Share News

Central Forensic Science Lab: సిద్ధమవుతున్న సీఎఫ్‌ఎస్‌ఎల్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:52 AM

అమరావతిలో సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (సీఎ్‌ఫఎ్‌సఎల్‌) నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇది నేర పరిశోధనలో కీలకమైన ఆధారాలను గుర్తించడంలో సహాయపడే ప్రత్యేకమైన ల్యాబ్‌గా, రాష్ట్రంలో ఎనిమిదో ఈవిధమైన ల్యాబ్‌ అవుతుంది

Central Forensic Science Lab: సిద్ధమవుతున్న సీఎఫ్‌ఎస్‌ఎల్‌

  • అమరావతిలో ప్రతిష్ఠాత్మక ల్యాబ్‌ ఏర్పాటు

  • రూ.400 కోట్లతో అధునాతన ప్రయోగశాల

  • ఐదెకరాల్లో ఐదు బ్లాకులు.. అందులో రెండు రెడీ

  • వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి

  • దేశంలో ఇలాంటివి 7 కేంద్రాలు.. ఇప్పుడు ఎనిమిదోది

  • సీఎం చంద్రబాబు కృషితో ఏపీకి అధునాతన ల్యాబ్‌

(ఆంధ్రజ్యోతి - మంగళగిరి)

రాజధాని అమరావతితో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతోపాటు నార్కొటిక్‌, సైబర్‌ వంటి నేర పరిశోధనల్లో ఆధారాలను గుర్తించడంలో కీలకమైన సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (సీఎ్‌ఫఎ్‌సఎల్‌) ఇక్కడ ఏర్పాటవుతోంది. తుళ్లూరు సమీపంలోని ఎన్‌-14 రోడ్డు వెంబడి ఐదెకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి అమరావతిలో ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయ భవనం తర్వాత అంత వేగంగా నిర్మితమవుతున్న రెండో భవన సముదాయం ఇదే.! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు రూ.400 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నాయి. ఇలాంటి అధునాతన ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా ఏడు మాత్రమే ఉన్నాయి. చండీగఢ్‌, ఢిల్లీ, భోపాల్‌, పుణె, కోల్‌కతా, గువాహటి, హైదరాబాద్‌ నగరాల్లోనే ఇవి ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ఇప్పుడు ఎనిమిదో ల్యాబ్‌ అమరావతిలో ఏర్పాటు కానుండడం విశేషం.


నేర పరిశోధనల్లో కీలకం

ఇటీవలికాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగింది. నేరస్తులు కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చట్టం చేతికి చిక్కకుండా సులువుగా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో అసలైన నేరస్థులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయడం పోలీస్‌ శాఖకు సవాలుగా మారింది. అయితే సాంకేతిక ఆధారాల సాయంతో ఇలాంటి నేరగాళ్ల భరతం పట్టడానికి దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సీఎ్‌ఫఎ్‌సఎల్‌ను కేటాయించింది. నేర పరిశోధనలో ఈ తరహా సైన్స్‌ ల్యాబ్‌ల నివేదికలు చాలా కీలకంగా మారుతున్నాయి. అవి ఇచ్చే నివేదికల ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించి కోర్టుల్లో నేరాన్ని నిరూపించగలుగుతున్నారు.


అటకెక్కించిన వైసీపీ ప్రభుత్వం

హైదరాబాద్‌లోని ఈ సీఎ్‌ఫఎ్‌సఎల్‌ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఏపీలో నేరాలకు సంబంధించిన కేసుల నిగ్గు తేల్చేందుకు ఆధారాల విశ్లేషణ నిమిత్తం హైదరాబాద్‌ ల్యాబ్‌కు విధిగా పంపాల్సివస్తోంది. దీనివలన చాలా సమయం వృథా అవుతోంది. ల్యాబ్‌ రిపోర్టులు త్వరగా వస్తే కేసులు త్వరితగతిన పరిష్కరించే వీలుంటుంది. అందుకే రాష్ట్రానికి ఈ అధునాతన ల్యాబ్‌ చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించి 2017లోనే రాష్ట్రానికి దీన్ని సాధించారు. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.253.40 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2017 డిసెంబరు 28న శంకుస్థాపన చేసి ఆ తర్వాత పనులు ప్రారంభించారు కూడా. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కూడా అటకెక్కించింది. 2024లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి ఆరు నెలల క్రితమే నిర్మాణ పనులు ఆరంభించింది. అయితే నిర్మాణ వ్యయం మాత్రం పెరిగి రూ.400 కోట్లకు చేరిందని అంటున్నారు.


ఐదెకరాల్లో.. ఐదు భవనాలు..

ఐదెకరాల విస్తీర్ణంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఫిజిక్స్‌ ల్యాబ్‌, కెమిస్ట్రీ ల్యాబ్‌, బయాలజీ ల్యాబ్‌, బాలిస్టిక్స్‌ ల్యాబ్‌, పరిపాలనా భవనం అని... మొత్తం ఐదు భవనాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతానికి మూడు భవనాలను ప్రారంభించి.. వాటిలో రెండింటిని దాదాపు 95 శాతం పూర్తిచేశారు. ఈ 95 శాతం పనులన్నీ గత ఆరు నెలల్లోనే పూర్తవడం విశేషం. ఫిజిక్స్‌ బ్లాకు భవనం (జీ+5)తోపాటు బాలిస్టిక్స్‌ భవనా (జీ+3)లను పూర్తిచేశారు. ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ ల్యాబ్‌ ఉండే బ్లాకు నిర్మాణాన్ని ఇటీవలే ప్రారంభించారు. మిగతా రెండు బ్లాకుల నిర్మాణాలను కూడా త్వరలోనే ఆరంభించి వచ్చే ఏడాది జూన్‌ కల్లా సిద్ధం చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే పూర్తయిన ఫిజిక్స్‌, బాలిస్టిక్స్‌ బ్లాకుల్లో అవసరమైన మిషనరీని ఏర్పాటు చేసుకుని ల్యాబ్‌ను ప్రారంభించాలన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ భవన సముదాయం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తున్నారు.ఈ ల్యాబ్‌లో డీఎన్‌ఏ పరీక్షలతోపాటు నార్కోటిక్స్‌, సైబర్‌, బయోమెట్రిక్స్‌, బాలిస్టిక్స్‌కు సంబంధించిన పరీక్షలతోపాటు ఫోరెన్సిక్‌ ఎకౌంటింగ్‌కు సంబంధించిన ఎక్స్‌లెన్స్‌ విభాగాలు, ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ విభాగాలను ఏర్పాటుచేస్తారు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే వివిధ కేసుల్లో పోలీసులు సేకరించిన రక్త నమూనాలు, వేలిముద్రలు, మాదకద్రవ్యాలు, తుపాకీలు లేదా ఇతర పేలుళ్ల సందర్భాలలో సేకరించిన పదార్థాలను ఈ ల్యాబ్‌లో పరీక్షించి విశ్లేషిస్తారు. అంతేకాకుండా ఈ ల్యాబ్‌ ప్రస్తుత నేర దృశ్యాల నుంచి లభ్యమైన ఆధారాలను గతంలో జరిగిన నేరాల తాలూకు నమూనాలతో సరిపోల్చగల డేటాబే్‌సను కూడా యాక్సిస్‌ చేస్తుంది.


ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు కోసం చంద్రబాబు కృషి

ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కొత్త ఫోరెన్సిక్‌ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. దీనిని ఏపీ రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ వర్సిటీని రాష్ట్రానికి సాధించి తీసుకువచ్చే నిమిత్తమే ప్రస్తుతం అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఈ ల్యాబ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించేందుకు ఆయన సంబంధిత అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నట్టు తెలిసింది. అమరావతిలో ఈ ల్యాబ్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాక ప్రస్తుతం ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఆవరణలో ఉన్న రాష్ట్రస్థాయి ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ను దీనిలోకి తరలిస్తారు. ఆ తర్వాత డీజీపీ కార్యాలయ ఆవరణలోని పాత ల్యాబ్‌ భవనాన్ని రీజనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌గా వినియోగించుకుంటారు.

Updated Date - Mar 28 , 2025 | 03:52 AM