ప్రధాని పర్యటనకు విస్తృత ఏర్పాట్లు: సీఎస్
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:26 AM
ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏరాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు.
అమరావతి, విశాఖపట్నం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏరాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని విశాఖపట్నం కలెక్టర్ హరీంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ బాగ్చిలను ఆదేశించారు. ఈ నెల 8న సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ చేరుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకూ రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు.
రూ.1.5 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపనలు: డోలా
పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రూ.1.5 లక్ష ల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఈనెల 5న జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షిస్తుందన్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు అంతా సమన్వయంతో పనిచేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు.