Share News

మళ్లీ కొండెక్కుతున్న ‘పుష్ప’లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:38 AM

గత కొనేళ్లపాటు తిరుమలకు దూరంగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు తిరిగి కొండపై కన్నేశారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఉన్నా తిరిగి తిరుమలకు సమీపంలో శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచుకోవడం మొదలుపెట్టారు. తిరుమల శేషచల అడవుల్లో విలువైన ఎర్రచందనం సంపద ఉన్న విషయం తెలిసిందే. ఐదారేళ్ల కిందటి వరకు తిరుమలకు సమీపంలో పార్వేటమండపం, పాపవినాశనం, శ్రీవారిపాదాలు, శ్రీవారిమెట్టు, శిలాతోరణం, కుమారధార, పసుపుధార వంటి ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా జరిగేది. వందల టన్నుల కొద్దీ ఎర్రచందనం దుంగలను వాహనాల ద్వారా తిరుమల ఘాట్‌ నుంచే తరలించేవారు. నిఘాను పటిష్టం చేయడంతో తిరుమల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్‌పడింది. కొన్నేళ్లపాటు స్మగ్లర్లు తిరుమల కొండను వదిలిపెట్టి మిగిలిన ప్రాంతాలపై పడ్డారు. తాజాగా మళ్లీ తిరుమల కొండెక్కడం మొదలుపెట్టారు.

మళ్లీ కొండెక్కుతున్న ‘పుష్ప’లు
పట్టుబడిన ఎర్రచందనం దుంగలు, కారుతో ఫారెస్ట్‌ అధికారులు

3టీటీడీ14-

తిరుమల, జనవరి3(ఆంధ్రజ్యోతి): గత కొనేళ్లపాటు తిరుమలకు దూరంగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు తిరిగి కొండపై కన్నేశారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఉన్నా తిరిగి తిరుమలకు సమీపంలో శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచుకోవడం మొదలుపెట్టారు. తిరుమల శేషచల అడవుల్లో విలువైన ఎర్రచందనం సంపద ఉన్న విషయం తెలిసిందే. ఐదారేళ్ల కిందటి వరకు తిరుమలకు సమీపంలో పార్వేటమండపం, పాపవినాశనం, శ్రీవారిపాదాలు, శ్రీవారిమెట్టు, శిలాతోరణం, కుమారధార, పసుపుధార వంటి ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా జరిగేది. వందల టన్నుల కొద్దీ ఎర్రచందనం దుంగలను వాహనాల ద్వారా తిరుమల ఘాట్‌ నుంచే తరలించేవారు. నిఘాను పటిష్టం చేయడంతో తిరుమల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్‌పడింది. కొన్నేళ్లపాటు స్మగ్లర్లు తిరుమల కొండను వదిలిపెట్టి మిగిలిన ప్రాంతాలపై పడ్డారు. తాజాగా మళ్లీ తిరుమల కొండెక్కడం మొదలుపెట్టారు. భక్తుల ముసుగులో ఇతర రాష్ట్రాల వాహనాలతో తిరుమలకు చేరుకుని సమీపంలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లను కూలదోస్తున్నారు. దుంగలను వాహనాల్లో ఎక్కించి నెమ్మదిగా తిరుమల నుంచి జారుకుంటున్నారు. ముందస్తు సమాచారంతో ఫారెస్ట్‌ విభాగం అధికారులు ఇటీవల తిరుమల పరిసర ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెట్టడంతో డిసెంబరు 19వ తేదీన కుమారధార, పసుపుధార ప్రాంతంలో దాదాపు 150 కేజీల బరువున్న ఐదు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని సేలంకు చెందిన సతీష్‌, వెంకటేషన్‌, త్యాగరాజన్‌ను అరెస్ట్‌ చేశారు. తాజాగా, గురువారం సాయంత్రం ముందస్తు సమాచారంతో శిలాతోరణం చెక్‌పోస్ట్‌ వద్ద కర్ణాటక రిజిస్ర్టేషన్‌తో ఉన్న ఓ కారును అడ్డుకున్నారు. కారు నుంచి దిగి పారిపోయే ప్రయత్నం చేసిన తమిళనాడు విల్లుపురంకు చెందిన రమేష్‌ గోవిందరాజ్‌ అనే డ్రైవర్‌ను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్‌ చేశారు. కారుతో పాటు కారులోని దాదాపు 536 కేజీల బరువు కలిగిన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద లభించిన సెల్‌ఫోన్‌లోని నెంబర్ల ద్వారా మిగిలిన స్మగర్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రమేష్‌ ఇచ్చిన నెంబర్లన్నీ స్విచ్‌ఆ్‌ఫలో ఉండటంతో తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా తిరుమలకు దూరంగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు తిరిగి స్వామి క్షేత్రానికి వచ్చే సాహసం చేస్తున్నారు. అయితే శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం తరలించాలని చూస్తే ఉపేక్షించేది లేదని, ఇప్పటికే అన్ని ప్రాంతాలను జల్లెడపడుతున్నామని ఫారెస్ట్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:38 AM