Share News

ముఖ ఆధారిత హాజరుంటేనే సచివాలయ సిబ్బందికి జీతాలు

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:26 AM

కొందరు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఆలస్యంగా విధులకు వస్తూ, త్వరగా వెళ్ళిపోతున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే కొందరిదీ ఇదే పరిస్థితి.

ముఖ ఆధారిత హాజరుంటేనే సచివాలయ సిబ్బందికి జీతాలు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కొందరు సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఆలస్యంగా విధులకు వస్తూ, త్వరగా వెళ్ళిపోతున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే కొందరిదీ ఇదే పరిస్థితి.అదేమని ప్రశ్నిస్తే తాము క్షేత్రస్థాయిలో ఉన్నామని చెబుతున్నారు.వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందేనని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈనెల నుంచి ముఖ ఆధారిత హాజరు ఉంటేనే జీతభత్యాలన్నీ వుంటాయని హెచ్చరించింది. సచివాలయ ఉద్యోగులు తమ సెల్‌ఫోన్‌లో ఉండే యాప్‌లో ఉదయం, సాయంత్రం హాజరు నమోదుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు యాప్‌లో కొన్ని మార్పులు చేసింది. డీసీడబ్ల్యూఎస్‌ హాజరు యాప్‌ వర్షన్‌ 2.2లో ఉదయం 10.30 గంటల్లోపు మాత్రమే హాజరు తీసుకుంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా రోజూ రెండు సార్లు బయోమెట్రిక్‌ లేదా ముఖ ఆధారిత హాజరు వేయాల్సివుంటుంది. అలా అయితేనే ఆ రోజు పూర్తివేతనం అందుతుంది. ఎవరైనా ఉద్యోగి ఉదయం ఒకసారి హాజరు నమోదుచేసి, సాయంత్రం వేయలేకపోతే ... ఆ రోజు క్యాజువల్‌ లీవ్‌ (సీఎల్‌)గా పరిగణిస్తారు. జీతాల బిల్లులు పెట్టేందుకు ముందునెల 23వ తేది నుంచి ప్రస్తుత నెలలో 22వ తేదివరకు ఒక్కనెలగా పరిగణిస్తారు.

ఖజానాశాఖతో అనుసంధానం

వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా బయోమెట్రిక్‌ హాజరీ తప్పనిసరి చేశారు. అది కూడా రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు, మూడుసార్లు బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సివుండడంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల హాజరీ యాప్‌లో మధ్యాహ్న హాజరీని తొలగించింది. అయితే అప్పట్లో హాజరీ మూడుసార్లు వేయకపోయినా పట్టించుకోలేదు. ఇదే అదనుగా ఉద్యోగులు హాజరయ్యేవారు కాదు. దీంతో సచివాలయ ఉద్యోగులు రోజుకు విధిగా రెండుసార్లు సమయపాలన పాటించి హాజరు వేస్తేనే వేతనం వచ్చేలా ప్రభుత్వం ఖజానాకు అనుసంధానం చేసింది.

Updated Date - Jan 02 , 2025 | 01:26 AM