Poor Family : బాత్‌రూమ్ నుంచి సొంతింటికి..!
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:29 AM
స్నానాల గదినే ఆవాసంగా చేసుకుని దుర్భర జీవితం గడుపుతున్న ఓ పేద కుటుంబానికి ‘ఆంధ్రజ్యోతి’ కథనం ఆవాసాన్ని కల్పించింది.

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో నెరవేరిన పేదింటి కల
నేడు మడకశిర ఎమ్మెల్యే
రాజు చేతులమీదుగా గృహప్రవేశం
మడకశిర రూరల్, ఫిబ్రవరి 18: స్నానాల గదినే ఆవాసంగా చేసుకుని దుర్భర జీవితం గడుపుతున్న ఓ పేద కుటుంబానికి ‘ఆంధ్రజ్యోతి’ కథనం ఆవాసాన్ని కల్పించింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం చొరవతో సొంతింటి కల నెరవేర్చింది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్‌ఆర్ పాళ్యానికి చెందిన నరసింహమూర్తి, లక్ష్మీదేవి దంపతులు బుధవారం గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సొంత ఇల్లు లేని వీరు బాత్‌రూమ్‌లో నివసిస్తున్న దుస్థితిపై గతేడాది సెప్టెంబరు 24న ‘వైసీపీ సర్కారు నిర్లక్ష్యం.. బాత్‌రూమ్‌లో నివాసం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడింది. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, అధికారులకు విన్నవించినా పక్కా ఇంటిని మంజూరు చేయని వైనాన్ని వివరించింది. దీంతో స్పందించిన మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. అదే రోజు గ్రామానికి వెళ్లి, ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయారు. పక్కా ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకూ అద్దె ఇంట్లో ఉండేందుకు రూ.20 వేలు ఇచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి 24 గంటల వ్యవధిలో లక్ష్మీదేవి పేరిట ఇంటి స్థలం పట్టా, పక్కా ఇంటిని మంజూరు చేయించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి భూమిపూజ చేశారు. 5 నెలల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఇంటిని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభిస్తున్నారు.
రుణపడి ఉంటాం..
ఏళ్ల తరబడి బాత్ రూమ్‌లో గడిపాం. మా కష్టంపై ‘ఆంధ్రజ్యోతి’ స్పందించింది. అది చూసి ఎమ్మెల్యే స్పందించారు. ఇంటి పట్టా ఇప్పించారు. దగ్గరుండి ఇంటి నిర్మాణం జరిగేలా చూశారు. ఈ సంతోషానికి కారణమైన ‘ఆంధ్రజ్యోతి’కి, ఎమ్మెల్యేకు ఎంతగానో రుణపడి ఉంటాం.
- నరసింహమూర్తి, లక్ష్మీదేవి దంపతులు