Minister Anagani Satya Prasad : రెవెన్యూలో అంతా గందరగోళం
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:59 AM
రాష్ట్రంలో భూ వివాదాలు, రీసర్వే వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలు తీర్చడానికి కీలకమైన అధికారులే తహశీల్దార్లు. వారి నియామకంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

అర్హతలేకుండానే పోస్టింగులు
రీ సర్వేలో తప్పులకు వారిదే బాధ్యత
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో భూ వివాదాలు, రీసర్వే వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలు తీర్చడానికి కీలకమైన అధికారులే తహశీల్దార్లు. వారి నియామకంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 358 మందికిపైగా తహశీల్దార్ల కొరత ఉంది. వీటిని రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్‌తో కొంత వరకు సర్దుబాటు చేయవచ్చు. అది కూడా తాత్కాలికంగా ఏర్పాటుకే. కానీ, అంతకన్నా తక్కువ స్థాయిలో అంటే సీనియర్ అసిస్టెంట్లను తహశీల్దార్‌లుగా పెట్టి అత్యంత కీలకమైన మండల రెవెన్యూ వ్యవస్థను నడిపిస్తున్నారు. ఈ సీనియర్ అసిస్టెంట్లే రీసర్వే తప్పులను పరిష్కరించడంలో ఆర్‌ఎస్ డీటీలుగా విఫలమయ్యారు. ఇప్పడు వారే మండల తహశీల్దార్లు అయితే ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో ప్రభుత్వానికే తెలియాలి.
జగన్ జమానాలో రెవెన్యూ కుదేలు
రాష్ట్రంలో 679 మండలాలు, 17,564 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండలంలో రెవెన్యూ వ్యవస్థే కీలకం. ప్రతి మండలానికి ఓ తహశీల్దార్ ఉంటారు. ఆ పోస్టుకు క్వాజీ జ్యుడీషియరీ అధికారాలు ఉంటాయి. మండలానికి కీలకమైన అధికార ప్రతినిధిగా ఈ పోస్టు ఉంటుంది. ఒక్క రెవెన్యూ పరిధిలోనే 578కిపైగా సేవలను తహశీల్దార్ పర్యవేక్షించాలి. తహశీల్దార్ ఆఫీసు నియంత్రణలో గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి రెవెన్యూలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే 160కిపైగా తహశీల్దార్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ ఖాళీల సంఖ్య 358కి చేరింది. అంటే, 321 మండలాలకు మాత్రమే రెగ్యులర్ తహశీల్దార్లు ఉన్నారు.
ఖాళీలు పెరిగిపోయి..
తహశీల్దార్ పోస్టులో కేడర్‌కు తగినట్లుగా అధికారులు అందుబాటులో లేకుంటే సంబంధిత మండల రెవె న్యూ డీటీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఇన్‌చార్జి తహశీల్దార్‌గా డీటీని నియమిస్తారు. ఆ మేరకు బాధ్యతలు, అధికారాలు, విధులు అప్పగిస్తారు. అదికూడా తాత్కాలికంగానే ఉంటుంది. నిర్ణీత కాల వ్యవధిలో రెగ్యులర్ అధికారిని ప్రభుత్వం నియమించాలని రూల్స్ చెబుతున్నాయి. నిజానికి తహశీల్దార్ పోస్టుకు ఫీడర్ కేటగిరీ డీటీనే. డీటీ అంటే ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా నియమితులైనవారు, లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ నుంచి డీటీగా పదోన్నతి కల్పిస్తారు. తర్వాత అర్హతను బట్టి తహశీల్దార్‌గా పదోన్నతి కల్పిస్తారు. జగన్ ప్రభుత్వంలో అలాంటివేమీ జరగలేదు. దీంతో ఖాళీలు పెరిగిపోయాయి. మరోవైపు రీసర్వే డీటీ అనే వ్యవస్థను కొత్తగా తీసుకొచ్చారు. మండల రెవెన్యూ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారినే ఎంపికచేసి వారికి ఆర్‌ఎ్‌సడీటీలుగా హోదా కల్పించారు. రీసర్వే జరుగుతున్న మండలాల్లో రైతుల నుంచి పిటిషన్లను పరిష్కరించడం వారి బాధ్యత. రీ సర్వే ముగిసిన తర్వాత ఆ పోస్టులు రద్దైపోయేలా నాడు సర్వేశాఖ విధివిధానాలు ప్రకటించింది. సర్వే-సరిహద్దుల చట్టం-1923లోని సెక్షన్ 13 కింద సర్వే పూర్తైనట్లు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇక ఆర్‌ఎ్‌సడీటీల అవసరం ఉండదు. అలా 8,648 గ్రామాల్లో రీసర్వే పూర్తియినట్టు నోటిఫికేషన్లు ఇచ్చారు.
సిబ్బంది లేరనే కారణంతో..
కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి రీసర్వే కారణంగా వేలాది గ్రామా లు రైతుల ఆందోళనలు, పోరాటాలతో హోరెత్తుతున్నాయి. రీ సర్వేలో జగన్ సర్కారు సృష్టించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీని ప్రకారం చేయాల్సిన తొలి పని తహశీల్దార్ పోస్టులను భర్తీచేసి మండల రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడం. అయితే, రెవెన్యూశాఖ ఆ పనిచేయలేదు. దీనికి భిన్నంగా రీసర్వేలో ఆర్‌ఎ్‌సడీటీలుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్లను ఏకంగా 100కుపైగా మండలాలకు తహశీల్దార్లుగా పంపింది. నిజానికి తహశీల్దార్‌గా రె గ్యులర్ రె వెన్యూ డీటీలకే అదనపు బాధ్యతలు అప్పగించాలి. అయితే, తగినంత సిబ్బంది లేరనే కారణంతో ఏమాత్రం ప్రామాణికత, శిక్షణ, నైపుణ్యత లేని ఆర్‌ఎ్‌సడీటీలను తహశీల్దార్ పోస్టుల్లో కూర్చోబెట్టింది. అలాంటివారిలో చాలా మందికి రెవెన్యూ పరిజ్ఞానం అంతగా ఉండదు. రెవెన్యూ చట్టాలు, సర్వీసులు, ప్రజా సమస్యలు, న్యాయపరమైన అంశాలపై అవగాహన ఉండదు. తహశీల్దార్‌గా నియమితులయ్యేవారికి పోస్టింగ్ ఇవ్వడానికి ముందే 11రకాల పరీక్షలు నిర్వహి స్తారు. వాటిలో ఉత్తీర్ణులైన వారికే పోస్టింగ్ ఇస్తారు. కానీ, సీనియర్ అసిస్టెంట్‌ను తహశీల్దార్‌గా నియమించిన ఘనత రెవెన్యూశాఖదే. ఈ పోస్టులు లాభసాటిగా ఉన్నాయని కొందరు ఆర్‌ఎ్‌సడీటీలు పైరవీలు చేసి మరీ సాధించుకున్నారు. జిల్లాల్లో అధికార పార్టీ నేతలు, కీలక అధికారులను ప్రసన్నం చేసుకొని కీలక మండలాలు దక్కించుకున్నారు. కొందరు కలెక్టర్లతో ఉన్న పరిచయాలతో పోస్టింగులు పొందారు.
తప్పులూ వారివే..పరిష్కారమూ వారిదే
కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది నిర్వహించిన గ్రామసభల్లో రీ సర్వే తప్పులపై 2.80 లక్షల పిటిషన్లు వచ్చాయి. ఆర్‌ఎ్‌సడీటీల వైఫల్యం కారణంగా రీసర్వేలో వచ్చిన తప్పులు పరిష్కారానికి నోచుకోలేదు. రైతుల అప్పీళ్లూ పరిష్కారం కాలేదు. రైతుల పిటిషన్లను విచారించకుండానే పరిష్కరించినట్లుగా అడ్డగోలుగా సెటిల్ చేశారు. ఆ తర్వాత వేలాది గ్రామాల్లో రీసర్వే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆర్‌ఎ్‌సడీటీలే 100కుపైగా మండలాల్లో తహశీల్దార్లుగా ఉన్నారు. అప్పుడు రైతుల పిటిషన్లను పరిష్కరించలేక చేష్టలుడిగిన వారే ఇప్పుడు తహశీల్దార్‌లుగా ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఇదే అసలు గందరగోళం. రీసర్వే లోపాల పరిష్కారం అత్యధికంగా ఆర్‌ఎ్‌సడీటీలు తహశీల్దార్లుగా ఉన్న మండలాల్లోనే జరిగిననట్టు నివేదికలు చెబుతున్నాయి. అంటే తెరవెనుక ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. రైతుల పిటిషన్లను అడ్డగోలుగా మూసేసి, పరిష్కారంగా చూపిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. భూ సమస్య పరిష్కారం కాలేదంటూ రైతులు పాత సమస్యలనే ప్రస్తావిస్తుండటం దీనికి నిదర్శనం. ఇతర వేదిక ల పైనా రైతులు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. అది కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.