ఆంధ్రా మట్టిపై తమిళ దందా
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:56 AM
మన మట్టి అంటే అందరికీ అలుసుగా మారింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు రాష్ట్రాల్లో రోడ్డు వేయాలంటే మన రాష్ట్రంలోని మట్టిని తీసుకెళుతున్నారు. ప్రధానంగా పొరుగున ఉన్న తమిళనాడులో మట్టి తీసుకునే అవకాశం ఉన్నా విజయపురం మండలం నుంచే తరలించేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- యథేచ్ఛగా రోడ్ల నిర్మాణానికి తరలింపు
- వైసీపీ హయాంలో కొండలన్నీ మాయం
- కూటమి ప్రభుత్వంలోనూ మారని తీరు
విజయపురం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మన మట్టి అంటే అందరికీ అలుసుగా మారింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు రాష్ట్రాల్లో రోడ్డు వేయాలంటే మన రాష్ట్రంలోని మట్టిని తీసుకెళుతున్నారు. ప్రధానంగా పొరుగున ఉన్న తమిళనాడులో మట్టి తీసుకునే అవకాశం ఉన్నా విజయపురం మండలం నుంచే తరలించేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయపురం మండలంలో సుమారు 10 పంచాయతీలకు తమిళనాడు సరిహద్దుగా ఉంది. ఇక్కడినుంచి చైన్నై-తిరుపతి జాతీయ రహదారికి సమీపాన వుండడంతో గ్రావెల్ వ్యాపారం జోరుగా సాగుతోంది.గాలి ముద్దుకృష్ణమ నాయుడి హయాంలో గ్రావెల్ క్వారీలపై ఉక్కుపాదం మోపారు. తమిళనాడుకు మట్టి తరలించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రావెల్ క్వారీలు పుట్టగొడుగుల్లా విస్తరించాయి. పాతార్కాడు, మహారాజపురం, జగన్నాథపురం, జంబాడ ప్రాంతాల్లోని కొండలన్నీ మాయమై లోయలుగా మారిపోయాయి. వందల క్యూబిక్ మీటర్లకు అనుమతి పొంది వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తరలించి భారీగా ఆర్జించేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై విచారణకు ఆదేశించింది. అధికారులు సరైన విచారణ జరపకనే నివేదికలు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు మట్టి తరలింపు ఆగడం లేదు. ఈ విషయంలో తమిళనాడువాసులే హవా ప్రదర్శిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమిళనాడులోని గుమ్మడిపూండి, చెన్నై నుంచి వచ్చి వ్యాపారం సాగించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంతోనూ వీరి హవానే కొనసాగుతోంది.
తిరువళ్లూరు హైవేకూ..
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు హైవే నుంచి వేపంబట్టు, తన్నెకులం, సెవ్వాపేట మీదుగా నాలుగు లేన్ల హైవే రోడ్డు సుమారు 18 కిలోమీటర్ల నిర్మాణం చేయడానికి అనుమతి తీసుకున్నారు. 4.931 హెక్టార్లలో 98,620 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించడానికి డిసెంబరు 21న జిల్లా మైనింగ్ అధికారులు అనుమతి మంజూరు చేసి ఉన్నారు. అదే తమిళనాడు పరిధిలో కొండలు, గుట్టలున్నా అక్కడ అనుమతి లేకపోవడంతో ఇక్కడి మట్టి తరలిస్తున్నారని విజయపురం మండలవాసులు వాపోతున్నారు.
రైతుల సంతకం ఫోర్జరీ?
గ్రావెల్ క్వారీకి అనుమతి పొందాలంటే పంచాయతీ తీర్మానంతోపాటు మేటి రైతుల సంతకం తప్పనిసరి. గ్రావెల్ క్వారీకి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామాలు, పాఠశాలలు ఉండకూడదు. ఇందుకు భిన్నంగా అధికారులు మేటి రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి, సమాచారం తెలపకుండానే పంచాయతీ తీర్మానం చేసి.. రికార్డులు సృష్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వారీకి 700 మీటర్ల దూరంలో కాలేజీ, కిలోమీటరు దూరంలో రెండు గ్రామాలు, ఒకటిన్నర కిలోమీటరు దూరంలో మూడు గ్రామాలున్నాయని చెబుతున్నారు. ‘మహారాజపురంలో గ్రావెల్ క్వారీకి సర్వే నెంబరు 1/పీ అంటూ అనుమతి మంజూరు చేశారు. తాత్కాలిక అనుమతితో ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ సర్వే నెంబరు ఎక్కడుందో కూడా అధికారులకు తెలియదు. సర్వే నెంబరు 177, 178లో మట్టిని తీస్తున్నారు’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లు ధ్వంసం
పెద్ద పెద్ద టిప్పర్లలో టన్నులకొద్దీ మట్టి తరలిస్తుండటంతో కోసలనగరం - కనకమ్మసత్రం రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వాహనాల దుమ్ము ప్రభావంతో మామిడి పూత రావడం లేదని రైతులు చెబుతున్నారు.