Share News

తోడుకున్నోళ్లకు.. తోడుకున్నంత

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:05 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌, పలిమెల మండలాల్లో టీఎస్‌ఎండీసీ ద్వారా న డుస్తున్న ఇసుక క్వారీల్లో అదనపు బకెట్ల దందా జోరుగా సాగుతోంది. టీజీఎండీసీ, రెవెన్యూ, పోలీసు, జల వనరుల శాఖ.. తదితర విభాగాల నుంచి పూర్తి సహకారం ఉండటంతో కాంట్రాక్టర్లు స్వేచ్ఛగా పనికానిచ్చేస్తు న్నారు. ఇటీవల నీటి పారుదల శాఖ అధికారులు బ్యారేజీల్లో పూడికతీత పేరుతో ఇసుక రీచ్‌లకు ఎన్‌వోసీ ఇవ్వడంతో టీజీఎండీసీ రంగంలోకి దిగింది.

తోడుకున్నోళ్లకు.. తోడుకున్నంత
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం పలుగులలో క్వారీ వద్ద లోడ్‌ అవుతున్న ఇసుక

కాళేశ్వరంలో ఇసుక మాఫియా ఆగడాలు

అదనపు బకెట్లతో రోజుకు రూ.కోటిన్నర స్వాహా

లోడింగ్‌ పాయింట్లలో రూ.20 లక్షల వసూళ్లు

కాంట్రాక్టర్లతో పలు శాఖల అధికారుల కుమ్మక్కు

ములుగు జిల్లాలో పట్టా భూముల్లో కొత్త దందాలు

భూపాలపల్లి, జూలై 2: (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌, పలిమెల మండలాల్లో టీఎస్‌ఎండీసీ ద్వారా న డుస్తున్న ఇసుక క్వారీల్లో అదనపు బకెట్ల దందా జోరుగా సాగుతోంది. టీజీఎండీసీ, రెవెన్యూ, పోలీసు, జల వనరుల శాఖ.. తదితర విభాగాల నుంచి పూర్తి సహకారం ఉండటంతో కాంట్రాక్టర్లు స్వేచ్ఛగా పనికానిచ్చేస్తు న్నారు. ఇటీవల నీటి పారుదల శాఖ అధికారులు బ్యారేజీల్లో పూడికతీత పేరుతో ఇసుక రీచ్‌లకు ఎన్‌వోసీ ఇవ్వడంతో టీజీఎండీసీ రంగంలోకి దిగింది. ఈ ప్రాంతంలో 9 మంది కాంట్రాక్టర్లకు తవ్వకాల పనులను అప్పగించారు. కాంట్రాక్టర్లు ఇసుకను తీసి డంప్‌ యార్డులకు తరలించడం, అక్కడి నుంచి టీఎస్‌ఎండీసీ పర్యవేక్షణలో విక్రయాలకు లోడింగ్‌ చేయడం జరుగుతోంది. అయితే, స్టాక్‌ పాయింట్ల నుంచి లారీల్లోకి నింపే సమయంలో ఒక్కో లారీలో అదనంగా 5 నుంచి 10 టన్నుల వరకు ఓవర్‌లోడింగ్‌ జరుగుతోంది. ఇలా సగటున ఒక్కో లారీ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.20వేల మేరకు గండి పడుతోంది. ఒక్క క్యూబిక్‌ మీటర్‌కు టీజీఎండీసీకి రూ.600 చెల్లించి ఇసుక తీసుకుంటుండగా అదే ఇసుకను హైదరాబాద్‌లో టన్నుకు రూ.2వేల ధరకు విక్రయిస్తున్నారు. ఇలా సగటున ఒక్క కాళేశ్వరం ప్రాంతంలోనే రోజుకు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని తెలుస్తోంది. మరోవైపు లారీల సీరియల్‌ నంబర్‌ పేరిట ఆలస్యం కాకుండా తొందరగా లోడింగ్‌ చేయించేందుకు ఒక్కో దానిపై అనధికారికంగా రూ.3,500 వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వసూలు చేసుకున్న మొత్తం నుంచి క్షేత్ర స్థాయిలో ఉండే కాంట్రాక్టర్‌, గుమస్తా మొదలుకొని మైనింగ్‌, జియాలజీ, రెవెన్యూ, పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది, స్థానిక రాజకీయ నేతలు ఇతర వర్గాలకు ఏరోజుకారోజు మామూళ్ల పంపకాలు జరుగుతున్నాయని తెలిసింది. అక్రమ వసూళ్ల రూపంలో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు అదనంగా గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఓవర్‌ లోడింగ్‌ దందా నడుస్తున్నా అటు ఖనిజాభివృద్ధి సంస్థ గానీ, ఇటు పోలీసులు గానీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెండు రోజులుగా ఎస్పీ కిరణ్‌ఖరే రంగంలోకి దిగారు. తనిఖీల్లో భాగంగా 13 లారీలు ఓవర్‌లోడింగ్‌తో వెళ్తున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా పలుగుల క్వారీలో అదనపు బకెట్ల దందా జోరుగా జరుగుతోందని అంటున్నారు. అలాగే పలిమెల మండలంలోని మరో క్వారీలో అనుమతులు లేకపోయినా ఇసుక మాఫియా దర్జాగా తవ్వకాలు జరుపుతోందని తెలుస్తోంది. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలున్నా అక్రమార్కులు వాటిని తప్పించుకొని రవాణా చేస్తున్నారు. ఒకట్రెండు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినా అవి నిమిత్త మాత్రమేననే విమర్శలున్నాయి. ఇక, ఒకే వే బిల్లుపై పదుల కొద్దీ లారీల్లో ఇసుక తరలించడం గురించి కొత్తగా చెప్పనక్కరలేదు.

ములుగు జిల్లాలో దందా..

ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో పట్టా భూముల్లో పూడికతీత పేరుతో అనుమతులు తీసుకొని గోదావరి మధ్యలో తవ్వకాలు చేపడుతు న్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని పంట భూములు ముంపునకు గురైన సందర్భాల్లో ఇసుక మేటలు వేస్తుంది. ఆ ఇసుకను రైతులు అనుమతులు లేకుండా తీసుకుని, అమ్ముకునే అధికారం ఉంది. అయితే గత ప్రభుత్వం పట్టా భూముల ఇసుకను కూడా టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలను చేపట్టి ఆదాయ వనరుగా మార్చింది. దీంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోదావరి తీర ప్రాంతాల్లోని మండలాల్లో ఇసుక మాఫియా చక్రం తిప్పుతోంది. రైతుల పేరిట అనుమతులు తీసుకుని, వారికి ఎంతో కొంత ముట్టజెప్పి మాఫియా దోచేస్తోంది. ములుగు జిలా ్లలోని జంపన్నవాగుపై నకిలీ పట్టాలు సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. రికార్డుల్లో చూపిన సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో ప్రభుత్వ భూములుగా కనిపిస్తున్నాయి. అలాగే వాజేడు మండలం ధర్మారం లో 18 ఎకరాల్లో ఇసుక అనుమతులు పొందగా 3.9 ఎకరాలు మాత్రమే నిజమైన పట్టాలు. మిగిలిన భూమికి రికార్డులు తారుమారు చేశారని ఆదివాసీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంగపేట మండలం రాజుపేటలో పేదలకు గతంలో పంచిన అసైన్డ్‌ భూమిని ఇతరులకు పట్టాలు చేసి వారి పేరుతో ఇసుక అనుమతులు తీసుకున్నారన్న ఆరోప ణలున్నాయి. ఈ దందాలో రైతులకు ఒక్కో ఎకరానికి నామమాత్రంగా రూ.నాలుగైదు వేలు చెల్లించి రూ.ల క్షలను దళారులు దండుకుంటున్నారు. అనుమతులు ఇచ్చిన ప్రదేశంలో కాకుండా ఇసుక ఉన్న చోట తవ్వు కుంటున్నారు. టీఎస్‌ఎండీసీ అధికారులే దళారులతో కుమ్మక్కై ఇసుక రీచులన్నీ వారికి అప్పగిస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. పూడిక పేరుతో రైతుల భూము ల్లో తీసిన ఇసుకను రాష్ట్ర ఖనిజాభివృద్థి సంస్థ క్యూ బిక్‌ మీటర్‌కు రూ.600 వినియోగదారులకు ఆన్‌లైన్‌ విధానంలో విక్రయిస్తూ రూ.కోట్లు అర్జిస్తోంది. అదే సమయంలో రైతుకు మాత్రం ఎకరానికి రూ.100 మాత్రమే చెల్లించటం గమనార్హం.

Updated Date - Jul 03 , 2024 | 12:05 AM