Divyang Pension Transfer: దివ్యాంగ విద్యార్థుల ఖాతాలకే పింఛను
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:47 AM
దివ్యాంగ విద్యార్థులకు పింఛన్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల కోసం కొత్త కేంద్రాలు, బ్రెయిలీ పుస్తకాలు వంటి పథకాలపై సమీక్ష నిర్వహించారు

త్వరలో వయోవృద్ధులకు డిజిటల్ గుర్తింపు కార్డులు
అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కృషి: డోలా
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): దివ్యాంగ విద్యార్థులు ఇంటికి దూరంగా ఉంటూ ఏ ప్రాంతంలో చదువుతున్నా ఫింఛన్ మొత్తాలను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తామని రాష్ట్ర వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2వ సమావేశం, స్టేట్ అడ్వైజరీ బోర్డు ఆన్ డిజాబిలిటీ సమావేశం నిర్వహించారు. వివిధ పథయాల అమలుపై మంత్రి డోలా సమీక్షించారు. ‘అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. నిజమైన లబ్ధిదారులకు పింఛను అందించడమే ధ్యేయంగా పరిశీలన జరుగుతోంది. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఫించనూ తొలగించబోం. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రంలో 5 ప్రధానమంత్రి దివ్యాష కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వీటిని విజయవాడ, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్నాం. అంధ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం మొదట్లోనే బ్రెయిలీ లిపి పుస్తకాలు అందిస్తాం. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నాం. అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వయోవృద్ధులందరికీ డిజిటల్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నాం’ అని మంత్రి తెలిపారు.
For AndhraPradesh News And Telugu News