్‌ 14: గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం గత జనవరితో ముగియగా ప్రభుత్వం పంచాయతీల పాలనా బాధ్యతలను అధికారులకు అప్పగించింది. ప్రతీ గ్రామానికి గెజిటెడ్‌ అధికారుల ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతుండడం... ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పల్లెల్లో పాలన పట్టుతప్పుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల మాదిరిగానే పల్లెల్లోను ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు గత ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ఎండుము ఖం పట్టి నిర్వహణ లోపంతో అధ్వానంగా మారుతు న్నాయి. జిల్లాలోని 281 గ్రామ పంచాయతీల పరిధి లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. పంచా యతీల్లో అధికారుల కొరత లేకుండా ప్రతి గ్రామానికి కార్యదర్శులను నియమించారు. అయినా పల్లె పాలన గాడిలో పడినట్లు కనిపించడం లేదు. గ్రామ ప్రగతి పై తప్పుడు నివేదికలిస్తూ అధికారులు తప్పించుకుం టున్నారనే ఆరోపణలున్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోయి నాలుగున్నర నెలలు గడచిపోతున్నా... పంచాయతీల పాలనలో ఎలాంటి మార్పు కనిపిం చడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రత్యేకాధికా రులు తమ శాఖాపరమైన విధులతో పల్లె పాలనపై దృష్టి సారించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. తాగు నీరు, సైడు కాలువలు, సీసీరోడ్లు, పారిశధ్య నిర్వహ ణను ప్రత్యేకాధికారులు పట్టించుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కళతప్పిన పల్లెప్రకృతి వనాలు

చాలా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతోపాటు నిర్వహణ లేక కళ తప్పాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నా పల్లె ప్రజలకు ఆహ్లాదం అందని ద్రాక్షగానే మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో మొక్కలు లేకుండానే పల్లె ప్రకృతి వనాలు దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో అడపాదడపా మొక్కలు నాటినా సంరక్షణ చర్యలు చేపట్టక పోవడంతో కనిపించకుండానే పోయాయి. కొన్ని చోట్ల మొక్కలు నాటకుండానే తప్పుడు లెక్కలు నమోదు చేసి బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వనాల చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, మేకలు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయి. కొన్నిచోట్ల కొద్దిపాటి మొక్కలను మాత్రమే నాటి పల్లె ప్రకృతి వనాల బోర్డులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే నర్సరీల్లో అవసరమై న మొక్కలు అందుబాటులో ఉండడం లేదు.

ఎక్కడి ట్యాంకర్లు అక్కడే..

గత ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, నీటి ట్యాంకర్‌ను అందించింది. దీంతో తడి, పొడి చెత్త సేకరణ, మొక్కలకు నీటిని సరఫరా చే యాల్సి ఉంది. కానీ, చాలా గ్రామాల్లో నీటి ట్యాంకర్లు నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీళ్లందించక పోవడం వల్ల వాటి పెరు గుదల మధ్యలోనే ఆగిపోయింది. చాలా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ, పారిశుధ్య నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకాధికారులు పంచాయతీ పాలనపై పట్టించుకోక పోవడంతో పల్లె ప్రగతి పనులు నిలిచిపోయాయి.

కార్యాలయాలకే పరిమితం..

గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కార్యా లయాలకే పరిమితమవుతు న్నారు. దీంతో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, సైడు కాలువలు, పైపులైన్లు, సీసీ రోడ్లు, పారిశుధ్యం అధ్వానంగా మారా యి. వివిధ శాఖలకు చెందిన మం డల స్థాయి గెజిటెడ్‌ అధికారు లను గ్రామాల ప్రత్యేక అధికా రులుగా నియమించడంతో వారి శాఖలకు చెందిన పను ల్లోనే తలమునకలవుతున్నారే తప్ప గ్రామాల సమస్యలపై దృష్టి సారించడం లేదని ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను నియమించినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదన్న విమర్శలున్నాయి.

అంకితభావంతో పనిచేయాలి...

- అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ డీపీవో

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించడం జరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటి పన్నులతో పాటు ఇతరత్రా పన్నులను సకాలంలో వసూలు చేయాలి. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

Updated Date - Jun 14 , 2024 | 11:53 PM