Gold Man బంగారు బుల్లోడు
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:01 AM
బంగారం అంటే ఇష్టపడనివారు ఉంటారా..? ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా.. అంతో ఇంతో బంగారాన్ని పోగేసుకుంటారు. గజదొంగలో గోల్డ్‌మ్యాన ఎన్టీఆర్ నుంచి కేజీఎఫ్‌లో రాఖీ భాయ్ వరకూ బంగారాన్ని పోగేసుకున్నవారే కదా..! అంత కాకపోయినా, వారి బాటలో నడుస్తున్నారు విద్యాశాఖలో ఓ గోల్డ్ మ్యాన..!
విద్యాశాఖలో గోల్డ్ మ్యాన..!
ప్రైవేటు విద్యాసంస్థల్లో వివాదాలే వనరులు
విద్యార్థి నాయకులను ఉసిగొల్పి బేరసారాలు
కాసులు వద్దు.. కనకపు ఆభరాణాలే ముద్దు..!
అనంతపురం విద్య, జనవరి 15(ఆంధ్రజ్యోతి): బంగారం అంటే ఇష్టపడనివారు ఉంటారా..? ఉన్నవారు, లేనివారు అనే తేడా లేకుండా.. అంతో ఇంతో బంగారాన్ని పోగేసుకుంటారు. గజదొంగలో గోల్డ్‌మ్యాన ఎన్టీఆర్ నుంచి కేజీఎఫ్‌లో రాఖీ భాయ్ వరకూ బంగారాన్ని పోగేసుకున్నవారే కదా..! అంత కాకపోయినా, వారి బాటలో నడుస్తున్నారు విద్యాశాఖలో ఓ గోల్డ్ మ్యాన..! ‘డబ్బులు ఊరికే రావు..’ అనే ప్రకటన బాగా చూశారో ఏమో.. ‘డబ్బులు వద్దు.. గోల్డ్ చైన.. ఉంగరం.. ఏదో ఒకటి ఇవ్వండి..’ అని అడిగి మరీ తెప్పించుకుంటారు. కానుకగా స్వీకరిస్తున్నారు. ఆయన కానుకల వ్యవహారం శృతిమించడంతో బాధితులు విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాలు పెట్టాడితే కనకమే..
జిల్లా విద్యాశాఖలో డివిజన స్థాయిలో పనిచేస్తున్న ఆ అధికారి పాఠశాలల తనిఖీలకు వెళితే చుక్కలు చూపిస్తారట. నిబంధనల పేరిట బెదిరించి దారికి తెచ్చుకుంటారట. అంతో ఇంతో డబ్బులు ఇవ్వబోతే.. వద్దు.. బంగారం కావాలని అడుగుతారట. ఆయనకు బంగారం అంటే భలే ఇష్టమని చెబుతున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నుంచి కనక వస్తువులను కానుకగా తీసుకుంటున్న ఆయన.. వారి దృష్టిలో ‘బంగారు బుల్లోడు’గా మారిపోయారు. ఈ నెల 24న విద్యాశాఖ కమిషనర్ జిల్లాకు వస్తున్నారు. బంగారు బుల్లోడి ఆగడాల గురించి ఆయనకు ఫిర్యాదు చేయాలని ప్రైవేట్ పాఠశాలల సంఘం, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు కొందరు సిద్ధమైనట్లు సమాచారం.
నిఘా వేసి..
తన మాట వినని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై ఆ అధికారి నిఘా వేస్తారట. ఏ చిన్న అవకాశం దొరికినా తానే ఫిర్యాదులు పెట్టిస్తారట. తనకు అనుకూలంగా ఉండే కొన్ని విద్యార్థి సంఘాల నాయకులను ఉసిగొల్పి.. రంగంలోకి దింపుతారట. తన ప్లానలో భాగంగా, తన పరిధిలోని స్కూళ్లపై ఫిర్యాదులు రాగానే విచారణకు వెళతారట. ఇక అంతే..! గోడకు చిన్నపాటి క్రాక్ కనిపించినా, కిటికీ దెబ్బతిన్నా, టాయిలెట్‌ల తలుపులకు నట్లు ఊడినా, పాఠశాల ముందు రోడ్డుపై జీబ్రా క్రాస్ లేకపోయినా వారికి మూడినట్లే అంటున్నారు. నిబంధనలన్నీ వివరించి.. వాటన్నింటినీ అతిక్రమించారని హెచ్చరికలు జారీ చేస్తారు. ఓ నెలరోజులపాటు తన కార్యాలయం చుట్టూ తిప్పించుకుని.. దారికి తెచ్చుకుంటారట. ఇది ఒక దారి. ఇంకోటీ ఉంది..!
పాఠశాలలో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వెంటనే వాలిపోతారు. ఉదయం 6 గంటలకే కరస్పాండెంట్లకు ఫోన చేస్తారు. ‘ఏంటి.. ఏదో జరిగిందట కదా..? నాకు చెప్పకుంటే ఎలా..’ అని గద్దిస్తారట. ఆ సమయంలో తన దారికి వస్తే సరి..! లేకుంటే తన పవర్ ఉపయోగించి ఎంక్వైరీ రుచి చూపిస్తారు. చేసేది లేక కొందరు సరెండర్ అవుతారు. ఆ వెంటనే సారు గొంతెమ్మ కోర్కెల చిట్టా విప్పుతారట. బంగారు గొలుసు వంటి ఏదో ఒక ఆభరణాన్ని కానుకగా తీసుకుంటారట. ఇది మరో రూటు..!
ఫిర్యాదులపై చర్యలేవీ..?
ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయని గతంలో కొన్ని విద్యార్థి సంఘాలు ఆ అధికారికి ఫిర్యాదు చేశాయి. అక్రమాలకు ఆధారాలను కూడా చూపించాయి. ప్రత్యక్షంగా పట్టించాయి. అయినా ఆ అధికారి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ అధికారికి అక్రమాలతో నిమిత్తం లేదని, ఏది జరిగినా తనకు అనుకూలంగా మార్చుకుని కనకపు కానుకలు పుచ్చుకుంటారని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతోనూ ఆయన దురుసుగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలు, అటు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్య సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.