Share News

నిర్లక్ష్యం ఖరీదు రూ.5.20 కోట్లు

ABN , Publish Date - May 31 , 2024 | 12:25 AM

సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టు-3లో భూములు కోల్పోయిన నిర్వాసితుల నుంచి కొనుగోలు చేసిన కలప పాడైపోతోంది. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కర్రకు చెదలు పడుతున్నా సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సింగరేణి కార్యాలయం ఆవరణలో నిల్వ ఉంచిన కలప ఎండకు ఎండుతూ... వానకు తడుస్తోంది.

నిర్లక్ష్యం ఖరీదు రూ.5.20 కోట్లు
భూనిర్వాసితుల నుంచి సింగరేణి అధికారులు కొనుగోలు చేసిన కలప

మూడేళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్న కలప

నిర్వాసితుల నుంచి రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేసి పట్టించుకోని వైనం

టెండర్ల నిర్వహణ లేక కార్యాలయాల్లోనే పాడవుతున్న కర్ర

సింగరేణి ఆదాయానికి భారీగా గండి

కాకతీయఖని, మే 30 : సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టు-3లో భూములు కోల్పోయిన నిర్వాసితుల నుంచి కొనుగోలు చేసిన కలప పాడైపోతోంది. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కర్రకు చెదలు పడుతున్నా సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో సింగరేణి కార్యాలయం ఆవరణలో నిల్వ ఉంచిన కలప ఎండకు ఎండుతూ... వానకు తడుస్తోంది. అయినప్పటికీ వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. మూడేళ్లుగా ఈ కలపను వేలం వేయకుండా సంబంధిత సింగరేణి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దాంతో సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూడేళ్లుగా కార్యాలయాల ఆవరణలోనే..

భూపాలపల్లి ఏరియాలోని గణపురం మండలం మాధవరా వుపల్లిలో ఓసీ-3 ప్రాజెక్టు కోసం సింగరేణి సంస్థ 900 ఎకరాల భూమిని సేకరించింది. ముందుగా వివిధ రకాల చెట్లను కొనుగోలు చేశారు. అయితే వందలాది ఎకరాల్లో ఉన్న టేకు, జామాయిల్‌ తోటలను సేకరించడంతో పాటు వివిధ రకాల చెట్లను తొలగించారు. అందులో నుంచి 2107.01 మెట్రిక్‌ టన్నుల జామాయిల్‌ చెట్లు, 204.9 మెట్రిక్‌ టన్నుల మెస్క్‌ టింబర్‌, 220 మెట్రిక్‌ టన్నుల టేకు కలపను సేకరించారు. ఇందులో జామయిల్‌ చెట్లు 35,82,070, టేకు చెట్లు 19,92,000, వివిధ రకాల చెట్లు 2,14,678 ఉన్నట్లు ఏరియా సింగరేణి అధికారులు తెలిపారు. అలాగే మాధవరావుపల్లెను తరలించగా వారి ఇండ్ల కట్టడాలలో ఉన్న టేకు కర్రను సైతం తీసుకున్నట్లు వెల్లడించారు. కేఎల్‌పీ గని మేనేజర్‌ కార్యాలయం వెనుక భాగంలో కొంత కలపను, పట్టణంలోని ఎస్‌అండ్‌పీసీ కార్యాలయంలో కొంత కలపను, సింగరేణి స్టోర్‌ యార్డులో మిగిలిన కలపను నిల్వ ఉంచారు. మూడేళ్లుగా కలపకు ఎలంటి రక్షణ లేకపోవడంతో చెదలు పట్టి పాడైపోతుంది. నిర్వాసితుల వద్ద నుంచి రూ.5.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కర్ర పాడైపోతుంటే పట్టనట్లుగా వ్యవహరిస్తున్న సింగరేణి అధికారుల నిర్లక్ష్యం పట్ల ఏరియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

టెండర్ల నిర్వహణలో అలసత్వం

భూ నిర్వాసితుల నుంచి కొనుగోలు చేసిన కలపను వేలం వేసి అమ్మాల్సి ఉండగా... అధికారులు నిర్లక్ష్యం చేయడంతో మూడేళ్లుగా ఎక్కడ వేసిన కలప అక్కడే ఉంది. దీంతో కొంత కలప దొంగల పాలవుతోందనే ఆరోపణలు వస్తుండగా, మరికొంత కలప చెదలు పట్టి పనికిరాకుండా పోతోందని కార్మికులు చెబుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కలప నాణ్యత దెబ్బతిన కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సింగరేణి అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపట్ల విమర్శలు వ్యక్తమ వుతున్నా యి. చెదలు పట్టి కర్ర నాణ్యత దెబ్బతింటే దాని విలువ తగ్గుతుం దని, ఇప్పటికైనా అధికారులు వెంటనే టెండర్లకు పిలిచి కలప అమ్మి సొమ్ము చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

నిర్లక్ష్యానికి బాధ్యులెవరు..?

భూ నిర్వాసిత రైతుల వద్ద నుంచి సింగరేణి అధికారులు కొను గోలు చేసిన కలపను అమ్మాలంటే అటవీశాఖ అధికారుల అసర ముంది. అయితే సింగరేణి అధికారులు, అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో వేలం వేయడంలో అలసత్వం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలపను వేలం వేయడానికి అటవీశాఖ అధికారుల అనుమతులు కోరినప్పటికీ వారు సహకరించడం లేదని పలువురు సింగరేణి అధికారులు చెబుతు న్నారు. దీంతో కలప వేలం వేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలిపారు. ఏదేమైనప్పటికీ అటు సింగరేణి అధికారులు, అటవీశాఖల మధ్య సమన్వయ లోపంతో కలప పాడైపోతుంది. ఇంతటి నిర్లక్ష్యా నికి బాధ్యులెవరు..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సింగరే ణి పాఠశాలలో, ఆస్పత్రిలో, డిపార్టుమెంటుల్లో, గనుల వద్ద, కార్మికు లు సామాన్లు భద్రపర్చుకునేందుకు పెట్టెలు, కుర్చీలు, బల్లలు అవసరముంటాయని. భూ నిర్వాసితుల నుంచి కొనుగోలు చేసిన కలపతో అధికారులు పనిముట్లు తయారు చేయిస్తే కొంచెమైనా నష్టం తగ్గే అవకాశం ఉంటుందని పలువురు సింగరేణి ఉద్యోగులు సూచిస్తున్నారు.

ఏజెన్సీలు ముందుకు రావడం లేదు

కర్ణ, సింగరేణి అటవీశాఖ అధికారి, భూపాలపల్లి ఏరియా

కలప అమ్మేందుకు టెండర్లకు పిలిచాం. కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అటవీశాఖ అధికారులను కోరాం. వారి వద్ద సిబ్బంది కొరత ఉండడంతో టెండర్లు వేయలేక పోయారు. చివరకు ఆ కలపను ప్రభుత్వ టింబర్‌ డిపోలో భద్ర పర్చాలని కోరాం. వారు స్థలం లేదని చెప్పారు. దీంతో సింగరేణి ఉన్నతాధికారులకు మూడుసార్లు లేఖ రాశాం. టింబర్‌ డిపో వారు కలపకు రేటు నిర్ణయిస్తేనే తరలించే అవకావం ఉందని, బయట ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదని, సంస్థ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, ఏరియా సింగరేణి ఆస్పత్రులకు, మైన్స్‌, డిపార్ట్‌మెంటులకు ఫర్నీచర్‌ చేసి స్టోర్స్‌ ద్వారా పంపిణీ చేయాలని కోరాం. అలాగే ఏరియా జీఎం అటవీశాఖ జిల్లా అధికారితో మరోసారి మాట్లాడారు. వారు రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చూస్తామని చెప్పారు.

Updated Date - May 31 , 2024 | 12:25 AM