Share News

కుప్పంలో అభివృద్ధి వెలుగులు

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:21 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన దాదాపు ఖరారైంది. టీడీపీ, ప్రభుత్వ వర్గాలనుంచి సేకరించిన సమాచారం మేరకు సీఎం ఈనెల 5వ తేదీ సాయంత్రం కుప్పం చేరుకుని, 7వ తేదీ మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు.

 కుప్పంలో అభివృద్ధి వెలుగులు
శీగలపల్లె ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కలెక్టర్‌, ఎస్పీ, కడా పీడీ తదితరులు

సీఎం పర్యటనలో పలు ప్రాంభోత్సవాలు

పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

కుప్పం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన దాదాపు ఖరారైంది. టీడీపీ, ప్రభుత్వ వర్గాలనుంచి సేకరించిన సమాచారం మేరకు సీఎం ఈనెల 5వ తేదీ సాయంత్రం కుప్పం చేరుకుని, 7వ తేదీ మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ మణికంఠ బుధవారం కుప్పంలో పర్యటించారు. కడా పీడీ వికాస్‌ మర్మత్‌తో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించి, అధికార వర్గాలకు తగు సూచనలు చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో పూర్తయిన నూతన భవనాలను, కుప్పం మండలం శీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. నడిమూరులో సోలరైజేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి రెస్కో ఎండీ సోమశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ కానున్న ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడామైదానాన్ని పరిశీలించారు.

రెండు పరిశ్రమలకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో రెండు భారీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయడం ద్వారా కుప్పం అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో మొదటిది మదర్‌ డెయిరీ తరఫున సఫల్‌ పేరిట ఏర్పాటు కాబోయే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌. శాంతిపురం మండలం తమ్మిగానిపల్లె ప్రాంతంలో ఈ యూనిట్‌కోసం ఇప్పటికే 40 ఎకరాలు కేటాయించారు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గ పరిధిలో టమోటా పండించే రైతులు అఽధికం. నిరంతరం ధరల హెచ్చుతగ్గులతో సతమతమవుతూ నష్టాలపాలై, అప్పులతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ సఫల్‌ ఒక వరం లాంటిది. సఫల్‌ యూనిట్‌ ద్వారా రైతులకు మేలురకమైన టమోటా సీడ్‌ అందిస్తారు. దిగుబడి వచ్చాక మొత్తం పంటను యూనిట్‌ ద్వారానే రైతులనుంచి కొనుగోలు చేస్తారు. ధర అట్టడుగుకు పతనమైనా సరే, రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తారు. ఒకవేళ మార్కెట్టులో ధర ఎక్కువగా ఉంటే రైతులు అక్కడే అమ్ముకోవచ్చు. పంటను తమకే అమ్మాలన్న నిర్బంధమేదీ ఉండదు. ఇక శ్రీజ డెయిరీ మదర్‌ ప్లాంట్‌ ఇదే తమ్మిగానిపల్లె వద్ద మరో 40 ఎకరాలలో ఏర్పాటు కానుంది. ఇప్పటికే స్థల కేటాయింపు కూడా జరిగిపోయింది. శ్రీజ డెయిరీ ద్వారా ఇప్పటికే పాడి రైతులు నియోజకవర్గ పరిధిలో సుమారు 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయిస్తూ, కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు శంకుస్థాపన చేయబోయే శ్రీజ డెయిరీ ద్వారా అదనంగా మరో 4 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ డెయిరీ ద్వారా పాడి రైతుల వద్ద ఉన్న ఆవులకు ఆర్టిఫిషియల్‌ సెమన్‌ ఇంజక్షన్‌ ఇస్తారు. ఈ అత్యాధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా తయారైన ఈ ఇంజక్షన్‌ ద్వారా సుమారు 96 శాతం పెయ్యదూడలే పుట్టుకొస్తాయి. తద్వారా సుమారు ఒకటిన్నర లేదా రెండేళ్లలో పాడి ఉత్పత్తి ఇంతకు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు పరిశ్రమల వల్ల అటు రైతుకు ఆదాయంతోపాటు ఇటు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగైదు వేల ఉద్యోగాలు స్థానికులకు లభించనున్నాయి.

నడిమూరులో సోలరైజేషన్‌కు ప్రారంభోత్సవం

కుప్పం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో సోలరైజేషన్‌ చేయాలన్నది ముఖ్యమంత్రి సంకల్పం. నియోజకవర్గ పరిధిలో రెస్కో సర్వే ద్వారా గుర్తించిన 53,314 గృహాలకు రూఫ్‌టాప్‌ ఉన్నట్లు ఇప్పటికే లెక్కలు కట్టారు. ఈ గృహాలన్నింటికీ కలిపి 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడానికి వీలుపడుతుంది. తద్వారా 100 శాతం గృహాలకు సోలార్‌ విద్యుత్తు ఇవ్వాలన్నది లక్ష్యం. ఇందుకోసం మోడల్‌గా కుప్పం మండలంలోని నడిమూరును ఎంచుకున్నారు. సోలరైజేషన్‌ ప్రాజెక్ట్‌ను నడిమూరులో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

రూ.100 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి

కుప్పం నియోజకవర్గానికి గుండెకాయ అనదగిన కుప్పం మున్సిపాలిటీని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. గతంలో రూ.456 కోట్లతో పనులకు అంచనాలు తయారు చేశారు కానీ అది మధ్యలో ఆగిపోయింది. నిధులను ఇప్పుడు రూ.100 కోట్లకు కుదించారు. ముఖ్యమంత్రి పర్యటన లోపల, ఆ నిధులకు సరిపడా అభివృద్ధి పనులు ఎంపికచేసి జీవో విడుదల చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

మహిళల్లోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అసోసియేషన్‌ ఆప్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (అలిప్‌) అనే ఎన్జీవోను కుప్పం తీసుకొస్తున్నారు. ఈ ఎన్జీవో కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై మహిళలకు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. పలార్లపల్లెలో ప్రస్తుతానికి దీనికోసం కేటాయించిన 5 ఎకరాలలో మహిళా శక్తి భవన్‌ ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమపై మహిళలకు ఆసక్తి ఉందో, మార్కెటింగ్‌కు అవకాశం ఉందో సర్వేచేసి, సంబంధిత మిషనరీ ఈ మహిళా శక్తి భవన్‌లో అమరుస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలు పెట్టుబడి లేకుండా ఈ మిషనరీ ఉపయోగించి, కేవలం ముడి సరకులు మాత్రం ఉపయోగించి ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ అలిప్‌ ప్రాజెక్టుకు కూడా సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. వీటితోపాటు ఇంకా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడానికి ఽఅధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

Updated Date - Jan 02 , 2025 | 01:21 AM