ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:44 AM
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది.

అగ్రిగోల్డ్ డిపాజిటర్ల పేరిట అక్రమాల వ్యవహారంలో సునీల్‌కుమార్‌పై నమోదు
రఘురామ ఫిర్యాదుతో ప్రభుత్వం చర్యలు
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన ఐపీఎస్ పల్లె జాషువాపైనా నమోదుకు ఆదేశం
గవర్నర్ అనుమతి లభించగానే ఇదే కేసులో వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీపైనా!
అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల పేరిట అక్రమాలకు పాల్పడిన సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారు. అలాగే స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన ఘటనలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన పల్లె జాషువాపై ఏసీబీ కేసు నమోదుకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజనీపైనా చర్యలు తీసుకునేందుకు గవర్నర్ అనుమతి కోరింది. అనుమతి రాగానే ఆమెపైనా కేసు పెట్టే వీలుంది. అగ్రిగోల్డ్ లబ్ధిదారుల పేరుతో బాపట్ల జిల్లా రామకూరులో 96 మంది నకిలీ డిపాజిటర్ల ఖాతాల్లోకి లక్షలాది రూపాయలు డిపాజిట్ చేయించిన పీవీ సునీల్ కుమార్... తర్వాత బెదిరించి విత్ డ్రా చేయించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గత నెలలో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఏసీబీ ఉన్నతాధికారులు అవినీతి నిరోధక చట్టం 17(ఏ) కింద అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి లభించడంతో పీవీ సునీల్ కుమార్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా, మాజీ మంత్రి విడదల రజనీపైనా ఏసీబీ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది.
గత ప్రభుత్వంలో చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని చలపతిని బెదిరించి రెండు కోట్ల రూపాయలు వసూలు చేశారు. రజనీ మొదట తన వ్యక్తిగత సహాయకుడు రామక్రిష్ణ ద్వారా చలపతికి ఫోన్ చేయించి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయించారు. చలపతి స్పందించక పోవడంతో విజిలెన్స్ ఎస్పీ జాషువాను రంగంలోకి దించారు. జాషువా తీవ్రంగా బెదిరించడంతో రజనీకి 2కోట్లు అందజేసినట్లు బాధితుడు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సెప్టెంబరులో హోం శాఖ మంత్రి అనితకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ మేరకు పేర్కొన్నారు.