Share News

CM Chandrababu Naidu: నేడు, రేపు నారావారిపల్లెలోనే సీఎం

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:01 AM

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏటా ఆనవాయితీ ప్రకారం సీఎం చంద్రబాబు ఆదివారం తమ స్వగ్రామైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె చేరుకున్నారు.

CM Chandrababu Naidu: నేడు, రేపు నారావారిపల్లెలోనే సీఎం

తిరుపతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏటా ఆనవాయితీ ప్రకారం సీఎం చంద్రబాబు ఆదివారం తమ స్వగ్రామైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె చేరుకున్నారు. పురపాలక మంత్రి పొంగూరు నారాయణతో కలిసి సీఎం విజయవాడ నుంచి విమానంలో సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీఐజీ శేముషీ బాజ్‌పాయ్‌, ఇన్‌చార్జి ఎస్పీ మణికంఠ తదితరులు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు ఆయన నారావారిపల్లె చేరుకున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి శనివారమే స్వగ్రామం చేరుకోగా.. లోకేశ్‌ తన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్‌తో కలసి ఆదివారం వచ్చారు. తల్లి,భార్యాబిడ్డలతో కలిసి సాయంత్రం నారావారిపల్లె సమీపంలోని శేషాపురం వెళ్లి.. శేషాచల లింగేశ్వరాలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. అనంతరం కందులవారిపల్లి వెళ్లి అక్కడ వినాయకుడి ఆలయంలో పూజలు జరిపారు. తర్వాత ఆ గ్రామంలోనే ఉన్న చంద్రబాబు సోదరి హైమావతి నివాసానికి వెళ్లారు. కాగా.. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి 15వ తేదీ వరకూ అక్కడే గడుపుతారు. సోమవారం నారావారిపల్లె అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం కూడా అక్కడే ఉండి బుధవారం మధ్యాహ్నం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - Jan 13 , 2025 | 03:01 AM