Share News

జలం.. గరళం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:07 AM

జలమే జగతికి మూ లం.. అలాంటి జలం గరళమవుతోంది.. జిల్లా వ్యాప్తం గా తాగునీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. వేసవి కాలం కావడంతో ‘మూడు ప్లాంట్లు... ఆరు క్యాన్‌లు’ అనే తరహాలో దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడు గుల్లా వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు లక్షలు సంపా దిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

జలం.. గరళం
రఘునాథపల్లిలోని ఓ వాటర్‌ ప్లాంట్‌

జోరుగా నీటి దందా

పుట్టగొడుగుల్లా వెలిసిన వాటర్‌ ప్లాంట్లు

విచ్చలవిడిగా రసాయనాల వాడకం

క్యాన్లలోనే సరఫరా

రూ.కోట్ల వ్యాపారం

జిల్లా వ్యాప్తంగా 800కు పైగా కేంద్రాలు

రోగాల బారిన పడుతున్న ప్రజలు

పట్టించుకోని అఽధికారులు

రఘునాథపల్లి, ఏప్రిల్‌ 12 : జలమే జగతికి మూ లం.. అలాంటి జలం గరళమవుతోంది.. జిల్లా వ్యాప్తం గా తాగునీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. వేసవి కాలం కావడంతో ‘మూడు ప్లాంట్లు... ఆరు క్యాన్‌లు’ అనే తరహాలో దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడు గుల్లా వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు లక్షలు సంపా దిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నీటి శుద్దిలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించ కుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమడుతున్నారు. క్యాన్‌ నీటికి అలవాటుపడిన ప్రజలు రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. పేరుకే మినరల్‌ వాటర్‌..కాని తాగి చూస్తే అంతా జనరల్‌ అని తెలుస్తోంది. జిల్లాలో 800కు పైగా వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో ప్రమాణాలు పాటిస్తున్నవి కొన్ని మాత్రమే. ఇంత జరుగుతున్నా అటు అధికారులు గాని, ఇటు పాలకులు గాని పట్టించుకోకపోవడం గమనార్హం.

నిబంధనల ప్రకారం వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేయలంటే పది రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆనారోగ్యాలకు ప్రధాన కారణం తాగు నీరే నని వైద్యులు చెబుతుంటారు. నీటిని కాచి, వడబోసి తాగమని సలహా ఇస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా మినరల్‌ వాటర్‌ పేరుతో సాధారణ జలాన్ని క్యాన్‌ల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా చేరడం వల్ల వాటిని తాగిన వారు ఆనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి. మినరల్‌ వాటర్‌ పేరుతో జరుగుతున్న విక్రయాల్లో ఫంగస్‌ చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలో వాటర్‌ ప్లాంట్లు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలుస్తు న్నా సంబంధిత అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

నెలకు రూ.5 కోట్ల నీటి అమ్మకం

వేసవి కాలంలో వాటర్‌ ప్లాంట్ల ద్వారా జోరుగా నీటి వ్యాపారం జరుగుతుంది. జిల్లాలో 75 శాతం మంది వాటర్‌ ప్లాంట్లకు సంబంధించిన నీటినే తాగుతున్నారు. దీంతో వాటర్‌ ప్లాంట్లకు మరింత డిమాండ్‌ పెరిగింది. 20 లీటర్ల క్యాన్‌ ధర ఇంటికి వస్తే రూ.10 నుంచి రూ.15 వరకు తీసుకుంటున్నారు. సగటున వాటర్‌ ప్లాంట్ల ద్వారా రోజుకు లక్ష పైచిలుకు నీటి క్యాన్‌లు సరఫరా అవుతున్నాయి. ఈ లెక్కన ఒక్క రోజులోనే రూ.15 లక్షల వరకు నీటి వ్యాపారం సాగుతుంది. వేసవిలో ఒక్కొక్క ప్లాంటు నిర్వాహకులు ప్రతీ రోజు 200 నుంచి 250 క్యాన్ల వరకు అమ్ముతున్నారు. జిల్లాలో సుమారు 800 వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు సుమారు రూ.5 కోట్లకు పైగా నీటి వ్యాపారం సాగుతుంది. ఇక ఎండా కాలం కావడంతో చల్లని తాగు నీటి పేరిట 15 లీటర్ల కూల్‌ క్యాన్‌కు రూ.50 వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు...

ఆధునిక యంత్రాల సహాయంతో బోరు నీటిని మూడు దశల్లో మినరల్‌ వాటర్‌గా తయారు చేయాల్సి ఉంటుంది. ముందుగా నీటిని క్లోరినేషన్‌ చేయాలి. క్లోరినేషన్‌ చేసిన నీటిని ప్రత్యేకమైన శాండ్‌ ఫిల్టర్‌ ద్వారా వడబోసి, కార్బన్‌, మైక్రాన్‌ ఫిల్టర్ల ద్వారా శుభ్రం చేయాల్సి ఉంటుంది. తర్వాత మరో కంపార్ట్‌మెంట్‌లోకి నీటిని పంపి అలా్ట్ర వైలెట్‌, ఓజోనైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మార్చాల్ని ఉంటుంది. చివరి దశలో ఆక్సిజన్‌ పంపడం ద్వారా ఆక్సీకరణ జరిపి రంగు, రుచి, వాసన లేకుండా శుద్ది చేయాలి. ఈ నీటిని వారం రోజుల లోపు వినియోగిం చాలి. కానీ అందుకు విరుద్దంగా వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు వేసవి సీజన్‌ కావడంతో క్యాన్‌లలో బోరు నీటిని పట్టి వినియోగదారులకు అనుమానం రాకుండా రుచి కోసం మితిమీరిన రసాయనాలను కలుపుతూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నా రు. మిషన్‌ భగీరధ నీటిలో 150 మినరల్స్‌ ఉంటే వాటర్‌ ప్లాంట్‌ నీటిలో 60 మినరల్స్‌ మాత్రమే ఉంటాయి.

రసాయనాలు వాడే వారిపై చర్యలు తీసుకోవాలి : పెద్దగోని రాజు, వెల్ది

నీటి శుద్ది కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటిం చడం లేదు. వాటిలో రుచి కోసం అనవసర రసాయనాలు వాడుతున్నారు. వీటి వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. వాటర్‌ ప్లాంట్లపై అధికారుల తనిఖీ లు లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు. డబ్బులు కూడ ఎక్కువగా తీసుకోని ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వాటర్‌ ప్లాంట్లపై పట్టణాలలో అయితే మున్సిపల్‌ , గ్రామాల లోనయితే పంచాయతీ అధికారుల పర్యవేక్షణ ఉండా ల్సిన అవసరం ఉంది.

అనుమతులు తప్పనిసరి : కృష్ణమూర్తి, ఆహార కల్తీ నియంత్రణ జిల్లా అధికారి

ప్యాకేజీ డ్రింకింగ్‌ వాటర్‌కు ఎస్‌ఐ అనుమతి పొందని వాటిపై మా శాఖ తరఫున చర్యలు తీసుకుంటాం. నాన్‌ బీఎస్‌ఐల వాటిపై మున్సిపల్‌ పరిధిలో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలి. వాటర్‌ ప్లాంట్ల నిర్వహణకు సంబంధించిన సమస్యలను మున్సిపల్‌ పరిధిలో ఆర్డీవోకు నివేదిస్తే ప్రభుత్వ నిబంధనలను పాటించని వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేసే అధికారం ఆర్డీవోకు, గ్రామ పంచాయతీల పరిదిలో నిబంధనలను పాటించని వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేసే అధికారం ఆయా మండలాల తహసీల్దార్లకు ఉంది. వాల్టా చట్టం 133 ప్రకారం లోకల్‌ అధికారులు నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 13 , 2024 | 12:07 AM