Share News

కొనుగోళ్లపై సస్పెన్స్‌!

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:06 PM

జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తు ల కొనుగోలుపై సస్పెన్స్‌ నెలకొంది. ఈనెల 10న జరిగిన ఘటన నేపథ్యంలో ట్రేడర్లు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేసి హమాలీల సమస్యను పరిష్కరించే వరకు కొనుగోళ్లు జరపబోమని భీష్మించుకుకూర్చున్నారు.

కొనుగోళ్లపై సస్పెన్స్‌!
జనగామ మార్కెట్‌కు వచ్చిన ధాన్యం కుప్పలు

జనగామ మార్కెట్‌లో కాంటాలకు వ్యాపారులు దూరం

కేసుల నమోదు, హమాలీల సమస్యతో వెనుకడుగు

ధాన్యానికి మద్దతు ధర చెల్లించలేమని స్పష్టం

సోమవారం నుంచి కాంటాలు పెట్టడం కష్టమే

వ్యాపారులతో మార్కెటింగ్‌ డీడీ చర్చలు విఫలం

జనగామ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తు ల కొనుగోలుపై సస్పెన్స్‌ నెలకొంది. ఈనెల 10న జరిగిన ఘటన నేపథ్యంలో ట్రేడర్లు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేసి హమాలీల సమస్యను పరిష్కరించే వరకు కొనుగోళ్లు జరపబోమని భీష్మించుకుకూర్చున్నారు. ఇదే డిమాండ్‌పై ఈనెల 11న మార్కెట్‌ కార్యదర్శికి సైతం ముందుస్తు నోటీసును జారీ చేశారు. ధాన్యంతో పాటు మక్కలు, చింతపండు లాంటి ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లను సైతం ట్రేడర్లు నిలిపివేశారు. దీంతో అధికారులు తల పట్టుకోవాల్సి వస్తోంది. జనగామ మార్కెట్‌కు ఇప్పటికే మక్కలు, చింతపండు రావడం ప్రారంభమైంది. ఈనె ల 11 నుంచి ఆదివారం వరకు జనగామ మార్కెట్‌కు నాలుగు రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చాయి. సెలవుల తర్వాత సోమవారం మార్కెట్‌లో కొనుగోళ్లు జరగాల్సి ఉంది. కానీ.. ట్రేడర్లు ముందుకు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.

ట్రేడర్లతో మార్కెటింగ్‌ డీడీ చర్చలు

జనగామ మార్కెట్‌లో కొనుగోళ్లకు దూరంగా ఉం టామని ట్రేడర్లు ఇచ్చిన నోటీసులపై మార్కెటింగ్‌ శాఖ అధికారులు శనివారం ట్రేడర్లతో చర్చలు జరిపారు. ఈనెల 10న మార్కెట్‌లో జరిగిన రైతుల ఆందోళన నేపథ్యంలో ముగ్గురు ట్రేడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాష్ట్రస్థాయిలో పెద్ద చర్చ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం స్పందించి శుక్రవారం రాష్ట్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రేడర్లు, మిల్లర్లు మద్దతు ధరకే ధాన్యాన్ని కొనాలని, లేదంటే బ్లాక్‌లి్‌స్టలో పెడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పాటు ట్రేడర్లు ఇచ్చిన ముందస్తు నోటీసులపై మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. జనగామ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ట్రేడర్లతో మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజునాయక్‌ శనివారం చర్చలు నిర్వహించారు. కనీస మద్దతు ధరకు(ఎంఎ్‌సపీ) ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ట్రేడర్లకు సూచించారు. దీనిపై ట్రేడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఎ్‌సపీ ప్రకారం కొంటే తమకు గిట్టుబాటు కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వడ్లకు బహిరంగ మార్కెట్‌లో ధర లేదని అన్నారు. దీంతో ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని, మక్కలు, చింతపండు తదితర ఉత్పత్తులను కొనాలని రాజునాయక్‌ సూచించగా ట్రేడర్లు అంగీకరించలేదు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయడంతో పాటు మార్కెట్‌లో ఉన్న హమాలీల సమస్యను పరిష్కరించే వరకు తాము ఎలాంటి కొనుగోళ్లు జరపబోమని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక సమస్యను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి సమస్య పెండింగ్‌లోనే ఉంది.

సోమవారం నుంచి కాంటాలు పెడతారా..?

కొనుగోళ్లకు ట్రేడర్లు దూరంగా ఉండడం, కచ్చితంగా ఎంఎ్‌సపీకే కొనుగోలు చేయాలని అధికారులు తేల్చి చెప్పడంతో సోమవారం నుంచి కాంటాలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం తప్ప మిగతా ఉత్పత్తులను ట్రేడర్లు కొనాల్సి ఉంటుంది. ఈనెల 10న జరిగిన ఘటన తర్వాత అధికారులు ట్రేడర్లను పిలిచి మాట్లాడడంతో క్వింటాకు రూ.30 అదనంగా ఇస్తామని చెప్పి ఆ రోజు వచ్చిన ధాన్యాన్ని మొత్తం కాంటా వేశారు. తర్వాత వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో మార్కెట్‌కు పెద్దగా ధాన్యం రాలేదు. సోమవారం పెద్ద మొత్తంలో ధాన్యం మార్కెట్‌కు రానుంది. వర్షాల భయంతో రైతులు కొనుగోలు కేంద్రాల కంటే ట్రేడర్లకే ఎంతో కొంతకు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం పెద్ద మొత్తంలో వచ్చే వరి ధాన్యంతో పాటు మక్కలు, చింతపండు సైతం ట్రేడర్లు కొనకపోతే మార్కెట్‌లోనే పేరుకుపోయే అవకాశం ఉంది. దీనిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఎంఎ్‌సపీ ప్రకారమే కొనుగోలు చేయాలి

- రాజునాయక్‌, డిప్యూటీ డైరెక్టర్‌, మార్కెటింగ్‌ శాఖ

రైతులు తెచ్చిన ధాన్యాన్ని కచ్చితం గా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని ప్రభు త్వం ఆదేశించింది. ఇందులో భాగంగా జనగామ మార్కెట్‌లో ట్రేడర్లతో నిర్వహించిన సమావేశంలోనూ వారికి ఇదే విషయాన్ని చెప్పాం. ఎంఎ్‌సపీ ప్రకారం కొంటే తమకు గిట్టుబాటు కాదని చెప్పారు. వరి కాకుండా మిగిలిన మక్కలు, చింతపండు లాంటివి కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వారు ముందుకు రాలే దు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అంతవరకు రైతులకు ఇబ్బందులు కలగకుం డా మార్కెట్‌లోనే పీఏసీఎస్‌, ఐకేపీ కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించాం. అవసరమైనన్ని ప్యాడీ క్లీన ర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాం. రైతులు తేమ, తాలు లేకుండా ధాన్యాన్ని తీసుకువచ్చి విక్రయించుకోవచ్చు.

Updated Date - Apr 13 , 2024 | 11:06 PM