Share News

AgriGold చెరి సగం పంచుకుందాం..!

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:31 PM

అగ్రిగోల్డ్‌ భూముల్లో వచ్చే ఆదాయాన్ని ఏటా చెరి సగం పంచుకుందామని విజయవాడలోని ఓ అధికారికి వైసీపీ నాయకుడు బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది.

AgriGold చెరి సగం పంచుకుందాం..!
అగ్రిగోల్డ్‌ ముఖద్వారం

ఓ అధికారికి వైసీపీ నాయకుడి ఆఫర్‌

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో బేరం

పుట్లూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ భూముల్లో వచ్చే ఆదాయాన్ని ఏటా చెరి సగం పంచుకుందామని విజయవాడలోని ఓ అధికారికి వైసీపీ నాయకుడు బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. పుట్లూరు మండలంలోని కడవకల్లు, చెర్లోపల్లి గ్రామాల మధ్య సుమారు 217 ఎకరాల అగ్రిగోల్డ్‌ భూములు ఉన్నాయి. ఇందులో సుమారు వంద ఎకరాలను స్థానిక వైసీపీ నాయకుడు అక్రమంగా సాగు చేసుకుంటున్నాడు. ఈ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆయన బేరసారాలకు దిగినట్లు తెలిసింది. ‘సార్‌... పేపర్‌లో ఎలాగూ వచ్చింది. ఇంకేమి అవుతుంది? ఉన్న భూముల్లో వచ్చే ఏడాది భారీగా పెట్టుబడులు పెడతాను. వచ్చే ఆదాయంలో చెరి సగం పంచుకుందాం..’ అని ఓ అధికారికి ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. విజయవాడకు చెందిన ఆ అధికారికి ఇచ్చిన ఆఫర్‌ స్థానికంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది.

అడుగు పెడితే వదిలేది లేదు..

సీజ్‌ చేసిన అగ్రిగోల్డ్‌ భూముల్లో ఎవరైనా అడుగుపెడితే సహించేదిలేదని ఆ వైసీపీ నాయకుడు కొందరికి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. గత నెలలో రాష్ట్రస్థాయి వామ పక్షనాయకులు ఆ భూమల పరిశీలనకు వచ్చారు. ఆ తరువాత మరికొందరు అక్కడికి వెళ్లారు. అగ్రిగోల్డ్‌ భూముల్లో ఎలాంటి పరికరాలు ఉన్నాయి, ఏ పంటలు సాగు చేశారో చూసేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై వైసీపీ నాయకుడు చిందులు వేసినట్లు సమాచారం. ‘ఇక్కడ మేము కాపలాగా ఉన్నాం. మాకు జీతాలు ఇవ్వలేదు. అందుకే ఈ భూములను సాగు చేసుకుంటున్నాం. ఎవరి అనుమతి తీసుకొని మీరు ఇక్కడికి వచ్చారు..?’ అని దబాయించినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్‌ భూములను ఆక్రమించినా, సీజ్‌ చేసిన భూములను జిల్లా అధికారులు పరిశీలించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Jan 03 , 2025 | 11:31 PM