వాహనం ఢీకొని చిరుత మృతి
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:44 AM
వి.కోట - పేర్నాంబట్ ప్రధాన రహదారిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పిల్ల మృతి చెందింది.
కళేబరం మాయంపై అటవీ అధికారుల విచారణ
వి.కోట, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): వి.కోట - పేర్నాంబట్ ప్రధాన రహదారిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పిల్ల మృతి చెందింది. మంగళవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో ఈ చిరుత రోడ్డుపై రక్తపుమడుగులో పడి ఉండగా వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఆలస్యంగా స్పందించిన అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు చిరుత కళేబరం మాయమైంది.ఈ ప్రాంతంలో చిరుతల సంచారం లేదని అటవీశాఖ అధికారులు అంటుండగా, ఇటీవల తమ మేకలను, గొర్రెపిల్లలను చిరుతలు తినేస్తున్న ఘటనలు చాలా జరిగాయని అటవీ సమీప గ్రామస్తులంటున్నారు.అసలక్కడ మృతి చెందింది చిరుత కాదని, బావురు పిల్లి అయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.మంగళవారం మధ్యాహ్నం జోడు చింతమానుల వద్దకు చేరకున్న చిత్తూరు సబ్ బీఎ్‌ఫవో వేణుగోపాల్, పలమనేరు రేంజర్ నారాయణ, డీఆర్‌వో వేణుగోపాల్‌రెడ్డి రోడ్డుపై రక్తపు నమూనాలను ఎఫ్‌ఎ్‌సఎల్‌కు పంపారు. నివేదిక రాగానే మృతి చెందిన జంతువు ఏదో నిర్థారిస్తామన్నారు.అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.