Share News

‘కొత్త’ సందడి

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:38 AM

నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామునే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తొలి రోజున దైవ దర్శనం చేసుకుంటే ఏడాదంతా మంచే జరుగుతుందన్న భావనతో గుళ్లకు వెళ్లారు.

‘కొత్త’ సందడి
తిరుమల శ్రీవారి ఆలయ ముందు భక్తులు

నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామునే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తొలి రోజున దైవ దర్శనం చేసుకుంటే ఏడాదంతా మంచే జరుగుతుందన్న భావనతో గుళ్లకు వెళ్లారు. పార్కులు.. జలాశయాలు.. కొండా కోనల్లోను ఉత్సాహంగా గడిపారు. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

ఆధ్యాత్మికం

గోవిందా.. గోవిందా

తిరుమల శ్రీవారి ఆలయ ముందుభాగం మంగళవారం రాత్రి 11 గంటలకే భక్తులు, స్థానికులతో నిండిపోయింది. సరిగ్గా 12 గంటలు కాగానే ఆలయం వైపు తిరిగి శ్రీవారికి నమస్కరించారు. ఒక్కసారిగా గోవింద నామస్మరణలు చేయడంతో ఆ ప్రాంతం మార్మోగింది. కొందరు కళ్లు మూసుకుని ప్రార్థనలు చేస్తూ కనిపించారు. వేకువజాము 4 గంటల వరకు ఆలయం ముందు భక్తుల సందడి నెలకొంది. ఇక, బుధవారం రోజు తిరుమలలో వీఐపీలు మినహా సాధారణ భక్తుల రద్దీ తక్కువగానే కనిపించింది.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

కిక్కిరిసిన ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తీశ్వరాలయం బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 28 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 1,773మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 3,001మంది దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 977మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 320, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 84మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 78మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 31మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 27,009 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

పర్యాటకం

సదాశివకోనలో సందడి

ఏర్పేడు మండలంలోని చెల్లూరు పంచాయతీ వద్ద ఉన్న సదాశివకోన వద్ద ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సందర్శకులు పోటెత్తారు. జలాశయంలో కేరింతలు కొడుతూ మునిగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్‌ జలకళ సంతరించుకుంది.

- ఏర్పేడు (ఆంధ్రజ్యోతి)

జలపాత స్నానాలు

తిరుపతి నగరంలోని కపిలతీర్థానికి బుధవారం భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కరిణి వద్ద సెల్ఫీలు దిగారు. జలపాతం వద్ద స్నానాలు చేశారు. కామాక్షి సమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇలా.. భక్తులతో రోజంతా సందడి నెలకొంది.

- తిరుపతి (కపిలతీర్థం), ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 02 , 2025 | 01:38 AM