ప్రాదేశిక ఎన్నికలపై అనిశ్చితి
ABN , Publish Date - May 24 , 2024 | 12:48 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ లు), మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ లు) ఎన్నికలు గడువులోపు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు మాదిరిగానే జిల్లా, మం డల పరిషత్తులకు కూడా ప్రత్యేక పాలనాధికారులను నియమిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రాదేశిక ని యోజవర్గాల పాలక వర్గాల గడువు జూలై 4వ తేదీతో ము గియనున్నది.
జూలై 4వతేదీతో ముగియనున్న గడువు
ఇంకా మొదలుకాని ఎన్నికల కసరత్తు
ప్రత్యేకాధికారులను నియమించే అవకాశం
మండలాల పునర్విభజన, రిజర్వేషన్లపై అస్పష్టత
గతంలో రెండు నెలలు ముందుగానే ఎన్నికలు
ఈసారి సకాలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు జరిగేనా?
హనుమకొండ, మే 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ లు), మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ లు) ఎన్నికలు గడువులోపు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు మాదిరిగానే జిల్లా, మం డల పరిషత్తులకు కూడా ప్రత్యేక పాలనాధికారులను నియమిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రాదేశిక ని యోజవర్గాల పాలక వర్గాల గడువు జూలై 4వ తేదీతో ము గియనున్నది. వాస్తవానికి 2019లో అప్పటి పాలకవర్గాల గడువు ఐదేళ్లు ముగియక ముందే.. రెండు నెలల ముందు గానే.. అంటే మే 15న ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో అప్పడు ఎన్నికైన కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టడానికి రెండు నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ ఈ సారి గడువు సమీపిస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికల సమరంపై కసరత్తు ప్రారంభం కాలేదు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుతో లోకసభ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వా త వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మూడు విడతలుగా జరిగే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. అప్పటికీ ప్రాదేశిక పాలకవర్గాల గడువు ముగు స్తుంది. ఆతర్వాతగానీ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేపట్టే అవకాశాలు లేవు. అయితే పంచాయతీ ఎన్నికల కన్నా ప్రాదేశిక ఎన్నికల విషయంలో కొంత అనిశ్చితి నెలకొని ఉన్నది. స్పష్టత రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందస్తు కసరత్తు చేయాల్సి ఉన్నది.
పునర్విభజనతో..
2019లో ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగి జడ్పీ లు కొలువు దీరిన తర్వాత తదనంతర కాలంలో కొన్ని జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగింది. దీనితో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల మార్పు జరిగింది. ఒక జిల్లాలో ఉన్న ప్రాదేశిక నియో జకవర్గాలు మరో జిల్లా పరిధిలోకి వెళ్లాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా మారడం ఇందుకు ఉదాహరణ. అయితే అప్పటికే జిల్లా ప్రజాపరిషత్తు, మండల ప్రజాపరిషత్తులు కొలువు తీరడం వల్ల అవి ఇప్పటి వరకు పాత జిల్లాల పరిధిలోనే కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికలు కొత్తగా చేరిన జడ్పీటీసీలు, ఎంపీటీలను కలుపుకొని ఎన్నికలు నిర్వహిస్తారు.
మొదలుకాని కసరత్తు
జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్లు, ఓటర్ల ముసాయిదా జాబితా, పోలింగ్ బూత్‌ల ఎంపిక, అధికారులకు శిక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రక్రియలేవి ప్రారం భం కాలేదు. ఒక వేళ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమి షన్ ఆదేశించినా పనులన్నీ చక్కబెట్టాలంటే కనీసం మూడు నెలలైనా పట్టే అవకాశం ఉన్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అధికా రులు పేర్కొంటున్నారు. అంటే గడువులోపు ఎన్నికలు జరగ డం అసాధ్యంగా కనిపిస్తోంది.
ఇప్పటికప్పుడు అసాధ్యం
ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించాల ని ఆదేశించినా క్షేత్ర స్థాయిలో వీలు పడకపోవచ్చు. 2019లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 71 జడ్పీటీసీలు, 1,030 మం డల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) ఉన్నాయి. వాటికి ఎన్నికలు నిర్వహించిన సమయంలో కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ శాఖ చట్టం ప్రకారం అప్పటి రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమలు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దృష్ట్యా ఈసారి కూడా అవే రిజర్వేషన్లు అమలు చే యాల్సి ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల త ర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావ డంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గత ప్రభుత్వం హయాంలో రాజకీయ ప్రాబల్యాలను దృష్టిలో పెట్టుకొని కొత్త మండలాల ఏర్పాటు జరిగింది. ఎన్నికల అనంతర కాలంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని కొత్త మండలాలు కూడా ఏర్ప డ్డాయి. జిల్లాల పునర్విభజన జరిగింది. ఈ క్రమంలో ములుగు జిల్లా కొత్తగా ఏర్పాటైంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా స్థా నే హనుమకొండ, వరంగల్ జిల్లాలు ఏర్పడ్డా యి. ఈ క్రమంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మండలాల బదిలీ జరిగింది. ఇలా జరిగినా.. ఈ మండలాలు పాత జడ్పీ పాలక వర్గ పరిధిలోనే ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాయి. బీసీ ఓటర్ల సంఖ్య పెరగడంతో రిజ ర్వేషన్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్త ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల వివరాలను అడగడంతో వివరాలను పంపించారు. జులై 5తో జిల్లా పరిషత్తు, మం డల పరిషత్తుల పాలకవర్గాల గడువు ముగి యనుండడంతో తదుపరి ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ఆ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
జడ్పీటీసీలు, ఎంపీటీసీలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 71 జడ్పీటీసీ, 1030 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం 7 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అవి హసన్‌పర్తి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, వేలేరు, ధర్మసాగర్, ఐనవోలు. జిల్లాల పునర్విభజన పలితంగా ఐదు మండలాలు ఆత్మకూరు, శాయంపేట, దామెర, పరకాల, నడికూడ హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చాయి. దీనితో హనుమకొండ జిల్లాలో జడ్పీటీసీ స్థానాల సంఖ్య 12కు పెరగనున్నది. జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 86 ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 16 జడ్పీటీసీలు ఉన్నాయి. ఏడాది కిందట మండలాల పునర్విభజనతో రెండు మండలాలు సీరోలు, ఇనుగుర్తి వచ్చి చేరాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం జడ్పీటీసీల సంఖ్య 18కి చేరనున్నది. ఎంపీసీ స్థానాలు 198 ఉన్నాయి. జనగామ జిల్లాలో 12 జడ్పీటీసీలు, 141 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం 11 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కొంత కాలం కిందట పునర్విభజనతో గోరికొత్తపల్లి వచ్చి చేరింది. దీంతో ఈ జిల్లాలో జడ్పీటీసీల సంఖ్య 12కు చేరనున్నది. ఎంపీటీసీ స్థానాలు 106 ఉన్నాయి. ములుగు జిల్లాలో 9 జడ్పీటీసీలు ఉన్నాయి. ఎంపీటీసీలు 87. వరంగల్ జిల్లాలో 16 జడ్పీటీసీలు, 412 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.