తప్ప తాగి దాడిచేసిన ఇద్దరు తహసీల్దార్ల సస్పెన్షన్
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:39 AM
తప్పతాగి బండబూతులు తిడుతూ వీధిరౌడీల్లా ప్రవర్తించిన ఇద్దరు ఇన్‌చార్జి తహసీల్దార్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ, విచారణ పూర్తయ్యేంతవరకు హెడ్‌క్వార్టర్స్ వీడరాదని ఆదేశించారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): తప్పతాగి బండబూతులు తిడుతూ వీధిరౌడీల్లా ప్రవర్తించిన ఇద్దరు ఇన్‌చార్జి తహసీల్దార్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ, విచారణ పూర్తయ్యేంతవరకు హెడ్‌క్వార్టర్స్ వీడరాదని ఆదేశించారు.గంగవరం ఇన్‌చార్జి తహసీల్దార్ జి.ఎల్. శివకుమార్, పెద్దపంజాణి ఇన్‌చార్జి తహసీల్దార్ ఎం.ఎస్. ప్రసన్నకుమార్ చిత్తూరు నగరంలోని ప్రభా గ్రాండ్ హోటల్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై సోమవారం రాత్రి మద్యం మత్తులో కృష్ణకుమార్ అనే నగరవాసిపై దాడిచేసి గాయపరచడంపై వార్తా పత్రికల్లో ప్రచురితం కావడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. వారిద్దరిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని నిర్ణయించిన కలెక్టర్ ఏపీ సీసీఎల్‌ఏ రూల్స్ 1991 రూల్ 8(1)(ఏ) మేర సోమవారం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అనుమతి లేకుండా వారు పనిచేస్తున్న మండల కేంద్రాలను వీడరాదని సూచించారు.బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఇన్‌చార్జి తహసీల్దార్లు శివకుమార్, ప్రసన్నకుమార్ మంగళవారం మధ్యాహ్నం నుంచీ రాత్రివరకు కలెక్టరేట్‌లోనే వున్నారు.