Share News

ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్‌!

ABN , Publish Date - May 29 , 2024 | 11:01 PM

రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ వైద్య మండలి నడుం బిగించింది. ప్రజలకు నాణమైన వైద్యం అందాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది.

ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్‌!
జనగామలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తనిఖీ చేస్తున్న వైద్య మండలి అధికారులు (ఫైల్‌)

జిల్లాలో విస్తృతంగా తనిఖీలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

అనుమతులు లేకుంటే వెంటనే సీజ్‌

‘శంకర్‌దాదా ఎంబీబీఎ్‌స’లపై కేసులు

నివేదిక అనంతరం రంగంలోకి ‘విజిలెన్స్‌’

జనగామ, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ వైద్య మండలి నడుం బిగించింది. ప్రజలకు నాణమైన వైద్యం అందాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అర్హతలు లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’లతో పాటు ఆర్‌ఎంపీ, పీఎంపీలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలకు తెలంగాణ వైద్య మండలి(టీఎంసీ) పూనుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నెల రోజుల నుంచి ఈ తనిఖీలు జరుగుతుండగా జనగామ జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రజల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జనగామ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. జనగామ జిల్లాలో మంగళవారం వైద్య మండలి టాస్క్‌ఫోర్స్‌ బృందం పలు ఆస్పత్రులను తనిఖీ చేసి నోటీసులు జారీ చేసింది.

అర్హత లేకున్నా వైద్యం

బృందాల తనిఖీల్లో ఆస్పత్రుల్లో ఎలాంటి ఆర్హతలు లేకుండా కొందరు వైద్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వైద్య విద్య చదవనప్పటికీ వైద్యం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ‘శంకర్‌దాదా ఎంబీబీఎ్‌స’ల గట్టురట్టు చేస్తున్నారు. జనగామలో మంగళవారం జరిగిన తనిఖీల్లో జి.రవికుమార్‌ అనే వైద్యుడు ఎలాంటి విద్యార్హత లేకున్నా ఎంబీబీఎస్‌ వైద్యుడి స్థాయిలో వెద్యం అందించడాన్ని అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఎవర్‌గ్రీన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో క్వాలిఫైడ్‌ వైద్యుడు లేకుండా రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నట్లు నిర్ధారించారు. రెండేళ్ల క్రితమే డాక్టర్‌ వెళ్లిపోయినప్పటికీ అతనే పేరు మీద ల్యాబ్‌ టెక్నీషియన్‌ పరీక్షలు చేస్తున్నాడని గుర్తించారు. దీంతో పాటు సత్యం ఎముకల దవాఖానా నిర్వాహకుడు బాలరాజుగౌడ్‌ తనకు తానుగా బోన్‌ స్పెషలి్‌స్టగా చెప్పుకుంటూ ప్రిస్ర్కిప్షన్‌ రాస్తుండడాన్ని గుర్తించి ఈ ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా జనగామలో శ్రీ గాయత్రి హాస్పిటల్‌ వైద్యుడు నిషాంత్‌ ఎంబీబీఎస్‌ చదివి ఎండీ వైద్యుడిగా చెలామణి అవుతుండడంతో అతడికి నోటీసులు జారీ చేశారు.

అనుమతులు లేకుంటే సీజ్‌

అనుమతి లేని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లపై తెలంగాణ వైద్య మండలి ఉక్కుపాదం మోపనుంది. ఇం దుకు సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ కిందకు వచ్చే యాంటీ క్వాకరీ టీమ్స్‌ ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ లు, ఫిజియోథెరఫీ సెంటర్లు, ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లు, కట్ల దవాఖానాలను టార్గెట్‌ చేసి టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ఎలాంటి అనుమతి లేకుండా ఆస్పత్రుల ను, ల్యాబ్‌లను నిర్వహించడం, నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల మేరకు నిర్వహణ లేని వాటిపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలను ఉల్లంఘించినట్లుగా నిర్ధారణ అయితే ఆస్పత్రి మూసివేతకు సైతం వైద్య మండలి సిద్ధమైంది.

నివేదిక తర్వాత రంగంలోకి విజిలెన్స్‌

టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ప్రస్తుతం తనిఖీలు చేపడుతుండగా ఈ తనిఖీలు పూర్తయ్యాక తెలంగాణ వైద్య మండలి ఆధీనంలోని విజిలెన్స్‌ బృందాలు రంగంలోకి దిగుతాయి. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీల సందర్భంగా గుర్తించిన లోటుపాట్లు, ఆస్పత్రుల అక్రమాలపై ఇచ్చిన నివేదికను బట్టి విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగి చర్యలు తీసుకోనుంది. ఆస్పత్రులు, ల్యాబ్‌ నిర్వాహకులు, డాక్టర్లు చేసిన తప్పిదాలను బట్టి కేసుల నమోదు, ఆస్పత్రుల మూసివేత, అవసరమైతే బాధ్యులపై ఏడాదికి పైగా జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే విధంగా కేసులు పెట్టనున్నారు.

అర్హత లేకుండా వైద్యం చేస్తే చర్యలు..

- డాక్టర్‌ జలగం విజయ్‌, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ యాంటీ క్వాకరీ టీమ్‌ మెంబర్‌

జిల్లాలో అర్హత లేకుండా వైద్యం చేసినా, అనుమతులు లేకుండా ఆస్పత్రులను, ల్యాబ్‌లను నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య మండలి నిర్ణయించింది. తెలంగాణ వైద్య మండలి ఆదేశాల మేరకు ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌ల్లో తనిఖీలు చేపడుతున్నాం. ఈ తనిఖీలు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఇక మీదట వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఆర్‌ఎంపీ, పీఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేసి ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలి. అంతేగాని ఇంజక్షన్లు ఇవ్వడం, యాంటీ బయోటిక్‌ ఇంజన్లు, మాత్రలు ఇవ్వడం, సెలైన్లు పెట్టడం చేయకూడదు. అనుమతులు లేకుండా ఆస్పత్రులు, ల్యాబ్‌లు నడిపినా, అర్హత లేకుండా వైద్యం అందించినా సీరియస్‌ చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 29 , 2024 | 11:01 PM