Share News

మోదీ వస్తారా.. పునాది వేస్తారా?

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:39 PM

సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్‌లో రూ.889 కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరడం సానుకూలాంశం కాగా.. పునాదిరాయి పడటానికి ముహూర్తం ఎప్పుడొస్తుందనే చర్చ జరుగుతోంది.

మోదీ వస్తారా.. పునాది వేస్తారా?
యూనివర్సిటీ తరగతుల నిర్వహణకు సిద్ధం చేసిన వైటీసీ భవనం

జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి

శంకుస్థాపనకు ప్రధానిని తీసుకొస్తానన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మూడోసారి కేంద్రంలో బీజేపీ రావడం సానుకూలాంశం

ఇప్పటికే రూ.889 కోట్ల కేటాయింపు

మార్చి 8న ప్రారంభమైన తాత్కాలిక క్యాంపస్‌

ములుగు, జూన్‌ 20: సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్‌లో రూ.889 కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరడం సానుకూలాంశం కాగా.. పునాదిరాయి పడటానికి ముహూర్తం ఎప్పుడొస్తుందనే చర్చ జరుగుతోంది. ములుగు జిల్లాలో మేడారం వనదేవతల పేరిట వర్సిటీ నిర్మాణం చేపడతామని గతంలో ప్రధాని మోదీ చెప్పడం, మార్చి 8న తాత్కాలిక క్యాంపస్‌ ప్రారంభ కార్యక్రమంలోకేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భూమి పూజకు మోదీని తీసుకొస్తామని ప్రకటించిన క్రమంలో ప్రధాని వస్తారా? శంకస్థాపన చేస్తారా? అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

తాత్కాలిక క్యాంపస్‌ ప్రారంభం

ములుగు మండలం జాకారం ట్రైబల్‌ యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపస్‌ను మా ర్చి 8న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్రమంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఓఎస్డీగా నియమితుడైన హైదరా బాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వంశి అదే రోజు బాధ్యతలు చేపట్టారు. యూనివర్సిటీ భూమిపూజ కార్యక్ర మానికి ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొస్తామని, ఆయన చేతుల మీదుగానే పనులు మొదలుపెడుతా మని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ పెరగడం, ఊహించని విధం గా ఎంపీ సీట్లు రావడం లాంటి పరిణా మాల నేపథ్యంలో సెంట్రల్‌ వర్సిటీ శంకు స్థాపనకు ప్రధానిని తీసుకొచ్చి క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కిషన్‌రెడ్డి మళ్లీ కేంద్ర మం త్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వీలై నంత త్వరగా పనులు ప్రారంభించేందుకు చొరవ చూపాలని సర్వత్రా కోరుతున్నారు.

పూర్తయిన భూసేకరణ

సమ్మక్క, సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ కోసం భూసేకరణ ప్రక్రియ ఎప్పుడో పూర్తయింది. జిల్లా కేంద్రం సమీపంలో 163 జాతీయ రహదారిని ఆనుకొని గట్టమ్మ దేవాలయం సమీపంలో 287 ఎకరాల ప్రభుత్వ భూమి, 50.12 ఎకరాల అటవీ భూములను అధికారులు సిద్ధం చేశారు. అటవీ శాఖ నుంచి సేకరించిన స్థలంలో నిబంధనల మేరకు ఎలాంటి నిర్మాణాలు చేయకుండా సామాజిక అడవుల పెంపకం, ఉద్యానాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈనెల 13న వర్సిటీ ఓఎస్డీ వంశి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. హద్దుల చుట్టూ గుర్తులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల నిర్మాణాల బాధ్యతను సెంట్రల్‌ పబ్లిక్‌వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ) పర్యవేక్షిస్తుండగా గ్రీన్‌సిగ్నల్‌ అందిన వెంటనే పనులు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే 2024-25 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించే ప్రక్రియ అమలులో ఉంది. నాలుగేళ్ల కాలపరిమితితో బీఏ (ఇంగ్లిషు), బీఏ (సోషల్‌ సైన్స్‌) కోర్సులను ప్రవేశపెట్టి దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. జూలైలో అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టులో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో కోర్సులో 32 చొప్పున సీట్లు ఉండగా గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎనిమిది చొప్పున సూపర్‌ న్యూమరరీ సీట్లను కేటాయించారు. మొత్తం సీట్ల భర్తీలో గిరిజనులకు 40.5శాతం రిజర్వేషన్‌ అమలవుతుంది.

Updated Date - Jun 20 , 2024 | 11:39 PM