Share News

సమగ్ర‘శిక్ష’

ABN , Publish Date - Sep 24 , 2024 | 11:43 PM

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల సిబ్బందికి వెతలు తప్పడం లేదు. సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగు లు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఎంత వెట్టిచాకిరీ చేస్తున్నా పనికి తగ్గ వేతనం వీరికి అందడం లేదు. మందరూ మహిళలే అయినప్పటికీ వారికి కనీసం ఆప్షనల్‌ హాలీడేస్‌ దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

సమగ్ర‘శిక్ష’
భూపాలపల్లి పట్టణంలోని కేజీబీవీ పాఠశాల

కేజీబీవీల్లో వెట్టిచాకిరీ

పనికి తగిన వేతనం లేక టీచర్లు, సిబ్బంది సతమతం

సెలవులు తీసుకోవాలన్నా ఇబ్బందులే..

విద్యాలయాల్లో తీవ్రంగా ఉద్యోగుల కొరత

కేర్‌టేకర్‌, వాచ్‌వుమన్లు లేక భద్రత కరువు

భూపాలపల్లిటౌన్‌, సెప్టెంబరు 24: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల సిబ్బందికి వెతలు తప్పడం లేదు. సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగు లు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఎంత వెట్టిచాకిరీ చేస్తున్నా పనికి తగ్గ వేతనం వీరికి అందడం లేదు. మందరూ మహిళలే అయినప్పటికీ వారికి కనీసం ఆప్షనల్‌ హాలీడేస్‌ దొరకడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు హాస్టళ్లకు కేర్‌టేకర్లు, నైట్‌ వాచ్‌వుమన్లు లేక తమకు రక్షణ కరువుతోందనే ఆందోళన విద్యార్థినుల్లో వ్యక్తమవుతోంది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 12 మండ లాలు ఉన్నాయి. 11 మండలాల్లో కస్తూర్బా గాంధీ విద్యాల యాలు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం సుమారు 265 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బోధన సిబ్బంది (టీచర్లు) 125 మంది, బో ధనేతర సిబ్బంది సుమా రు 140 మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా మరో 38 మందిని బోధన సిబ్బందిని నియమించేందుకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ విద్యాలయాల్లో సిబ్బంది కొరత ఇంకా ఉంది. 14 మంది టీచర్లు, 50 నుంచి 60 మం ది వరకు ఇతర ఉద్యోగులు అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

సమస్యలతో సతమతం

కేజీబీవీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. స్పెషల్‌ అధికారి, సీఆర్‌టీ సహా కంప్యూటర్‌ ఆపరేటర్‌ సిబ్బంది అంతా చాలీచాలని వేతనాలతో ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ఎస్‌వోలకు జీతం రూ.33వే లు కాగా సీఆర్‌టీలకు రూ.26 వేలు అందుతోంది. సీఆర్‌పీలకు రూ.19,500, అకౌంటెంట్లకు రూ.14,300, కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.7,800 మాత్రమే ఇస్తున్నారు. అంతేకాదు.. ఏఎన్‌ఎంలు, నైట్‌ వాచ్‌ వుమన్లు, డే వాచ్‌ వుమన్లు, స్వీపర్లు, స్కావెంజర్లు.. ఇలా అందరికీ పనికి తగిన వేతనం ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.

కేర్‌టేకర్లు, వాచ్‌వుమన్లు లేక..

11 విద్యాలయాల్లో నాలుగింటిలో కేర్‌టేకర్లు, నైట్‌వాచ్‌వుమన్లు లేక విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా మల్హర్‌ మండలంలోని మల్లారం, గాదంపల్లి మధ్యలోని కేజీబీవీలో నైట్‌వాచ్‌వుమన్‌ లేక విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే టీచింగ్‌ స్టాఫ్‌ లేకపోవడంతో ఎనిమిది పీరియడ్లకు ఒకరే బోధించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు విద్యాలయాల్లో స్కావెంజర్లు లేక తీవ్ర సమస్య తలెత్తుతోందని అంటున్నారు.

ఆప్షనల్‌ హాలీడేలు లేక..

కేజీబీవీలో మహిళా ఉపాధ్యా యులే విధులు నిర్వర్తిస్తుంటారు. ఏదైనా పెద్ద పండుగ వచ్చినప్పుడు ఆ మరుసటి రోజు సెలవు తీసుకో వడానికి సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు ఆప్షనల్‌ హాలీ డేలు అధికా రులు మంజూరు చేస్తారు. కేజీబీవీల్లో మాత్రం అలాంటివి లేవని చెబుతున్నారు. హాలీడేలు లేకపో వడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఉపా ధ్యాయినులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్‌ ఇవే..

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం స్కేలు అమలు చేయాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ప్రతి ఉద్యోగికీ జీవిత బీమా రూ.10లక్షలు వర్తింపజే యాలని, ఆరోగ్యబీమా రూ.5లక్షలు వర్తింపజే యాలని, విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజీ కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వా లని కోరుతున్నారు. పదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని పర్మనెంటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యార్థినులకూ ఇబ్బందులే...

ఒక్కో కస్తూర్బాగాంధీ విద్యాలయంలో సుమారు 250 నుంచి 350 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో వేడినీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన సోలార్‌ సిస్టం పనిచేయడం లేదు. దీంతో విద్యార్థినులు చల్లని నీటితోనే స్నానం చేస్తున్నారు. మరుగుదొడ్లు సరిపోకపోవడంతో సమయం వృఽథా అవుతోందని వారు అంటున్నారు. పైగా పలుచోట్లా డోర్లు పాడైపోవడం, మరుగుదొడ్ల ట్యాంకులు నిండి వాటిని సకాలంలో శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. గతంలో మాదిరిగా న్యాప్కిన్స్‌ ఇవ్వడం లేదని, హెల్త్‌ కిట్‌కు బదులు రూ.100 చెల్లిస్తున్నారని తెలిపారు. అవి కూడా ఎప్పుడు మంజూరవుతాయో తెలియని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు అంటున్నారు.

Updated Date - Sep 24 , 2024 | 11:43 PM