గతం మరిచారా అన్నా!
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:28 AM
విమర్శలు ప్రతివిమర్శలతో చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. గత సమావేశాలతో పోల్చితే మంగళవారం జరిగిన ఈ సమావేశం భిన్నంగా సాగింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేసిన శ్రీకాళహస్తి జడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డిపై వైసీపీ సభ్యులు దాడి చేసినంత పని చేశారు.
జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే ద్వారకపై జగన్, మురళి వ్యంగ్యాస్ర్తాలు
శ్రీకాళహస్తి జడ్పీటీసీపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు
చిత్తూరు రూరల్, డిసెంబరు 31 (ఆంఽధ్రజ్యోతి): విమర్శలు ప్రతివిమర్శలతో చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. గత సమావేశాలతో పోల్చితే మంగళవారం జరిగిన ఈ సమావేశం భిన్నంగా సాగింది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేసిన శ్రీకాళహస్తి జడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డిపై వైసీపీ సభ్యులు దాడి చేసినంత పని చేశారు.దీంతో కాసేపు సభ రసాభాసగా మారింది.
మేం అనుకుంటే మీరు మీటింగుకు వచ్చేవారా
తంబళపల్లె నియోజకవర్గంలో జడ్పీటీసీలను, ఎంపీపీలను, ఎంపీటీసీలను ఏ సమావేశాలకూ హాజరు కానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ ‘రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన మా నాయకుడు చంద్రబాబు పైనే రాళ్లు వేసి దారుణంగా అడ్డుకున్నారే, దాంతో పోలిస్తే మీరు చెప్పేది అసలు విషయమే కాదునా’ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. మీ నాయకుడి(జగన్)లా మా నాయకుడు(చంద్రబాబు) చూసీచూడనట్లు వదిలేసి ఉంటే వైసీపీ సభ్యులు సమావేశానికి వచ్చేవారా? గొడవకు దిగేవారా అని నవ్వుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘మా నాయకుడు క్రమశిక్షణకు మారుపేరు కాబట్టే ఈ సమావేశం అధికార, ప్రతిపక్ష సభ్యులతో జరుగుతోంది. లేదంటే వేరే మాదిరిగా ఉండేది’అని వైసీపీ సభ్యులకు ఘాటుగా సమాధానం చెప్పారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మీకేది?
తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరు మాట్లాడినా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి విమర్శించారు. దీనిపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పందిస్తూ.. ‘వైసీపీ హయాంలో రైతు నుంచి కూలీ వరకు ఎవర్నీ వదలకుండా సుమారు 600మందికి పైగా కేసులు పెట్టి ఊర్లోకి వచ్చేదానికే భయపడేలా చేశారే! అప్పుడు ఎందుకు ఇవి మాట్లాడలేదనా’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.‘ బలవంతపు ఏకగ్రీవాలతో దౌర్జన్యంగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. అధికారులు..మర్యాద ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులు చేసేముందు సంప్రదించడం లేదని సభ్యులు ఆరోపించగా.. ఎమ్మెల్యే కలగజేసుకొని మీరు రెజల్యూషన్ ఇచ్చేవరకు అభివృద్ధి పనులు ఆగవని సమాధానం చెప్పారు.
నచ్చకే వైసీపీ నుంచి వచ్చేశాం
జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఈ ప్రభుత్వంలో గౌరవం ఇవ్వడం లేదని తిరుపతి ఎంపీ గురుమూర్తి సభలో ప్రస్తావిస్తే.. దానిపై శ్రీకాళహస్తి జడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డి స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జడ్పీటీసీలను, ఎంపీపీలను కనీసం గౌరవించలేదని, ఎమ్మెల్యేలే పెత్తనం చేసేవారనడంతో ఒక్కసారిగా వైసీపీ సభ్యులు ఆయనపైకి దూసుకొచ్చి దుర్భాషలాడారు. నువ్వుకూడా వైసీపీ సభ్యుడివే కదా అని వైసీపీ సభ్యులు అనగా... అది నచ్చకే ఎన్నికల ముందే బయటకు వచ్చేశామని ఆయన బదులిచ్చారు. దీంతో సభ్యులందరూ ఆయనపైకి దూసుకెళ్లారు. వెంటనే చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు కలగజేసుకొని ‘శ్రీకాళహస్తి జడ్పీటీసీ చెప్పిందాంట్లో తప్పేముంది? సభలో మీ సంఖ్య ఎక్కువగా ఉందని ఆయనపైకి వెళ్లిపోతారా, ఇది పద్ధతి కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెండింగ్‌లో వున్న ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కోరగా వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే బిల్లులు పెండింగులో ఉన్నాయి. అప్పుడు తెలియదా అంటూ శ్రీకాళహస్తి జడ్పీటీసీ మాట్లాడడంతో సభలో నవ్వులు విరిశాయి.
పాఠశాలల బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కోరారు. షూ నుంచి టై దాకా, బుక్స్ నుంచి భోజనం దాకా అన్నీ ఉచితంగా అందిస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంపై కారణాలు ఆన్వేషించాలని డీఈవోకు సూచించారు.
సభలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలన్నింటినీ మినిట్స్‌లో రాసి వాటిని వచ్చే సమావేశంలోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. సభ్యులు చెప్పిన ప్రతి సమస్యనూ ఆయన నోట్ చేసుకుని సమాధానం చెప్పారు.జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు, తిరుపతి డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.