Share News

కష్టాల కడలిలో కార్యదర్శులు

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:05 PM

గ్రామ కార్యదర్శులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమయానికి నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులే అయిదు నెలలుగా ట్రాక్టర్‌ డీజిల్‌తో పాటు ఇతరత్రా మరమ్మతుల కోసం సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు. దీనికి తోడు అధికారులు అప్పగిస్తున్న పలు సర్వేలతో ఇబ్బందులు పడుతున్నారు.

కష్టాల కడలిలో కార్యదర్శులు

ఆర్థిక ఇబ్బందుల్లో గ్రామ పంచాయతీలు

జీపీ కార్మికులకు అందని వేతనాలు

నిధులు లేక సొంత డబ్బులు వెచ్చిస్తున్న వైనం

సర్వేల పేరిట అదనపు భారం

పాలకవర్గాలు లేవు.. ప్రత్యేకాధికారులు పట్టించుకోరు

జిల్లాలో 265 మంది సెక్రెటరీలు

రఘునాథపల్లి, జూలై 6: గ్రామ కార్యదర్శులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమయానికి నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక పంచాయతీ కార్యదర్శులే అయిదు నెలలుగా ట్రాక్టర్‌ డీజిల్‌తో పాటు ఇతరత్రా మరమ్మతుల కోసం సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు. దీనికి తోడు అధికారులు అప్పగిస్తున్న పలు సర్వేలతో ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్మికులకు కొద్ది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారిని సముదాయించి పని చేయించడానికి కార్యదర్శులు పడుతున్న కష్టాలు అన్నీ..ఇన్నీ కావు..

గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి అయిదు నెలలు గడచిపోయింది. ప్రత్యేకాధికారులు ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 5 నెలల నుంచి, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 24 నెలల నుంచి పంచాయతీలకు రావడం లేదు. దీంతో పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామాభివృద్ధిలో ప్రముఖ భూమిక పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుత పరిస్థితుల్లో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు ఉండగా 265 మంది కార్యదర్శులు ఉన్నారు. మిగతా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గ్రామాల అభివృద్ధి పనులతో పాటు మరమ్మతులు తదితర వ్యవహారమంతా సర్పంచ్‌లు, పాలకవర్గాలు చూసుకునేది.. గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగియగా, ఆ వెంటనే ప్రభుత్వం ప్రతీ గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమించింది. ఇతర శాఖలో కీలకంగా ఉన్న గెజిటెడ్‌ అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు గ్రామాలపై సరైన దృష్టి సారించలేకపోతున్నారు. తమ మాతృ శాఖలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడో ఒక సారి గ్రామాలకు వెళ్తు సలహాలు, సూచనలకు మాత్రమే పరిమితమవుతున్నారు.

అంతా తామై..

పంచాయతీ పాలన భారం అంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరమ్మతు పనుల నిర్వహణ బాధ్యత, సిబ్బంది జీతభత్యాలు, పన్నుల వసూళ్లు, ఆదాయ, వ్యయం లావాదేవీలు, నెలవారి చెల్లింపులు తదితర విషయాలన్నీ పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరీ అప్పులు చేసి జీపీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని కార్యదర్శులు వాపోతున్నారు.

నిలిచిపోయిన నిధులు..

గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నిలిచిపోయాయి. ట్రాక్టర్‌కు అవసరమైన డీజిల్‌తో పాటు పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్య నిర్వహణ, సెగ్రిగేషన్‌ షెడ్లు, చెత్త దంపింగ్‌ యార్డులు, శ్మశానవాటిక నిర్వహణ, వాటర్‌ ట్యాంక్‌ల క్లోరినేషన్‌ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులే నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 5 నెలల నుంచి, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 24 నెలల నుంచి పంచాయతీలకు రావడం లేదు. దీంతో గ్రామ పంచాయతీల ఖాతాల్లో నిధుల కొరత ఏర్పడింది. జీపీ కార్మికుల జీతాలు ఇవ్వలేక, ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు కట్టలేక కార్యదర్శులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వసూలైన పన్నులు, ఇతరత్రా ఆదాయం సాధారణ ఖర్చులకే సరిపోవడం లేదు. ఏదైనా మరమ్మతులు, అత్యవసర అవసరాలకు పంచాయతీ కార్యదర్శులే తమ జేబులో నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు పాలకవర్గాలు లేక, నిధులు రాక, అటు ప్రత్యేకాధికారులు పట్టించుకోక అడకత్తెరలో పొకచెక్కలా కార్యదర్శులు నలిగిపోతున్నారు.

సర్వేలతో సతమతం

మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందాన పంచాయతీల పాలనతోనే అష్టకష్టాలు పడుతున్న పంంచాయతీ కార్యదర్శులపై సర్వేల భారం మోపుతున్నారు. దీంతో వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. తమ శాఖలకు సంబంధం లేని సర్వేలను అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటా మిషన్‌ భగీరథ నల్లాల వివరాలను నమోదు చేసే విషయంలో కార్యదర్శులే కీలకంగా వ్యవహరించారు.

సర్వేల నుంచి మినహాయించాలి..

- కనకం విజయ్‌ కుమార్‌, టీపీఎస్‌ఎఫ్‌ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం నిర్వహించే పలు సర్వేల నుంచి పంచాయతీ కార్యదర్శులను మినహాయించాలి. ఇప్పటికే పంచాయతీ పాలన భారం మోయలేక పోతున్నాం. ప్రత్యేకాధికారులు సలహాలు, సూచనలకే పరిమితం అవుతున్నారు. దీంతో గ్రామాలలో అత్యవసర పనుల కోసం సొంత డబ్బులను ఖర్చుపెడుతున్నాం. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి మా పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. పంచాయతీ రాజ్‌ శాఖ పనులే కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన పనులను సైతం మాతో చేయించడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి మాపై పని భారం తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

Updated Date - Jul 06 , 2024 | 11:05 PM