Share News

TDP Minority Welfare: వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:51 AM

ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయన విజయవాడలోని ఇఫ్తార్ విందులో పాల్గొని, ముస్లిం మతపెద్దలతో మత సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు వివిధ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు

 TDP Minority Welfare: వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ

  • ముస్లింలకు ఉన్నత స్థితి కల్పిస్తాం

  • బడ్జెట్‌లో 5,300 కోట్లు కేటాయింపు

  • గతేడాది కంటే 1,300 కోట్లు ఎక్కువ

  • సద్గుణాలకు రంజాన్‌ ప్రతీక

  • ఇఫ్తార్‌ విందులో సీఎం చంద్రబాబు

  • ఉగాది రోజున బంగారు కుటుంబం

  • పీ4 కార్యక్రమంలో నిర్వహణ

విజయవాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ముస్లింల సంక్షేమానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఏడాది కంటే రూ.1,300 కోట్లు పెంచామన్నారు. వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ కల్పించి, మత సామరస్యాన్ని కాపాడటంతో పాటు ముస్లింలకు ఉన్నత స్థితి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గురువారం విజయవాడలోని ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ముస్లిం మతపెద్దలు స్వాగతం పలికి, పవిత్ర గ్రంధం ఖురాన్‌ను అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికత్వం... ఈ సద్గుణాలకు రంజాన్‌ ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇది ఎంతో పవిత్రమైన మాసమని, ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. పవిత్రమైన ఆచారంతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఆయన అభినందనలు తెలిపారు. ధనవంతులు పేదలకు సహాయం చేయడం ఖురాన్‌ నేర్పిన మంచి గుణమన్నారు. మైనార్టీలతో టీడీపీకి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు టీడీపీ పాలనలోనే న్యాయం జరిగిందన్నారు. ఎన్టీఆర్‌ మొదటిసారిగా మైనారిటీ ఫైనాన్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తే, తాను ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూను రెండో భాషగా అమలు చేశానని చెప్పారు.


మక్కా యాత్రకు వెళ్లే వారికి హైదరాబాద్‌లో హజ్‌ భవనం నిర్మించామన్నారు. కడపలో హజ్‌ భవనం నిర్మాణానికి శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో విభజన తర్వాత కర్నూలులో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేయించామన్నారు. ఇమామ్‌లకు గౌరవవేతనం మొదటిసారిగా టీడీపీ అమలు చేసిందన్నారు. మౌజాన్‌లకు రూ.5 వేలు, ఇమామ్‌లకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ఇమామ్‌లను ఖాజీలుగా నియమిస్తుమన్నారు. జకాత్‌ పేరుతో పేదలకు సహాయం చేసే గుణం ముస్లింలకు ఉందని కొనియాడారు.


For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 02:51 AM