ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:41 AM
ఒక్కో హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు శనివారం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో 5,759 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు చాలా ఏళ్లనుంచి మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. అయితే జూనియర్ కళాశాలల్లోనూ పేద, సామాన్య విద్యార్థులు ఎక్కువగా ఉండటం.. సుదూర గ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో ఉదయాన్నే భోజనం తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేవారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు
జిల్లాలో 5,759 మందికి ప్రయోజనం
తిరుపతి(విద్య), జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఒక్కో హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు శనివారం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో జిల్లాలో 5,759 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు చాలా ఏళ్లనుంచి మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. అయితే జూనియర్ కళాశాలల్లోనూ పేద, సామాన్య విద్యార్థులు ఎక్కువగా ఉండటం.. సుదూర గ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో ఉదయాన్నే భోజనం తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేవారు. దీనిని గమనించిన గతంలోని టీడీపీ ప్రభుత్వం 2014- 2019 మధ్య కాలంలో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని నిలిపేసింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడటంతో పాటు కొంత హాజరుశాతంకూడా తగ్గింది. ఇంటర్ విద్యార్థుల ఇబ్బందులను, వారి తల్లిదండ్రుల అభ్యర్థనను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తామని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో శనివారం నుంచి ప్రారంభిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పళ్లాలు, గ్లాసులను ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసింది. వంట బాధ్యతలను కళాశాలలకు సమీపంలోని ఉన్నత పాఠశాల భోజన పథకం నిర్వాహకులు లేదా స్వయం సహాయక బృందాలకు అప్పగించారు.
ఇదీ మెనూ
సోమవారం: అన్నం, కూరగాయల కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ
మంగళవారం: పులగం లేదా పులిహోర, పల్లీచట్ని, కోడిగుడ్డు ఫ్రై, రాగిజావ
బుధవారం: అన్నం, సాంబారు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
గురువారం: కూరగాయల అన్నం (వెజిటబుల్ రైస్), గుడ్డుకూర, రాగిజావ
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
శనివారం: అన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ
విద్యార్థులకు ఎంతో మేలు
కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని పునరుద్ధరించి ఇంటర్ విద్యార్థులకు ఎంతో మేలు చేసింది. ఈ పథకం అమలువల్ల డ్రాపౌట్స్ తగ్గుతారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే వారి సంఖ్యా పెరుగుతుంది.
- ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌ఐవో, తిరుపతి జిల్లా