Unstable Weather : వాతావరణ అనిశ్చితితో వర్షాలు
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:48 AM
ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించి ఉన్నాయి.

విశాఖపట్నం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించి ఉన్నాయి. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వస్తున్నాయి. ఇవి వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో కలవడం వల్ల వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో శనివారం సాయంత్రం కోస్తాలో అక్కడక్కడ, రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, శనివారం రాష్ట్రంలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.