Share News

MLA KANDIKUNTA: అణగదొక్కాలని చూస్తే సహించం

ABN , Publish Date - Jan 05 , 2025 | 12:02 AM

అణగదొక్కాలని చూస్తే సహించబోమనీ, చేనేత కులాల సత్తా ఏంటో చూపుతామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఉద్ఘాటించారు. స్థానిక శివానగర్‌లోని శివాలయం వద్ద పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఎమ్యెల్యే కందికుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA KANDIKUNTA: అణగదొక్కాలని చూస్తే సహించం
Speaking MLA Kandikunta Venkataprasad

ఘనంగా చేనేత కులాల ఐక్యవేదిక సదస్సు

ధర్మవరం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అణగదొక్కాలని చూస్తే సహించబోమనీ, చేనేత కులాల సత్తా ఏంటో చూపుతామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఉద్ఘాటించారు. స్థానిక శివానగర్‌లోని శివాలయం వద్ద పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఎమ్యెల్యే కందికుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి చేనేత ప్రముఖరాలు జయశ్రీ అధ్యక్షత వహించారు. అంతకుముందు కదిరిగేటు వద్ద ఉన్న చేనేత విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుంచి వెండిరథంపై శివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ శివాలయంలో పూజలు నిర్వహించారు. సమావేశానికి రాయలసీమ జిల్లాలతోపాటు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భారీగా చేనేత నాయకులు హాజరయ్యారు. కందికుంట మాట్లాడుతూ.. 80వ దశకం నుంచి ముందు వరుసలో ఉన్న చేనేతలు నిస్వార్థంగా అందరినీ అందలమెక్కిస్తున్నారన్నారు. అలా అందలం ఎక్కిన వారే చేనేతలను పాతాళానికి తొక్కేస్తుండటం సహించరానిదన్నారు. చేనేతలను చైతన్యవంతులను చేసి, రాజకీయ సుస్థిరత స్థాపించాలన్నదే తమ అభిమతమన్నారు. ధర్మవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారిందంటే అందులో చేనేతలదే కీలకపాత్ర అన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవ చేస్తూ నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే పదవులు వెన్నంటే వస్తాయన్నారు. ధర్మవరంలో కౌన్సిలర్‌, చైర్మన పదవులతో మురిసిపోతుంటారన్నారు. ఉన్నత పదవులే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. తనకు కదిరి నియోజకవర్గమే సర్వస్వమన్నారు. ధర్మవరం చేనేతల అభివృద్ధికి సహకారం అందిస్తానని ఆయన అన్నారు. అనంతరం కందికుంటను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత ప్రముఖులు బండారు ఆనందప్రసాద్‌, గిర్రాజు రవి, ప్రకాశ, పోలా ప్రభాకర్‌, గుద్దిటి రాము, గడ్డం శ్రీనివాసులు, గడ్డం పార్థసారధి, పరిశే సుధాకర్‌, బీరే గోపాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:02 AM