Share News

CM Chandrababu : నెలాఖరులోగా నిధులు తెచ్చుకోవాలి

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:45 AM

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

CM Chandrababu : నెలాఖరులోగా నిధులు తెచ్చుకోవాలి

  • కేంద్రంతో సత్వరం సంప్రదింపులు జరపాలి

  • ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం

  • కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర నిధులపై సమీక్ష

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖపై శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్రప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో చర్చించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖలకు నిధులు రావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రంతో సత్వరం సంప్రదింపులు జరిపి, రావాల్సిన నిధులను మార్చి 31లోగా తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాధారణంగా ఏటా మార్చి నెలలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అధిక నిధులు వస్తుంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లు, పథకాల నిధులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఇచ్చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం కూడా రాష్ట్రాలకు సహకరిస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏపీకి వివిధ పథకాలకు సంబంధించి రూ. 7,000 కోట్ల వరకు నిధులొచ్చాయి. నెలాఖరులోగా మరో రూ. 7,000 కోట్ల నిధులు రావాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.


మంత్రి ఫరూక్‌కు సీఎం పరామర్శ

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఫరూక్‌ ఇంటికి శనివారం బాబు వెళ్లారు. ఇటీవల ఫరూక్‌ సతీమణి షెహనాజ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ఫరూక్‌, కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు.

Updated Date - Mar 23 , 2025 | 03:45 AM