కళాతో’రణం’!
ABN , Publish Date - May 31 , 2024 | 01:13 AM
ఓరుగల్లు కాకతీయ కళాతోరణం.. ఇది కాకతీయుల సుపరిపాలనకు, ఓరుగల్లు అస్తిత్వాన్ని చాటే చిహ్నమన్నది అందరికీ తెలిసిందే. అలాంటి ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కళాతోరణాన్ని తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి తొలగించడం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలైతే భగ్గుమంటున్నాయి. వరంగల్ కేంద్రంగా మరో ఉద్యమానికి ప్రణాళిక రూపొందిస్తున్న బీఆర్‌ఎస్.. ఓరుగల్లు ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇక బీజేపీ కూడా కళాతోరణం వివాదం నేపథ్యంలో సమరానికి సై అంటోంది.
తెలంగాణ రాజముద్ర నుంచి ‘కాకతీయ’ చిహ్నం తొలగింపుపై విపక్షాల రగడ
ఓరుగల్లు అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రేనంటున్న బీఆర్‌ఎస్
వరంగల్ కేంద్రంగా మరో ఉద్యమానికి ప్రణాళిక
నేడు కాళోజీ జంక్షన్‌లో గులాబీ శ్రేణుల మహాధర్నా
ఆందోళనలకు సన్నద్ధమవుతున్న బీజేపీ
బీఆర్‌ఎస్ ఓరుగల్లును ఆరు ముక్కలు చేస్తే.. కాంగ్రెస్ ఔన్నత్యాన్నే దెబ్బతీస్తోందంటూ వ్యాఖ్యలు
వివాదంపై కాంగ్రెస్ మౌనం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
ఓరుగల్లు కాకతీయ కళాతోరణం.. ఇది కాకతీయుల సుపరిపాలనకు, ఓరుగల్లు అస్తిత్వాన్ని చాటే చిహ్నమన్నది అందరికీ తెలిసిందే. అలాంటి ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కళాతోరణాన్ని తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి తొలగించడం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలైతే భగ్గుమంటున్నాయి. వరంగల్ కేంద్రంగా మరో ఉద్యమానికి ప్రణాళిక రూపొందిస్తున్న బీఆర్‌ఎస్.. ఓరుగల్లు ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇక బీజేపీ కూడా కళాతోరణం వివాదం నేపథ్యంలో సమరానికి సై అంటోంది. స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలు చేసి ఓరుగల్లు అస్తిత్వాన్ని దెబ్బతీస్తే, పదేళ్లుగా ప్రభుత్వ చిహ్నంలో ఉన్న కాకతీయ తోరణాన్ని తొలగించి వరంగల్ ఔనత్యాన్ని మసకపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ కాషాయ పార్టీ కత్తులు దూస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు మౌనమే తమ వ్యూహంగా అడుగులు వేస్తుండటం చర్చనీయాంశగా మారింది.
చిహ్నం తొలగింపుపై రగడ
2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజముద్రను రూపొందించి ఆ చిహ్నంలో చార్మినార్‌తో పాటు కాకతీయ కళాతోరణాన్ని చేర్చింది. కాకతీయులు పరిపా లించిన కాలంలో నిర్మించిన ఈ కళా తోరణాన్ని ఓరుగల్లు అస్తిత్వా నికి, కాకతీయుల సుపరిపాలనకు చిహ్నంగా భావిస్తుంటారు. పదేళ్లుగా ఇదే రాష్ట్ర చిహ్నంగా కొనసాగుతుంది. అయితే గత డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను పునసమీక్షిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కోడ్‌ను గత ప్రభుత్వం టీఎస్‌గా పేర్కొంటే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టీజీని మార్చింది. ఆ తర్వాత గతంలో టీఎస్‌ఆర్టీసీగా ఉన్న రోడ్డురవాణాసంస్థ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాల్లో ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదు. కానీ ప్రభుత్వ చిహ్నంలో చార్మినార్‌తో పాటు కాకతీయ కళాతోరణాన్ని తొలిగించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఓరుగల్లువాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణకు రెండో రాజధానిగా పేర్కొనే ఓరుగల్లు అస్తిత్వంగా భావించే కాకతీయ తోరణాన్ని తొలగించడాన్ని పలు వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాకతీయులు పాలన ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ తదిరత ప్రాంతాల్లో కూడా కొనసాగింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కాకతీయ కళాతోరణాలు దర్శనిమిస్తుంటాయి. ఇదే అదనుగా భావించిన బీఆర్‌ఎస్ రంగంలోకి దిగింది. కాకతీయ తోరణాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అందోళనకు సిద్ధమైంది. ఇదే సమయంలో బీజేపీ కూడా సమరానికి సై అంటూ ముందుకు రావటంతో వరంగల్‌లో మరో ఉద్యమానికి బాటలు పడుతాయా అనే చర్చ జరుగుతోంది.
ఓరుగల్లు కేంద్రంగా బీఆర్‌ఎస్ ఉద్యమ బాట..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న బీఆర్‌ఎస్ చేతికి కాకతీయ కళాతోరణం తొలిగింపు ఓ అస్త్రంగా దొరికిందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కొత్త చిహ్నం పరిశీలన చేస్తోందన్న ప్రచారం ప్రారంభం కావడంతోనే రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్ వరంగల్‌లోని ఖిలావరంగల్ కోటలోని కాకతీయ తోరణాల వద్ద బుధవారం రాత్రి బీఆర్‌ఎస్ నేతలు నిరసనకు దిగారు. తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణాన్ని తొలగించవద్దని ఆందోళన చేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపనేని నరేందర్ తదితర కీలక నేతలు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. కాకతీయ తోరణాన్ని తొలగించడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తప్పుపట్టడంతో పాటు ఓరుగల్లు కేంద్రంగా ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. దీంతోపాటు శుక్రవాకం కాళోజీ జంక్షన్‌లో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్ నేతృత్వంలో భారీ ధర్నాకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాల నేతలు, ఫ్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులను తిరిగి గులాబీ జెండా కింద ఉద్యమాలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఉద్యమంలో కేటీఆర్, హరీష్ రావులను భాగస్వాములను చేసి, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర చిహ్నంలో మార్పులపై ఇప్పడికిప్పుడు నిర్ణయం తీసుకోబోమని, 500లకు పైగా నమునాలు వచ్చాయని, పరిశీలిస్తున్నామని చెప్పడాన్ని బీఆర్‌ఎస్ నేతల తమ విజయంగా చెప్పుకొంటున్నారు. తమ ఆందోళనతోనే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని గులాబీ నేతలు ప్రకటించారు. దీంతో గులాబీ కేడర్‌లో మరింత జోష్ నింపేందుకు శుక్రవారం హనుమకొండలో మహాధర్నాకు సిద్ధమవుతుండటంతో ఓరుగల్లు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు రాజముద్రలో చార్మినార్‌తో పాటు కాకతీయ తోరణాన్ని తొలగింపును నిలిపి వేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. ఇటు ప్రజాక్షేత్రంలో.. అటు న్యాయ స్థానంలో పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
సమరానికి బీజేపీ సై...
రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ కూడా ప్రజాక్షేత్రంలోకి దిగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వరంగల్‌కు ద్రోహం చేస్తున్నాయంటూ కాషాయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేయటమే కాకుండా, హనుమకొండ, వరంగల్‌గా ఏకశిల నగరాన్ని చీల్చిన ఘనత కూడా బీఆర్‌ఎస్‌కే దక్కిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్‌ఎస్ తరహలోనే కాంగ్రెస్ కూడా ఏకపక్షంగా ఓరుగల్లుకు అన్యాయం చేస్తోందని, ఓరుగల్లు ప్రజల అస్తిత్వానికి నిదర్శనంగా ఉన్న కాకతీయ తోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమం తప్పదని ఆ పార్టీ హెచ్చరిస్తోంది. కాకతీయ తోరణం రాజరికానికి కాదు.. రాజసానికి నిదర్శమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల కోడ్ తరువాత ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
వ్యూహాత్మక మౌనంలో కాంగ్రెస్ నేతలు..
కళాతోరణం తొలగింపుపై విపక్షాలు ఆందోళన బాట పడుతున్న క్రమంలో కాంగ్రెస్ నేతలు మౌనం పాటిస్తున్నారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులుంటాయని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో కాకతీయ కళాతోరణం తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమా చారం. ప్రస్తుతం కొత్త చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎలాంటి వాఖ్యలు చేయడం లేదు. అధికారపార్టీ ఎమ్మెల్యేలుగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. అలాగే ఓరుగల్లు గడ్డపై పుట్టి కాకతీయ తోరణాన్ని తొలగించడాన్ని సమర్థించలేమని ఓ కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ కూడా చిహ్నంలో మార్పులపై ఇప్పుడే నిర్ణయం తీసుకోమని చెప్పటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతల్లో కొంత ఊరటనిచ్చిందని తెలుస్తోంది. గులాబీ పార్టీ ఎత్తుగడలను తిప్పి కొట్టడంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కీలక ఆదేశాలు రావటంతో ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. దీంతో ఓరుగల్లులో మరో రాజ కీయ పోరాటానికి కళాతోరణం తొలగింపు ఎజెండాగా మారనుందన్న చర్చ జరుగుతోంది.