Nara Bhuvaneshwari: త్వరలోనే నంబర్ వన్‌గా ఏపీ
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:03 AM
కూటమి ప్రభుత్వ పాలనతో ఏపీ దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. ఆమె కుప్పంలో మహిళల శిక్షణ కార్యక్రమం ప్రారంభించి, ఇండియన్ బ్యాంకు మైక్రో సెట్ బ్రాంచి కార్యాలయాన్ని ప్రారంభించారు

చంద్రబాబుపై నమ్మకంతోనే పెట్టుబడులు
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
కుప్పం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనతో ఏపీ అతి త్వరలోనే దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజైన గురువారం భువనేశ్వరి కుప్పం మండలంలో పర్యటించారు. అలీప్ ఆధ్వర్వంలో ఏర్పాటుచేసిన ఆరు రోజుల మహిళల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు కుప్పంలో ఇండియన్ బ్యాంకు మైక్రో సెట్ బ్రాంచి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో భువనేశ్వరి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా మారేదన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ప్రస్తుతం ఆయన ఆ పనిలోనే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులతో ఏపీకి తరలివస్తున్నారన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీలేదని, వారికి అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. అంతకుముందు ఇండియన్ బ్యాంకు మైక్రో సెట్ శాఖను ప్రారంభించిన భువనేశ్వరి ఆ బ్యాంకు ద్వారా మొత్తం రూ.630 కోట్ల రుణాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎ్‌స.మునిరత్నం, కడా పీడీ వికాస్ మర్మత్, అలీప్ చైర్‌పర్సన్ రమాదేవి, ఇండియన్ బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.