Share News

HYDRA: హైడ్రా బుల్డోజర్లు ఎటు వైపు?

ABN , Publish Date - Aug 27 , 2024 | 11:43 AM

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటంలా ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. అక్రమ నిర్మాణాలు చేసిన వారందరికీ ఎక్కడ బుల్డోజర్ తమ వైపునకు వస్తుందోనని భయంతో హడలెత్తిపోతున్నారు.

HYDRA: హైడ్రా బుల్డోజర్లు ఎటు వైపు?

హైదరాబాద్: పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటంలా ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. అక్రమ నిర్మాణదారులంతా ఎక్కడ బుల్డోజర్ తమ వైపునకు వస్తుందోనని భయంతో హడలెత్తిపోతున్నారు. సామాన్యులు మాత్రం నెక్ట్స్ ఎవరని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైడ్రా నెక్స్ట్ కూల్చివేతలపై తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. ఆ తరువాత ఎందుకోగానీ హైడ్రా సైలెంట్ అయ్యింది. హైడ్రా సైలెంట్ అయ్యింది అనుకోవడం కన్నా మరో ఎన్ కన్వె్న్షన్ స్థాయి కట్టడం జోలికి వెళ్లలేదు అనడం సమంజసమేమో. కానీ జనాలు మాత్రం హైడ్రా సైలెంట్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం హైడ్రా సైలెంట్ అవడానికి కారణం మరో సంచలనం కోసమే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పాస్ చేస్తున్నారు.


ఇప్పటికే 50 మంది ప్రముఖుల చిట్టాను హైడ్రా సిద్ధం చేసిందని సమాచారం. కూల్చివేతల కోసం అదనంగా బలగాలను సైతం సిద్ధం చేసిందని ప్రచారం అయితే జోరుగానే నడుస్తోంది. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం మూడు రోజులుగా బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయంలోనే ఉండిపోయారు. అన్ని శాఖల అధికారులతో కమిషనర్ రంగనాథ్ నాన్ స్టాప్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందన్నది మాత్రం బయటకు రావడం లేదు. నేతల హెచ్చరికలకు తలొగ్గుతున్నారా? లేదంటే మాంచి స్కెచ్ గీసుకుని తిరిగి రంగంలోకి దిగుతారా? అనేది తెలియకుండా ఉంది. ఒకవైపు బీజేపీ నేతలు సైతం రెండుగా చీలిపోయారు. బీజేపీ కింది స్థాయి నేతలు హైడ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రంగనాథ్‌ను అభినందించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లు నేడు హైడ్రా కార్యాలయనికి వస్తున్నారు.


మరోవైపు హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతల కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పేద, మధ్యతరగతి వారి ఆస్తుల కూల్చివేతపై పోరాటానికి బీజేపీ సిద్ధమవుతోంది. బడాబాబుల అక్రమ కట్టడాలు కూలిస్తే అభ్యంతరం లేదు కానీ పేదల జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు హైడ్రాపై ఎంఐఎం సైతం నిప్పులు కురిపిస్తోంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిన్నటికి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సల్కం చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించాలని.. కానీ ఆ స్కూల్‌ను మాత్రం కూల్చవద్దన్నారు. మాపై కక్షగట్టి, మాకు నోటీసులు ఇచ్చి, మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Aug 27 , 2024 | 11:43 AM