BJP Spokesperson : రష్యన్ పేరు పెట్టుకొని తమిళ రాజకీయాలు!
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:58 AM
ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్..’ సెమినార్‌లో షెహజాద్ పూనావాలా హితవు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

స్టాలిన్ ముందు తన పేరు మార్చుకోవాలి: బీజేపీ నేత షెహజాద్
అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): రష్యన్ పేరు పెట్టుకుని తమిళనాట రాజకీయాలు చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ ముందు తన పేరు మార్చుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా హితవు పలికారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్..’ సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక తాటిపైకి రావాల్సిన తరుణంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హిందీపై రాద్ధాంతం చేస్తున్న స్టాలిన్‌కు 2011లో హిందీ భాషపై వేసిన కమిటీని కరుణానిధి సమర్థించిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. అప్పట్లో రూపీ సింబల్‌కు మద్దతిచ్చిన స్టాలిన్ ఇప్పుడెందుకు తిరస్కరించారో చెప్పాలన్నారు. సమావేశంలో రాష్ట్రబీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, కేశవ్‌కాంత్, నాగోతు రమేశ్‌నాయుడు, సాధినేని యామినీశర్మ తదితరులు మాట్లాడారు.