మట్టి పాత్రల్లో వండితే...?
ABN , Publish Date - Feb 04 , 2024 | 11:13 AM
ఈ మధ్య మట్టి పాత్రల్లో చేసే వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి. అలాగే, ఇంట్లోనూ వంటలు చేసుకునేందుకు మట్టి పాత్రలు లభిస్తున్నాయి....
ఈ మధ్య మట్టి పాత్రల్లో చేసే వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి. అలాగే, ఇంట్లోనూ వంటలు చేసుకునేందుకు మట్టి పాత్రలు లభిస్తున్నాయి. వీటిల్లో వండిన ఆహారం తినడం వలన ఏవైనా ఉపయోగాలున్నాయా?
- రేణుక, కర్నూలు
మట్టి పాత్రల్లో వంట చేసేప్పుడు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వలన ఆహారంలోని పోషకాలు కొంత తక్కువ నశిస్తాయి. పాత్రల తయారీకి వాడిన మట్టి వలన ఈ వంటకాలకు ఒక ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుంది. ఆ మట్టిలో ఉండే కొన్ని లవణాలు, ఖనిజాలు కూడా ఆహారంలోకి చేరే అవకాశం ఉంది. కానీ కొన్ని రకాల పాలిషింగ్, కోటింగ్ వేసిన మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఆ పాత్రల్లోని మెర్క్యూరీ, లెడ్ వంటి ప్రమాదకరమైన పదార్థాలు ఆహారంలో చేరే అవకాశం ఉంది. మట్టి పాత్రల్లో ఆహారం వండేముందు వాటిని జాగ్రత్తగా శుభ్రపరచడం కూడా ముఖ్యం. సరైన మట్టి పాత్రల్లో వండిన తాజా ఆహారం తినడం వల్ల ఏరకమైన ఇబ్బందులు రావు.
అంజీర పండ్లలో పోషకాల గురించి వివరించండి. అందరికీ ఈ పళ్లు మంచివేనా?
- సుజాత, గద్వాల
అంజీర మార్కెట్‌లో మనకు రెండు రకాలుగా దొరుకుతోంది. తాజా పండుగా లేదా డ్రైఫ్రూట్‌గా. తాజా అంజీర పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తాజా లేదా ఎండిన అంజీరలో పీచు, పిండి పదార్థాలు, శరీరానికి అవసరమైన కొన్ని కొవ్వు పదార్థాలు ఉంటాయి. పళ్ళన్నిటిలోకంటే కూడా అంజీరలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంజీర లోని ఫ్లావనాయిడ్స్, పాలీఫీనాల్స్ శరీరంలోని టాక్సిన్లను తొలగించి వయోసంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. ఎండు అంజీర్‌లో కాల్షియమ్‌తో పాటు కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కే లాంటి మరిన్ని ఖనిజ లవణాలు ఉండడం వల్ల ఇవి పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. తాజా కానీ ఎండిన అంజీర పండును ఉదయమే తీసుకుంటే మలబద్దకం దూరమవుతుంది. రోజూ ఏదో ఓ సమయంలో అంజీర తీసుకుంటే జీర్ణకోశ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, మూత్రపిండాలు, రక్తనాళాల వ్యాధులు దరిచేరవు. గుండె ఆరోగ్యానికి కూడా అంజీర ఎంతో మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా అంజీరను రోజు తీసుకున్నట్లయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారు, రక్తంలో కొలెస్ర్టారాల్, ట్రైగ్లిసరైడ్లు అధికంగా ఉన్నవారు కూడా అంజీర తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలున్న అంజీరను అన్ని వయసుల వారు నిశ్చింతగా తీసుకోవచ్చు.
పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో పిల్లలకు ఎటువంటి ఆహారం ఇస్తే మంచిది?
- రాధిక, విజయవాడ
పరీక్షలకు సిద్ధమయ్యేప్పుడు పిల్లలు సాధారణంగా చదువుల్లో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల ఎదుగుదల సరిగా లేకపోవడమే కాక, వారు తీసుకునే ఆహారాన్ని బట్టి బరువు పెరగడం లేదా తగ్గడం, నీరసం, విటమిన్ల లోపం లాంటి పలు రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రోజూ గుడ్లు, పాలు, పెరుగు, అన్ని రకాల పప్పులు (కంది, పెసర, సెనగ మొదలైనవి) ఇచ్చినట్లయితే వారి ప్రొటీన్ అవసరాలకు సరిపోతుంది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేప, మటన్ మొదలైనవి నూనె తక్కువ వేసి వండి పెట్టవచ్చు. పై ఆహారంలోని ప్రొటీన్లతో పాటు కాల్షియం, ఇనుము అవసరం. విటమిన్లు ఖనిజాల కోసం తాజా పండ్లు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. కేవలం అన్నం, రొట్టెలు మాత్రమే ఎక్కువగా పెట్టడం కాకుండా వాటితో పాటు కూర, పప్పు అధికంగా తినడానికి ప్రోత్సహించాలి. చాక్ లెట్లు, బిస్కెట్లు, చిప్స్, శీతలపానీయాలు మొదలైనవి పెద్దలకు చేసినట్టే పిల్లల ఆరోగ్యానికీ హాని చేస్తాయి. కాబట్టి వీటి బదులుగా పండ్లు, మొలకెత్తిన గింజలు, బఠాణీలు, సెనగలు, మరమరాలు, మొక్కజొన్న పేలాలు, ఇంట్లో తయారు చేసిన రొట్టెలు, శాండ్విచ్‌లు మొదలైన వాటిని అల్పాహారంగా ఇస్తే మంచిది. బాదం, ఆక్రోట్ లాంటి గింజల్లో ఉండే ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్లు మెదడు చురుగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. సరైన ఆహారంతో పాటు సరైన శారీరక శ్రమ లేదావ్యాయామం కూడా మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. రాత్రి కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూడాలి.