MARIJUANA : 4.8 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:19 AM
‘ఊరూరా గంజాయి’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ రెండ్రోజుల క్రితం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

కదిరి, జనవరి 20(ఆంరఽధజ్యోతి): ‘ఊరూరా గంజాయి’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ రెండ్రోజుల క్రితం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నంబులపూలకుంట సమీపంలోని కొత్తరోడ్డు వద్ద సోమవారం పదిమందిని అరెస్టు చేసి, వారి నుంచి 4.8 కేజీల గంజాయి ప్యాకెట్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషనలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి పట్టివేత వివరాలను డీఎస్పీ శివనారాయణ వెల్లడించారు. రూరల్ సీఐ నాగేంద్ర పర్యవేక్షణలో ఎస్‌ఐ వలీబాషా, సిబ్బంది బృందాలుగా ఏర్పడి, తనిఖీలు చేపట్టారు. నంబులపూలకుంట కొత్త రోడ్డు వద్ద గుంపులుగుంపులుగా ఉన్న వ్యక్తుల వద్ద ప్లాస్టిక్ కవర్లను గుర్తించారు. పోలీసులను చూసి వారు పారిపోవడానికి ప్రయత్నించగా.. ఎస్‌ఐ, సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయి లభించింది. ఒక్కో ప్యాకెట్‌లో 400 గ్రా. గంజాయి ఉంచి, రూ.6వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. అరెస్టయిన వారిలో అరకు జిల్లాకు చెందిన అర్జున, అన్నమయ్యజిల్లా కోసువారిపల్లికి చెందిన బాలాజీ, నంబులపూలకుంట మండలానికి చెందిన ఆవుల మల్లికార్జున, ఆవుల శివ, ఆవుల రవి, సాలిపాటి నగేష్, ఇడగొట్టు ప్రశాంత, పఠాన జాఫర్, సాలిపాటి వెంకటరమణ, షేక్ అలీ ఉన్నారు. సమావేశంలో రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ వలీబాషా, సిబ్బంది పాల్గొన్నారు.