Share News

వైవిధ్య ఆలోచనలు.. వినూత్న ఆవిష్కరణలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:57 AM

కొత్త కొత్త ఆలోచనలతో.. వినూత్న ఆవిష్కరణలకు విద్యార్థులు తెరతీశారు. శ్రీకాళహస్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా సైన్స్‌ఫేర్‌లో తమ వైజ్ఞానిక ప్రదర్శనలను ఉంచారు. ఇందులో కొన్ని ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విద్యార్థి, వ్యక్తిగత, సామూహిక, ఉపాధ్యాయ విభాగాల్లో జిల్లాస్థాయి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు కలెక్టరు వెంకటేశ్వర్‌ జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ నమూనాల్లో కొన్ని..

వైవిధ్య ఆలోచనలు..   వినూత్న ఆవిష్కరణలు

శ్రీకాళహస్తిలో జిల్లా సైన్స్‌ ఫేర్‌

శ్రీకాళహస్తి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): కొత్త కొత్త ఆలోచనలతో.. వినూత్న ఆవిష్కరణలకు విద్యార్థులు తెరతీశారు. శ్రీకాళహస్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా సైన్స్‌ఫేర్‌లో తమ వైజ్ఞానిక ప్రదర్శనలను ఉంచారు. ఇందులో కొన్ని ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విద్యార్థి, వ్యక్తిగత, సామూహిక, ఉపాధ్యాయ విభాగాల్లో జిల్లాస్థాయి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు కలెక్టరు వెంకటేశ్వర్‌ జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ నమూనాల్లో కొన్ని..

మద్యం తాగితే వాహనం కదలదంతే

డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదాలను అరికట్టేందుకు శ్రీకాళహస్తిలోని బాబుఅగ్రహారం పాఠశాలకు చెందిన చరణ్‌ ‘ఆటోమేటిక్‌ ఇంజన్‌ లాకింగ్‌ సిస్టమ్‌’ ప్రయోగాన్ని రూపొందించారు. డ్రైవర్‌ మద్యం తాగి వాహనాన్ని నడిపే ప్రయత్నం చేస్తే సెన్సర్‌ ఆల్కాహాల్‌ వాసనను పసిగట్టి ఆటోమేటిక్‌గా వాహనం ఆగిపోయేలా తయారు చేశారు. ఉపాఽధ్యాయురాలులు వరలక్ష్మి పర్యవేక్షణలో చరణ్‌ చేపట్టిన ఈ ప్రయోగం విద్యార్థుల వ్యక్తిగత విభాగంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది.

వర్షపునీటితోనే తోట సాగు

భవనంపై కురిసే వాన చినుకులను పైపులు, సెన్సర్ల ద్వారా ఇంటి ఆవరణలోని పూలు, పండ్ల మొక్కలను సాగు చేసే విధానాన్ని ఆవిష్కరించారు రాజశేఖర్‌. పాకాల మండం ఓబులశెట్టివారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇతడు ఉపాధ్యాయుడు వెంకటరమణ పర్యవేక్షణలో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ప్రయోగాన్ని ప్రదర్శించి ద్వితీయ స్థానంలో నిలిచాడు.

అంధుల డిక్సూచి

అంధుల కోసం స్మార్ట్‌ బ్లైండ్‌ వాకింగ్‌ స్టిక్‌ను వరదయ్యపాళెం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మేఘనాథ్‌ పర్యవేక్షణలో రితీష్‌, వరుణ్‌రెడ్డి ఆవిష్కరించారు. 9 ఓల్ట్స్‌ బ్యాటరీతో అలా్ట్ర వయలెంట్‌ సిగ్నల్‌ సెన్సర్‌తో ఈ వాకింగ్‌ స్టిక్‌ ఆటోమేటిక్‌గా సూచనలు చేసి ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. ఇది గ్రూపు విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది.

ఎక్స్‌కవేటర్‌ మోడల్‌ నమూనా

సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గజేంద్ర సలహాతో తక్కువ ఖర్చుతో పాస్కల్‌ సూత్రం ఆధారంగా జేసీబీ నమూనా యంత్రాన్ని గణేష్‌, జశ్వంత్‌కుమార్‌రావు ఆవిష్కరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయొచ్చు. ఈ ప్రయోగం ద్వితీయ స్థానంలో ఎంపికైంది.

దివ్యాంగులకు ప్రత్యేక వాహనం

లిఫ్టు తరహాలో దివ్యాంగులు సులభంగా బస్సు ఎక్కడం.. కావాల్సిన చోట దిగబెట్టడం వంటి ఆవిష్కరణను శ్రీకాళహస్తిలోని ఆర్‌పీబీఎస్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు ప్రదర్శించారు. ఉపాధ్యాయుల వ్యక్తిగత విభాగంలో ప్రథమస్థానం సాధించారు.

మలుపుల వద్ద ప్రమాదాలకు చెక్‌

రోలింగ్‌ బ్యారియర్స్‌ అనే సిద్ధాంతంతో.. మలుపులకు చెక్‌పెట్టేలా వరదయ్యపాళెం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన టీచరు సుబ్బరామయ్య కొత్త ప్రయోగాన్ని ముందుకు తెచ్చారు. మలుపుల వద్ద వాహనాలు ఢీకొన్న వెంటనే రబ్బర్‌బాల్స్‌ వంటి వాటిని తాకడం వల్ల అవి తిరగడంతో శక్తి వికేంద్రీకరణ జరిగి వాహనాలు దెబ్బతినకుండా కట్టడి చేస్తుంది. దాంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడవచ్చు. ఉపాధ్యాయుల వ్యక్తిగత విభాగంలో ఈ ప్రదర్శన ద్వితీయ స్థానం సాధించింది.

Updated Date - Jan 04 , 2025 | 01:57 AM