సార్లొస్తాండ్లు
ABN , Publish Date - May 31 , 2024 | 11:52 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా బడిబాట కార్య క్రమం నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు గాను ‘బడిబాట’ నిర్వహించడానికి ఉన్నతాధికారులు ఏర్పాట్లను చేశారు.
జూన్ 3 నుంచి 19 వరకు జిల్లాలో ‘బడిబాట’
రెండు విడతలుగా కొనసాగనున్న కార్యక్రమం
పల్లెల్లో పర్యటించనున్న ఉపాధ్యాయులు
బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు కృషి
తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు
ప్రణాళిక సిద్ధం చేసిన విద్యాశాఖ
స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం
జనగామ కల్చరల్, మే 31: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా బడిబాట కార్య క్రమం నిర్వహించడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీచేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు గాను ‘బడిబాట’ నిర్వహించడానికి ఉన్నతాధికారులు ఏర్పాట్లను చేశారు. జూన్ 3 నుంచి 19 వరకు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రణాళిక ఇదే...
2024-25 విద్యా సంవత్సర ప్రారంభ నేపథ్యంలో బడిబాటకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తారు. గ్రామాల్లో సభ నిర్వహించి బడిబాట ప్రాధాన్యతను తెలియజేస్తారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం బడిబాట నిర్వహిస్తారు. జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు బడిబాట తొలి విడతగా నిర్వహిస్తారు. ఈ రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తిస్తారు. తరువాత 12 నుంచి 19 వరకు రోజుకో కార్యక్రమం చొప్పున ప్రణాళిక సిద్ధం చేశారు.
జూన్ 3న గ్రామంలోని పలు యువజన సంఘా లు, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తా రు. బడీడు పిల్లలను గుర్తిస్తారు. స్వయం సహాయక సంఘాలు, ప్రధానోపాఽధ్యాయులు, ఉపాధ్యాయులతో బడిబాట చైతన్య ర్యాలీ నిర్వహిస్తారు.
4న ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లల పేర్లను నమోదు చేసుకుంటారు. వారి జాబితాను తయారు చేసి సంబంధిత రిజిస్టరులో పొందుపరుస్తారు.
5 నుంచి 10 వరకు ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను ఎన్‌రోల్ చేయడం, అంగన్‌వాడీ కేంద్రాల కు వెళ్లి విద్యార్థులను బడిలో చేర్పించేలా తల్లిదం డ్రులతో మాట్లాడడం, వారికి విద్యపై అవగాహ న కల్పిస్తారు. బడి మానేసిన పిల్లలను, మానసిక వికలాంగ విద్యార్థులను గుర్తిస్తారు.
ఠ 11న ఊరూరా గ్రామసభలు నిర్వహిస్తా రు. జూన్ 5 నుంచి 10 వరకు గుర్తించిన పిల్ల ల జాబితాపై సమీక్ష చేస్తారు. ఆయా పాఠశా లల్లో నెలకొన్న సమస్యలపై చర్చిస్తారు.
12న ఇప్పటి వరకు బడిబాట జరిగిన తీరుపై చర్చిస్తారు. పాఠశాలను తోరణాలతో తీర్చిదిద్ది పండుగ వాతావరణం కల్పిస్తారు. బడిబాట ప్రాముఖ్యతపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తారు. కరపత్రాలు పంపిణీ చేస్తారు. తల్లిదండ్రులతో సమావేశమై ‘అమ్మ ఆదర్శ పాఠశాల’లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారు.
13న ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ)పై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహ న కల్పిస్తారు. లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం) డే నిర్వహించి విద్యార్థుల సామర్థ్య స్థాయి లను వివరిస్తారు. ఆయా తరగతులకు అనుగుణంగా వాల్ పోస్టర్లు రూపొందిస్తారు.
14న విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పా టు చేయాలి. నూతనంగా చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి. పాఠశాల స్థాయిలో పిల్లల కమిటీలు, క్లబ్బులు ఏర్పాటు చేస్తారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాలసభ నిర్వహిస్తారు.
15న ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులను, బడి బయట ఉన్న పిల్లలను గుర్తిస్తారు. వారి వివరాలు నమోదు చేసి పాఠశాలల్లో చేర్పిస్తారు. అవసరమైన వారిని భవిత సెంటర్లలో చేర్పిస్తారు.
18న పాఠశాలలో మొక్కల పెంపకానికి కావలసిన స్థలాన్ని ఎంపిక చేస్తారు. వాటి సంరక్షణ బాధ్యతలు విద్యార్థులు తీసుకునేలా అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆంగ్ల మాధ్యమంపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం 2022-23 నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని తెలియజేస్తారు. విద్యార్థులకు ద్విభాషా పుస్తకాల గురించి వివరిస్తారు.
19న క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ మొదలగు క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. తరగతుల వారీగా కాంపిటీషన్స్ నిర్వహిస్తారు.
బడిబాటను విజయవంతం చేయాలి..: కె.రాము, జిల్లా విద్యాశాఖాధికారి
జిల్లాలో బడిబాట కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించాం. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో నిర్వహించి విజయవంతం చేయాలి. గ్రామస్థులకు ఆంగ్ల మాధ్యమం, పాఠశాలలో కల్పిస్తున్న వసతుల గురించి వివరించాలి. అందరినీ కలుపుకుపోతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు గల వ్యత్యాసాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. బడిబాట కార్యక్రమానికి తల్లిదండ్రులు సహకరించాలి.