Share News

తిరుమలలో వైకుంఠ శోభ

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:21 AM

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర ఆలయం ఉత్తరద్వార దర్శనానికి సిద్ధమైంది. ఇందుకోసం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు. గురువారం అర్ధరాత్రి దాటాక వైకుంఠనాథుడి దర్శనానికి ఆలయ ద్వారాలు తెరిచారు. శుక్రవారం తెల్లవారుజామున ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించాక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

తిరుమలలో వైకుంఠ శోభ

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర ఆలయం ఉత్తరద్వార దర్శనానికి సిద్ధమైంది. ఇందుకోసం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు. గురువారం అర్ధరాత్రి దాటాక వైకుంఠనాథుడి దర్శనానికి ఆలయ ద్వారాలు తెరిచారు. శుక్రవారం తెల్లవారుజామున ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించాక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

నేటి నుంచి పదిరోజుల ఉత్తరద్వార దర్శనాలు

సుందరంగా ముస్తాబైన శ్రీనివాసుని ఆలయం

తిరుమల, జనవరి9(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం ఉత్తరద్వార దర్శనాలకు సిద్ధమైంది. పదిరోజుల పాటు జరిగే వేడుకకు శోభాయమానంగా ముస్తాబైంది. శుక్రవారం నుంచి ఈనెల 19 వరకు వైకుంఠ ద్వారాన్ని తెరిచి దర్శనం కల్పించనున్నారు. ఈక్రమంలో ఆలయాన్ని శోభాయమానం తీర్చిదిద్దారు. ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలతో అలంకరించారు. వైకుంఠద్వారం, బలిపీఠం, ధ్వజస్తంభం వంటి ప్రాంతాలను 1.40 కట్‌ఫ్లవర్స్‌తో అలంకరించారు. ఆలయం వెలుపల ఐదు టన్నుల పుష్పాలను అలంకరణకు వినియోగించారు. వాహన మండపం సమీపంలో ‘శ్రీరంగనాథమండపం’ సిద్ధం చేశారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పుష్పాలతో రంగనాథస్వామి ఆలయ సెట్టింగ్‌ వేశారు.

తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

గురువారం అర్థరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠద్వారాలు తెరుచుకున్నాయి. 12.05 గంటల సమయంలో తలుపులు తెరిచిన అర్చకులు శుక్రవారం వేకువజాము ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. 4.30 వీఐపీ దర్శనాలను కల్పించనున్నారు. టోకెట్లు, టికెట్లు పొందిన భక్తులను గురువారం అర్థరాత్రి12 గంటల నుంచి క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతించారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 8 గంటలకు ముగియనున్నాయి. తర్వాత సర్వదర్శనాలను ప్రారంభించనున్నారు.

టోకెన్‌ ఉన్నవారికే ఎంట్రీ, వసతి

టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను గురువారం రాత్రి నుంచి కంపార్టుమెంట్లలోకి అనుమతించారు. వారికే గదులను కేటాయించారు. టికెట్లు లేనివారు గదులు లేక షెడ్లు, పార్కులు, కార్యాలయాల ముందు, వసతి సముదాయాల్లో, ఫుట్‌పాత్‌లపైనే సేదతీరాల్సి వచ్చింది. చలికి వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.

ప్రత్యేకదర్శనాలన్నీ రద్దు

ఈపదిరోజులకు సంబంధించి ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1.40 లక్షలు, శ్రీవాణి టికెట్లు 19,500 జారీ చేశారు. తొలిమూడురోజులకు సామాన్య భక్తులకు స్లాటెడ్‌ సర్వదర్శనానికి సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేసింది. తర్వాత రోజులకు ఏరోజుకారోజు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవికాంప్లెక్స్‌ల ద్వారా జారీ చేయనున్నారు. పదిరోజుల్లో వీఐపీ బ్రేక్‌కు సిఫార్సులు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిబడ్డల తల్లిదండ్రులు వంటి ప్రత్యేకదర్శనాలు ఉండవు. శ్రీవారిమెట్టు మార్గంలోనూ దివ్యదర్శన టోకెన్‌ జారీ ఉండదు.

వీఐపీలకు చేసిన ఏర్పాట్లు

వీఐపీల పర్యటన నేపథ్యంలో తిరుమలలో 12 వేల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఎంబీసీ, ఔటర్‌రింగ్‌రోడ్డు, రాంభగీచా, పరకామణి భవనం, అర్చక నిలయం ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. వీఐపీలకు దర్శన టికెట్లు, గదుల కేటాయింపు నాలుగు కేంద్రాల్లో జరిగాయి. వెంకటకళ అతిథిగృహంలోని కౌంటర్‌లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, మంత్రులు, విప్‌లు, స్పీకర్లకు టికెట్లను జారీ చేశారు. సన్నిధానం కౌంటర్‌లో టీటీడీ బోర్డు చైర్మన్‌, బోర్డు సభ్యులు, వారి సిఫార్సులపై టికెట్లు కేటాయించారు. నారాయణగిరి-4 కౌంటర్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టికెట్లను జారీ చేశారు. వకుళమాత విశ్రాంతి భవనం కౌంటర్‌ ద్వారా ఆలిండియా సర్వీస్‌ అధికారులకు దర్శన టికెట్లు, గదుల కేటాయింపు జరిగింది.

నేడు స్వర్ణరథోత్సవం

శుక్రవారంఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి స్వర్ణరథంపై కొలవుదీరి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు వాహనమండపంలో శ్రీమలయప్పస్వామి దర్శనం ఉంటుందన్నారు. శనివారం ద్వాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము 5.30 గంటలకు సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన కార్యక్రమం జరుగుతుంది.

Updated Date - Jan 10 , 2025 | 01:21 AM