Water Commission : శ్రీశైలం ప్లంజ్‌పూల్ వద్ద ఆ గొయ్యిని తక్షణమే పూడ్చండి
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:08 AM
శ్రీశైలం జలాశయంలో ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకే పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తంచేసింది.

‘శ్రీశైలం’ గొయ్యిని తక్షణమే పూడ్చండి
అది డ్యామ్‌కే డేంజర్
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం ఆదేశం
మరమ్మతులకు ఇంత జాప్యమెందుకు?
శ్రీశైలం, గుండ్లకమ్మ, రైవాడ, కాటన్ బ్యారేజీల్లో పనులకు రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు రెడీ
రూ.480 కోట్ల స్కీముల్లో కొనసాగుతారా.. లేదా? ఏపీని నిలదీసిన జలసంఘం
వడ్డీ అధికంగా ఉందనడంపై అసహనం
వానాకాలం వచ్చేలోపు పనులు చేయాలని నిర్దేశం
నేటి నుంచే రంగంలోకి జలవనరుల శాఖ
8సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు రూ.7 కోట్లు ఇవ్వడానికి రెడీ
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి డ్యాం భద్రతకే పెను ప్రమాదంగా మారిందని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తంచేసింది. దీనికి మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జల సంఘం నిలదీసింది. రూ.480 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో శ్రీశైలం ప్లంజ్‌పూల్‌తో పాటు గుండ్లకమ్మ, రైవాడ, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ (ధవళేశ్వరం) ప్రాజెక్టుల మరమ్మతు పనులపై కదలిక లేకపోవడంతో.. గురువారం ఆంధ్ర, తెలంగాణ అధికారులతో జల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రం ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ కబీర్ బాషా, రాష్ట్ర ప్రాజెక్టుల భధ్రతాధికారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2009 అక్టోబరులో సంభవించిన భారీ వరదలకు.. శ్రీశైలం క్రస్ట్‌గేట్లు ఎత్తినప్పుడు దిగువకు నీరు జాలువారే ప్లంజ్‌పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఇది 120 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవున ఉన్నట్లు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ), సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్‌సఎంఆర్‌ఎస్) నిపుణులు, ఇంజనీర్లు గతంలోనే అంచనా వేశారు. దీని కారణంగా డ్యాంకు ముప్పువాటిల్లే ప్రమాదం నెలకొన్నందున తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కూడా సూచించారు. ఈ పనులతో పాటు గుండ్లకమ్మ, రైవాడ, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ (ధవళేశ్వరం) ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.480 కోట్ల అర్థిక సాయం అందించేందుకు ప్రపంచబ్యాంకు ఇదివరకే ముందుకొచ్చింది.
ప్లంజ్‌పూల్ వద్ద పనులకు రూ.14 కోట్లు, గుండ్లకమ్మ గేట్ల మార్పిడికి రూ.125 కోట్లు, మిగతా మొత్తం రైవాడ, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు ఖర్చవుతుందని అంచనా వేశారు. రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినా పనుల్లో జాప్యంపై జలసంఘం తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. పై నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి ప్రపంచబ్యాంకు రుణ స్కీంలలో కొనసాగుతారో లేదో తేల్చిచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ పథకాల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి వడ్డీ భారం అధికంగా ఉందంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ వేస్తున్న కొర్రీలపై అసహనం వ్యక్తం చేసింది. వానాకాలం వచ్చేలోపు పనులు పూర్తిచేయడానికి వీలుగా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది. ఈ పనులను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పుణే)ద్వారా వెంటనే మొదలుపెట్టాలని సూచించింది. దరిమిలా శుక్రవారం నుంచే జలవనరుల శాఖ రంగంలోకి దిగనుంది. గొయ్యి పూడ్చివేతకు వినియోగించిన టెక్నాలజీపై మేధోమధనం చేపట్టనుంది. సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు రూ.7 కోట్లు అడ్వాన్సుగా చెల్లించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖతోనూ సంప్రదింపులు జరుపనుంది.
ప్లంజ్‌పూల్ సమస్య ఎప్పటిదంటే..!
శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్ వద్ద గొయ్యి సమస్య 1985లో మొదలైంది. అప్పట్లో భారీ వరదకు ప్రాజెక్టు స్పిల్‌వే గుండా ఉధృతంగా వరద ప్రవహించడంతో ప్లంజ్‌పూల్ ప్రాంతంలోని రాతినేల దెబ్బతింది. అక్కడ భారీగా గుంతపడింది. దీనిపై కేంద్ర జల సంఘం సమీక్షించి.. మరమ్మతు చేపట్టింది. మళ్లీ 2000లో ఇదే సమస్య పునరావృతమైంది. అప్పుడు కూడా సిమెంట్ కాంక్రీట్ వేశారు. మళ్లీ 2009లో భారీ స్థాయిలో వరదలు రావడంతో అక్కడ 120 మీటర్ల లోతున భారీ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి వెడల్పు 270 మీటర్లు కాగా.. పొడవు 400 మీటర్లు ఉంది. దీనివల్ల ప్రధాన డ్యాంకే ముప్పు ఏర్పడుతుందని.. మరమ్మతులు చేయాలంటూ పొరుగు రాష్ట్రం తరచూ కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జల సంఘం మరమ్మతులకు ఆదేశాలివ్వడంతో శుక్రవారం నుంచే పనులు చేపట్టేందుకు ఏపీ జలవనరుల శాఖ సమాయత్తమైంది.