డ్రైపోర్టుకు అనువుగా...
ABN , Publish Date - Jun 21 , 2024 | 12:35 AM
దశాబ్దకాలం నాటి కల.. ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలో పొందుపరిచిన ఉక్కుఫ్యాక్టరీ ఇప్పట్లో సాకారమయ్యేలా లేదు. ఆ స్థానంలో ప్రత్యామ్నాయంగా డ్రైపోర్టు ఏర్పాటు చేసైనా మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా ఉపాధి కల్పన కోసం గిరిజన ప్రాబల్య జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. తీరప్రాంత తమిళనాడు ఆంధ్రప్రదేశ్‌లను కలిపే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న మహబూబాబాద్ జిల్లా లో డ్రైపోర్టు ఏర్పాటుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
దీనితోనైనా ఉపాధి లభిస్తుందని ఆశ
దశాబ్ద కాలంగా బయ్యారం ఉక్కు పెండింగే
డోర్నకల్ మండలం మీదుగా 365 ఎన్‌హెచ్, గ్రీన్‌ఫీల్డ్ హైవే..
భౌగోళికంగా ఎగుమతుల రేవుగా కోస్తా ప్రాంతాలు
జిల్లాలోని నిరుద్యోగుల ఎదురుచూపులు
మహబూబాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దకాలం నాటి కల.. ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలో పొందుపరిచిన ఉక్కుఫ్యాక్టరీ ఇప్పట్లో సాకారమయ్యేలా లేదు. ఆ స్థానంలో ప్రత్యామ్నాయంగా డ్రైపోర్టు ఏర్పాటు చేసైనా మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా ఉపాధి కల్పన కోసం గిరిజన ప్రాబల్య జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. తీరప్రాంత తమిళనాడు ఆంధ్రప్రదేశ్‌లను కలిపే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న మహబూబాబాద్ జిల్లా లో డ్రైపోర్టు ఏర్పాటుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఉత్తర-దక్షిణ రైలు మార్గాల నడుమ ఉన్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఇందుకు అనువైన ప్రదేశంగా తెరపైకి వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఆ తర్వాత దశాబ్ద కాలపు బీఆర్‌ఎస్ పాలనకు బైబై చెప్పిన తెలం గాణ రాష్ట్రప్రజలు మార్పు కోరుతూ కాంగ్రె్‌సను అధికారంలోకి తెచ్చారు. ఇకనైనా ఈ ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని నిరుద్యోగులు ఆశపడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో డ్రైపోర్టు ఏర్పాటుకుఅవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. తెలంగాణ స్టేట్ ఐపాస్ కింద పెట్టుబడులను ప్రొత్సాహించడంలో భాగంగాఇతరరంగాల్లో కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్న క్రమంలో డ్రైపోర్టు ప్రతిపాదన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా ఉత్పత్తి కేంద్రంగా అవతరించి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఓడరేవుల నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు పెంచడానికి డ్రైపోర్టు ఉపకరిస్తుందంటున్నారు.
విభజన చట్టంలో ఉక్కుతో పాటు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు డ్రైపోర్టు మంజూరు చేస్తామని పూర్వ కేంద్ర యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు కావాల్సిన స్థలాన్ని రాష్ట్రప్రభుత్వమే సేకరించాల్సిదేనని స్పష్టం చేసింది. ఆ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లాలో ఆపారంగా ఉన్న బయ్యారం, గూడూరు ఇనుప ఖనిజం గుట్టల ముడిసరుకు ద్వారా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. దశాబ్దకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనేక సర్వేలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఒక దశ లో బయ్యారం ఇనుప ముడి ఖనిజం ఫ్యాక్టరీ ఏర్పాటుకు సరిపోకుంటే ఛత్తీ్‌సగడ్‌లోని బైలాడిల్లా నుంచి ముడిసరుకు తెప్పించైనా ఫ్యాక్టరీ నడపవచ్చని రాష్ట్రం ప్రతిపాదించింది. ఆ తర్వాత వరుస ఎన్నికలు ఈ అంశం తాత్కాలికంగా మరుగునపడింది. అదే క్రమంలో రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. రెండు దఫాలు అధికారంలో కొనసాగిన బీఆర్‌ఎస్ ఈ అంశాన్ని మరుగున పడేసింది. వాస్తవానికి 2015 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కోదాడలో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తామని అప్పటి రాష్ట్రమంత్రి హరీ్‌షరావు సూచనప్రాయంగా ప్రకటించారు. అయితే డ్రైపోర్టు ఏర్పాటుకు కావాల్సిన భూముల రేట్లు కోదాడ ప్రాం తంలో ఆకాశాన్ని అంటుతుండడంతో ఆ ప్రయత్నాలు అప్పట్లోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇకనైనా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించాలని జిల్లాప్రజలు కోరుతున్నారు.
డ్రైపోర్టు అంటే..
సముద్ర మార్గం ద్వారా ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన వస్తువులు ఓడరేవుకు చేరుకుని.. అక్కడ్నుంచి రోడ్డు, రైలుమార్గాల ద్వారా నిర్దేశిత నగరాలు, ప్రదేశాలకు తరలిస్తారు. వాటికి సంబంధించిన ఎగుమతి, దిగుమతి సుంకాలను కేంద్రప్రభుత్వం పరిధిలో ఉండే సెంట్రల్ ఎక్సైజ్‌అండ్‌కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ చూస్తుంది. అలాంటి ప్రక్రియ డ్రైపోర్టులో కూడా ఉంటుంది. అయితే డ్రైపోర్టు మాత్రం భూభాగం పైనే ఏర్పాటు చేస్తారు. విదేశాలకు ఎగుమతు లు, దిగుమతులు ద్వారా వచ్చిన సరుకులను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన గోదాంలలో నిల్వ చేస్తారు. ఆయా సరుకులు కస్టమ్స్ తనిఖీల అనంతరం రవాణాకు అనుమతులు తీసుకునే అవకాశాలుంటాయి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా డ్రైపోర్టు ఏర్పాటు చేయాల్సి వస్తే తెలంగాణ జిల్లాల సరిహద్దు ఉత్తర, దక్షిణ రైలు మార్గాల నడుమ ఉన్న డోర్నకల్ రైల్వేస్టేషనే కీలకంగా మారుతుందని చెబుతున్నారు. డోర్నకల్‌లో రైల్వేకు సంబంధించిన విశాలమైన భూములు ఉండడం, ఒకవేళ ఇవి కూడా సరిపోకపోతే ప్రభుత్వం సేకరించేందుకు అనువుగా డోర్నకల్ చుట్టూర భూములు తక్కువ ధరలకు ఉండడం లాంటివి పరిగణలోకి తీసుకుంటే డ్రైపోర్టుకు డోర్నకల్ అనువైన స్థలంగా విశ్లేషిస్తున్నారు.
భౌగోళికంగా రేవు పట్టణాలకు చేరువలో..
కోస్తా ప్రాంతాల్లోని ప్రధాన రేవుపట్టణాలైన విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణప ట్నం తదితర కేంద్రాలకు తెలంగాణలోని మిగతా ప్రాంతాలకంటే భౌగోళికంగా డోర్నకలే అతి సమీపంలో ఉండడం విశేషం. రోడ్డు రవాణా కోణంలో చూస్తే 365 జాతీయరహదారి డోర్నకల్ మండలం మీదుగానే వెళ్తుం ది. కొత్తగా ప్రతిపాదనలో ఉన్న అమరావతి, నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే, గ్రీన్‌ఫీల్డ్ హైవేకూడా డోర్నకల్ ప్రాం తాన్ని అనుకుని వెళ్తున్నాయి. ఇప్పటికే 33 అడుగుల వెడల్పుతో నిర్మించిన రోడ్డు డోర్నకల్ పట్టణానికి మహబూబాబాద్‌కు అనుసంథానంలో ఉంది. డోర్నకల్ ద్వారా రోడ్డు మార్గంలో ఏన్కూరు, తల్లాడ, సత్తుపల్లి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ప్రయాణిస్తే కాకినాడ వస్తుంది. మరోపక్క తిరువూరు, నూజీవీడు, హనుమాన్ జంక్షన్ నుంచి మచిలీపట్నం పోర్టు వస్తుంది. చెన్నై, కోల్‌కత్తా జాతీయ రహదారి ద్వారా విశాఖపట్టణం, గంగవరం, కృష్ణపట్నం రేవులకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతులు చేసే అవకాశాలు ఉంటాయి.
వివిధ దేశాలకు ఎగుమతులు ఇలా..
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే గ్రానైట్, పాలిషింగ్ గ్రానైట్, చైనా, జపాన్ దేశాలకు ఎగుమతవుతోంది. ఇంకా బియ్యం, మొక్కజొన్న, మిర్చి, పసుపు, పత్తి తదితర వ్యవసాయ ఉత్పత్తులు, ఇండోనేషియా, థాయిలాండ్, వియాత్నం, తూర్పు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో తయారయ్యే భారీ యంత్ర పరికరాలు కూడా ఎగుమతులు చేసే అవకాశాలు లభిస్తాయి. డ్రైపోర్టుల ద్వారా నిత్యం వివిధ సరుకుల ఎగుమతులు, దిగుమతులు కొనసాగించే కేంద్రానికి అనుసంథానంగా రవాణా కార్యాలయాలు, షిఫ్టుల వారీగా 24 గంటలు పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబాలు ఇలా అన్నిరంగాలకు సంబంధించి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి పొందడానికి అవకాశాలు కలుగుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుంది. ఇప్పటికి దశాబ్దాల కాలానికి పైగా బయ్యారం ఉక్కు ఏర్పాటు పెండింగ్‌లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే (బీజేపీ) అధికారంలో ఉన్న దరిమిల కనీసం డ్రైపోర్టునైనా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు తీసుకువచ్చేలా ప్రజాప్రతినిదులు చొరవ చూపాలని నిరుద్యోగులు కోరుతున్నారు.