Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా సల్కం చెరువు కబ్జా..
ABN , Publish Date - Aug 27 , 2024 | 01:33 PM
ఇప్పుడు తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే.. ఒకటి హైడ్రా.. రెండు సల్కం చెరువు. ఓల్డ్ సిటీలోని సల్కం చెరువు దాదాపుగా కబ్జా కోరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: ఇప్పుడు తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే.. ఒకటి హైడ్రా.. రెండు సల్కం చెరువు. ఓల్డ్ సిటీలోని సల్కం చెరువు దాదాపుగా కబ్జా కోరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. చెరువు మధ్యలో ఎంఐఎంకు నేతలు ఓవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా విద్యాసంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. 70% చెరువు కబ్జాకు గురైనట్లు హైడ్రా ఇప్పటికే తేల్చింది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సల్కం చెరువు కబ్జా విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్.. ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన విద్యాసంస్థలను కూల్చుతుందా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చాలంటూ హైడ్రాకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి. చెరువును మట్టితో పూడ్చేసి భారీ భవనాల నిర్మాణం గావించారు . 2016 - 2021 లో కబ్జాకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది.
హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం ప్రముఖంగా వినిపిస్తున్న కబ్జాల్లో సల్కం చెరువు కబ్జా ఒకటి. పైగా అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో ఇది రాష్ట్రంలో మరింత హాట్ టాపిక్‌గా మారింది. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించాలని.. కానీ ఆ స్కూల్‌ను మాత్రం కూల్చవద్దన్నారు. మాపై కక్షగట్టి, మాకు నోటీసులు ఇచ్చి, మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించానని.. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారన్నారు. కత్తులతో దాడి చేయాలని.. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడవద్దని పేర్కొన్నారు. తమపై కక్షగట్టి, తమకు నోటీసులు ఇచ్చి, విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. ఒకవేళ కూల్చినా కూడా కుతుబ్‌మినార్ కంటే ఎత్తయిన భవనాలు నిర్మిస్తానని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.
ఇప్పటికే 50 మంది ప్రముఖుల చిట్టాను హైడ్రా సిద్ధం చేసిందని సమాచారం. నెక్ట్స్ కూల్చివేతల జోలికి వెళితే మాత్రం అది సల్కం చెరువు కబ్జాల జోలికే వెళతారని తెలుస్తోంది. కూల్చివేతల కోసం అదనంగా బలగాలను సైతం సిద్ధం చేసిందని ప్రచారం అయితే జోరుగానే నడుస్తోంది. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం మూడు రోజులుగా బుద్ధ భవన్ హైడ్రా కార్యాలయంలోనే ఉండిపోయారు. అన్ని శాఖల అధికారులతో కమిషనర్ రంగనాథ్ నాన్ స్టాప్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సమావేశాల సారాంశం ఏంటన్నది మాత్రం బయటకు రావడం లేదు. మొత్తానికి మాస్టర్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతారని అంతా చెప్పుకుంటున్నారు. సల్కం చెరువు కబ్జాలపై మాత్రం పెద్ద ఎత్తున సీఎం రేవంత్‌తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై హైడ్రా ఏం చేస్తుందో చూడాలి.