బెల్టుషాపులు, ప్రజా సమస్యలపై సభ్యుల ఆగ్రహం
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:59 AM
గ్రామాల్లో అనధికార మద్యం బెల్టుషాపులు, తీర్మానాలు లేకుండా రోడ్ల నిర్మాణాలు, జగనన్న లేఅవుట్లలో అక్రమాలు వంటి వివిధ సమస్యలపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లవరం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అనధికార మద్యం బెల్టుషాపులు, తీర్మానాలు లేకుండా రోడ్ల నిర్మాణాలు, జగనన్న లేఅవుట్లలో అక్రమాలు వంటి వివిధ సమస్యలపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యిళ్ల శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సమావేశం వాడివేడిగా సాగింది. గూడాల, దేవగుప్తంతో పాటు పలు గ్రామాల్లో ఊరికి పది మద్యం బెల్టు షాపులతో మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్‌లు దాకరపు చిరంజీవిరావు, సాధనాల వెంకట్రావుతో పాటు పలువురు ధ్వజమెత్తారు. డి.రావులపాలెంలో గతంలో ఇచ్చిన జగనన్న ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరిగాయని, నిరుపేదలకు కాకుండా ఇళ్లు ఉన్న వారికే ఇళ్ల స్థలాలు ఇచ్చారని సర్పంచ్ ఉండ్రు భగవాన్‌దాస్ ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకు న్యాయం చేయాలన్నారు. గడపగడపకు నిధులు రాలేదని ఎంపీటీసీ ఎన్.మౌనికవరలక్ష్మి ఆరోపించగా, ప్రభుత్వం మారాక గడపగడపకు నిధులు ఆపేశారని ఎంపీపీ యిళ్ల శేషగిరిరావు అన్నారు. తాడికోన, గూడాల ఆర్‌అండ్‌బీ రోడ్లు ఆక్రమణలకు గురయ్యాయని, దేవగుప్తం సచివాలయం వద్ద టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌లు లేవనెత్తారు. మొగళ్లమూరు నుంచి రెబ్బనపల్లి రోడ్డు అధ్వానంగా తయారైందని సర్పంచ్ రాయుడు విష్ణుత్రిమూర్తులు ఆరోపించారు. తీర్మానాలు లేకుండా గ్రామాల్లో రోడ్లు పెడుతున్నారని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. ఓఎన్జీసీ సీఎస్‌ఆర్ నిధులు రూ.11.8లక్షలతో గోడిపాలెం స్కూలు అభివృద్ధి చేస్తామని పీఆర్‌ఏఈ సయ్యద్ ఫకీర్ తెలిపారు. మద్యం అక్రమ అమ్మకాలపై ఎక్సైజ్ దృష్టికి తీసుకువెళుతున్నట్టు తహశీల్దార్ ఎంవీవీ నరసింహం వివరించారు. ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని మండల ప్రత్యేకాధికారి కర్నీడి మూర్తి అన్నారు. వయసు దాటిన 180మందికి వితంతు, వృద్ధాప్య పింఛన్లు ఆగిపోయాయని ఎంపీటీసీ పెచ్చెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. దాళ్వాకు సక్రమంగా సాగునీరు అందించాలని సర్పంచ్‌లు కోరారు. ఎంపీడీవో బీఎస్‌ఎస్ కృష్ణమోహన్, వైస్ ఎంపీపీ వడ్డి గంగతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.