Share News

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతి.. నూలు కండువా, గాయత్రి సమర్పించిన పద్మశాలి సంఘం..

ABN , Publish Date - Sep 07 , 2024 | 09:14 AM

నేటి నుంచి ఖైరతాబాద్ మహా గణపయ్యకి పూజలు ప్రారంభం కానున్నాయి. ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహా గణపతి.. నూలు కండువా, గాయత్రి సమర్పించిన పద్మశాలి సంఘం..

హైదరాబాద్: నేటి నుంచి ఖైరతాబాద్ మహా గణపయ్యకి పూజలు ప్రారంభం కానున్నాయి. ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ కొలువుదీరాడు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఈ నెల 17 వ తేదీన ఘనంగా నిమజ్జన వేడుక జరుగనుంది. ఉదయం 11 గంటలకు వినాయకుడికి తొలి పూజ జరుగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేయనున్నారు.


మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేష్ ప్రతిను రూపొందించే పనులు ఆలస్యంగా ప్రారంభమయినా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి.


బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందింది. ఇక మహా గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు రానున్నారు. వారి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతేడాది బడా గణేష్‌ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఉత్సవ్ కమిటీ భావిస్తోంది.

Updated Date - Sep 07 , 2024 | 09:14 AM