మోగిన బడిగంట
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:49 PM
వేసవి సెలవులు ముగించుకొని నేటి నుంచి పాఠశా లలు పునఃప్రారంభం కానున్నాయి. రుతుపవనాలు పూర్తి స్థాయిలో జిల్లాకు రానప్పటికీ వాతావరణం మా త్రం ఓ పూట ఎండ, ఓ పూట మబ్బులా ఉంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను సబ్జెక్టు టీచర్లు, స్కా వెంజర్లు, అటెండర్ల కొరత వేధిస్తూనే ఉంది.
నేటి నుంచి స్కూళ్ల పునఃప్రారంభం
ముగిసిన వేసవి సెలవులు
పూర్తి కాని మరమ్మతు పనులు
మొదటి రోజే పుస్తకాల పంపిణీ
జనగామ కల్చరల్, జూన్ 11: వేసవి సెలవులు ముగించుకొని నేటి నుంచి పాఠశా లలు పునఃప్రారంభం కానున్నాయి. రుతుపవనాలు పూర్తి స్థాయిలో జిల్లాకు రానప్పటికీ వాతావరణం మా త్రం ఓ పూట ఎండ, ఓ పూట మబ్బులా ఉంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను సబ్జెక్టు టీచర్లు, స్కా వెంజర్లు, అటెండర్ల కొరత వేధిస్తూనే ఉంది. ‘అమ్మ ఆదర్శ పాఠ శాల’ పథకం కింద ప్రారంభమైన పనులు ఇంకా పూర్తి కాలేదు. ఓవైపు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండగా మరో వైపు బడిగంట మోగింది.
కొనసాగుతున్న బడిబాట...
సర్కారు స్కూళ్ల బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 6 నుంచి ప్రారం భమైన బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. ఉపాధ్యాయులు ఇం టింటికీ తిరుగుతూ బడిలో చేర్చాల్సిన పిల్లల జాబితాను తయారు చేశారు. మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. హాజరైన ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులతో పాఠశాలల బలోపేతం పై చర్చిం చారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. సర్కారు బడుల్లో కూడా ఇంగ్లీషు మీడి యం బోధిస్తున్న విషయమై ప్రజలకు వివరించారు.
యథావిదిగా ఆంగ్ల బోధన...
గతంలో మాదిరిగా ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా ఒక టి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధన చేసేం దుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డిజిటల్ బోధనపై కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. దాదాపుగా అన్ని స్కూళ్లకు డిజిటల్ బోర్డులు వచ్చాయి. ఈసారి డిజిటల్ బోధన పూర్తి స్థాయిలో అమలయ్యే పరిస్థితులు ఉన్నాయి.
నత్తనడకన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులు...
జిల్లాలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకం కింద 291 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. పనులు ప్రారంభించి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 90 శాతం పాఠశాలల్లో పనులుపూర్తయ్యాయని, ఇంజనీర్లు అడిషనల్‌గా ఎస్టిమేట్ చేయడంతో ఆ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘మన ఊరు మన బడి’ పథకం కింద చేపట్టిన పనులు కొన్ని నిధుల లేమితో ఆగిపోగా వాటికి సైతం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సంసిద్దమైందని వారు పేర్కొన్నారు.
- చేరుకున్న పాఠ్య పుస్తకాలు ...
జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 2,29,630 పాఠ్య పుస్తకాలు అవసరమని గుర్తించగా ఇప్పటి వరకు 2,03,300 పాఠ్య పుస్తకాలు వచ్చాయని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి వచ్చిన పాఠ్య పుస్తకాలలో ఇప్పటి వరకు 1,27,581 పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాల వరకు, 75,268 పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయన్నారు. అదే విధంగా అవసరమైన 2,02,653 నోటు పుస్తకాలు జిల్లా కేంద్రానికి వచ్చాయని, వాటిని పాఠశాలలకు కూడా సరఫరా చేశామని తెలిపారు. మొదటి జత యూనిఫాంలు కూడా పాఠశాలలకు పంపించామని, రెండో జత యూనిఫాంలను మరో 20 రోజుల్లోగా విద్యార్థులకు అందిస్తామని తెలిపారు.
- ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ...
పాఠశాల పునఃప్రారంభం రోజున నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాలకుర్తి హైస్కూల్‌లో, జిల్లా కేంద్రంలోని ధర్మకంచ జడ్పీ ఉన్నత పాఠశాలలో, స్టేషన్‌ఘన్‌పూర్ జంట పట్టణం శివునిపల్లి హైస్కూల్‌లో పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- పెరుగుతున్న ప్రైవేటు ఫీజులుం ...
మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులుం కొనసాగుతోంది. జిల్లాలో నారాయణ విద్యాసంస్థ ప్రారంభం కావడంతో కార్పొరేటుకు అడుగుపడినట్లయింది. ఐఐటీ పేరుతో ప్రైవేటు పాఠశాలలు ఫీజులను పెంచేస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్టేషనరీ తదితర వాటికి పెరిగిన రేట్లతో ప్రైవేటు విద్యాసంస్థల్లో చేర్పించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
- జిల్లాలో 465 ఖాళీలు ...
జిల్లాలో ఉపాధ్యాయుల కొరత కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 2560 సాంక్షన్ పోస్టులు ఉండగా 2095 స్థానాల్లో మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకా 465 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రమోషన్ల విషయంలో వివాదం నెలకొనగా కోర్టు తీర్పులో చిక్కుముడి వీడింది. దీంతో భాషా పండితులు, వ్యాయామ ఉపాఽధ్యాయుల ప్రమోషన్ల కోసం సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది.
- జిల్లాలో 557 పాఠశాలలు ...
జిల్లాలో 341 ప్రాథమిక పాఠశాలలు, 64 యూపీఎస్ లు, 103 హైస్కూల్లు, 12 కేజీబీవీలు, 8 మోడల్ స్కూళ్లు, 10 ఎయిడెడ్ పాఠశాలలు, 19 రెసిడెన్షియల్ స్కూళ్లతో మొత్తం 557 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
విద్యారంగ ఆకాంక్షలు సాకారం కావాలి..
ఆకుల శ్రీనివాసరావు, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యారంగ ఆకాంక్షలు సాకారం కావాలి. స్కావెంజర్ల వ్యవస్థను ప్రభుత్వం తొలగించింది. అటెండర్లు పూర్తి స్థాయిలో లేరు. ప్రమోషన్లు, బదిలీల అనంతరం సబ్జెక్టు టీచర్ల కొరత ఉంటే విద్యావలంటీర్ల ద్వారా ఆ కొరతను తీర్చాలి. స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడం సంతోషకరం. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. స్కూల్ మేనేజ్‌మెంట్ గ్రాంటు ముందుగానే విడుదల చేయాలి.
- ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాల పంపిణీ..
కె.రాము, డీఈవో, జనగామ
పాఠశాలల పునఃప్రారరంభ రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేస్తాం. ఆయా నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేస్తాం. పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభిస్తాం. పాఠశాలల్లో కొంత మేరకు సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.